చరిత్ర సృష్టించిన దేశీ మార్కెట్లు | Sensex soars 406 points, just shy of 22,000 | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన దేశీ మార్కెట్లు

Published Sat, Mar 8 2014 1:02 AM | Last Updated on Sat, Sep 2 2017 4:27 AM

చరిత్ర సృష్టించిన దేశీ మార్కెట్లు

చరిత్ర సృష్టించిన దేశీ మార్కెట్లు

ఆకాశమే హద్దుగా స్టాక్ మార్కెట్లు మరోసారి చెలరేగిపోయాయి. అన్నివైపుల నుంచీ వెల్లువెత్తిన కొనుగోళ్ల అండతో ఇండెక్స్‌లు సరికొత్త రికార్డులకు తెరతీశాయి.

ఆకాశమే హద్దుగా స్టాక్ మార్కెట్లు మరోసారి చెలరేగిపోయాయి. అన్నివైపుల నుంచీ వెల్లువెత్తిన కొనుగోళ్ల అండతో ఇండెక్స్‌లు సరికొత్త రికార్డులకు తెరతీశాయి. సెన్సెక్స్ ఇంట్రాడేలో కొత్త చరిత్రను లిఖిస్తూ 22,000కు దగ్గరవగా, నిఫ్టీ 6,550 సమీపానికి చేరింది. ట్రేడింగ్ ముగిసేసరికి ఇటీవల కానరాని విధంగా సెన్సెక్స్ 406 పాయింట్ల ‘హై’జంప్‌తో 21,920 వద్ద నిలవగా, 125 పాయింట్లు ఎగసిన నిఫ్టీ 6,527 వద్ద స్థిరపడింది. వెరసి 2013 డిసెంబర్ 9న నమోదైన నిఫ్టీ ఇంట్రాడే హై 6,415 కూడా తుడిచిపెట్టుకుపోయింది!

 రానున్న సార్వత్రిక ఎన్నికలలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటవుతుందన్న అంచనాలు, క్యూ3లో కరెంట్ ఖాతా లోటు జీడీపీలో 1%లోపునకు కట్టడికావడం, డాలరుతో మారకంలో రూపాయి పుంజుకోవడం వంటి అంశాలు ఇన్వెస్టర్లకు జోష్‌నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. వీటికితోడు విదేశీ ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐలు) పెట్టుబడుల జోరు ఇండెక్స్‌లను హైజంప్ చేయిస్తోంది. గడిచిన 15 రోజుల్లో రూ. 7,273 కోట్లు ఇన్వెస్ట్‌చేసిన ఎఫ్‌ఐఐలు వారాంతం రోజున ఏకంగా రూ. 2,577 కోట్లకుపైగా విలువైన షేర్లను కొనుగోలు చేశారు. ఫలితంగా ఇంట్రాడేలో 447 పాయింట్ల వరకూ ఎగసిన సెన్సెక్స్ 21,961ను తాకగా, నిఫ్టీ గరిష్టంగా 136 పాయింట్లు దూసుకెళ్లి 6,538ను చేరింది. గత నాలుగు రోజుల్లో సెన్సెక్స్ 800 పాయింట్లు పురోగమిస్తే, నిఫ్టీ 250 పాయింట్లు జమ చేసుకుంది.

 ఒక్క రోజులో...
 ఒక్క రోజులో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ(క్యాపిటలైజేషన్) రూ. 85,000 కోట్లమేర ఎగసింది. శుక్రవారం ట్రేడింగ్‌లో ఇటీవల ఎరుగని విధంగా బ్యాంకింగ్ షేర్లు దుమ్ముదులిపాయి. దీంతో బ్యాంకెక్స్ 5% దూసుకెళ్లగా, రియల్టీ, క్యాపిటల్ గూడ్స్, ఆయిల్ ఇండెక్స్‌లు సైతం 5-4% స్థాయిలో పుంజుకున్నాయి. కాగా, హెల్త్‌కేర్, ఐటీ రంగాలు 2% నీరసించాయి. రూపాయి బలపడటంతోపాటు, ఇటీవల ఈ రంగాలు భారీగా లాభపడ్డ నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు అమ్మకాలు చేపట్టినట్లు నిపుణులు చెప్పారు.

 ఇతర విశేషాలివీ...
  బ్యాంకింగ్‌లో యస్‌బ్యాంక్, ఐసీఐసీఐ, యాక్సిస్, బీవోబీ, ఇండస్‌ఇండ్, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, పీఎన్‌బీ వంటి దిగ్గజ  షేర్లు 7-4% మధ్య ఎగిశాయి.

  ఇంజనీరింగ్ దిగ్గజం ఎల్‌అండ్‌టీ 5% ఎగసి 52 వారాల గరిష్టాన్ని తాకింది. ఎస్‌అండ్‌పీ క్రెడిట్ రేటింగ్‌ను పెంచడంతో భారతీ ఎయిర్‌టెల్ 5% పెరిగింది. ఇక భెల్, ఆర్‌ఐఎల్, మారుతీ వంటి దిగ్గజాలు సైతం ఇదే స్థాయిలో పురోగమించడం విశేషం!
  రియల్టీ దిగ్గజం డీఎల్‌ఎఫ్ 10% దూసుకెళ్లగా, ప్రెస్టీజ్ ఎస్టేట్స్, హెచ్‌డీఐఎల్, డీబీ, ఇండియాబుల్స్, శోభా డెవలపర్స్ 7-3.5% మధ్య పుంజుకున్నాయి.

  అదానీ పోర్ట్స్, అపోలో టైర్స్, భారతీ ఇన్‌ఫ్రా, ఎస్‌కేఎస్ మైక్రో, హెచ్‌సీసీ తదితర 150 షేర్లు ఏడాది గరిష్టాన్ని తాకడం గమనార్హం!
  సెన్సెక్స్ దిగ్గజాలలో డాక్టర్ రెడ్డీస్, విప్రో, ఇన్ఫోసిస్, సన్ ఫార్మా 3.6-1.4% మధ్య డీలాపడ్డాయి.
  బీఎస్‌ఈలో రూ. 3,409 కోట్లు, ఎన్‌ఎస్‌ఈలో రూ. 19,150 కోట్లు చొప్పున టర్నోవర్ నమోదైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement