రైల్వే ఈ టికెట్లపై గుడ్‌న్యూస్
న్యూడిల్లీ: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. డీమానిటైజేషన్ తరవాత డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే లక్ష్యంతో రైల్వే ఈ టికెట్లపై ఉపసంహరించుకున్న సర్వీసు చార్జ్‌ను గడువును కేంద్రం మరోసారి పొడిగించింది. ప్రయాణికుల సౌలభ్యంకోసం భారత రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబరు వరకు బుక్ చేసుకున్న టిక్కెట్లపై సర్వీసు చార్జ్ మినహాయింపు కొనసాగనుందని రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి ఐఆర్‌సీటీసీలో రైలు టిక్కెట్లు బుక్ చేసుకున్నవారికి సర్వీస్ చార్జ్ మినహాయింపు సెప్టెంబర్ 2017వరకు కొనసాగనుంది. తాజా ఆదేశాలప్రకారం సెప్టెంబరు 30 వరకు ఆన్‌లైన్‌లో రైలు టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి సర్వీస్ ఛార్జ్ ఉండదు. తద్వారా తమకు రూ.500కోట్ల నష్టం వాటిల్లనుందని రైల్వే శాఖ అంచనా వేసింది ఈ మేరకు ఈ నష్టాన్ని తిరిగి చెల్లించాలని కోరుతూ రైల్వే మంత్రిత్వశాఖ ఆర్థిక మంత్రిత్వ శాఖకు లేఖ రాసినట్టు వెల్లడించింది.
పెద్దనోట్ల రద్దు అనంతరం మొదట 2016 నవంబర్ 23 నుంచి సర్వీస్ చార్జ్ మినహాయింపు ప్రకటించింది. ఆ తర్వాత ఈ అవకాశాన్ని ఏడాది మార్చి 31 వరకు కల్పించారు. అనంతరం ఈ గడువును మరో మూడు నెలలపాటు అంటే 2017, జూన్ 30వరకు పొడిగించింది. సాధారణంగా ఐఆర్‌సీటీసీలో టికెట్ బుక్ చేసుకుంటే రూ. 20 నుంచి రూ. 40 వరకు సర్వీస్ చార్జ్ అయ్యే సంగతి తెలిసినదే.