దుగరాజపట్నం పోర్టుకు కేంద్రం నిధులు!
న్యూఢిల్లీ: రాష్ట్రంలోని పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేయనున్న దుగరాజపట్నం, పశ్చిమ బెంగాల్‌లో నెలకొల్పనున్న సాగర్ ప్రధాన పోర్టులకు కేంద్రం నిధుల సహకారాన్ని అందించాలని షిప్పింగ్ మంత్రిత్వ శాఖ కోరుతోంది. ఈ మేరకు త్వరలో కేబినెట్‌కు ప్రతిపాదనను సమర్పించనున్నట్లు ఆ శాఖ అధికారి ఒకరు వెల్లడించారు.
ఈ రెండు మేజర్ పోర్టులను ప్రభుత్వం ఇప్పటికే ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం గనుక వయబిలిటీ గ్యాప్ ఫండింగ్(వీజీఎఫ్)ను అందిస్తే ఈ పోర్టుల అభివృద్ధికి మరింతమంది డెవలపర్లను ఆకర్షించేందుకు వీలవుతుందని షిప్పింగ్ శాఖ చెబుతోంది. కాగా, సాగర్ పోర్టులో రైల్ బ్రిడ్జిని కూడా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది. దీంతో ఈ పోర్టులో రాబడి రేటు(రేట్ ఆఫ్ రిటర్న్) దాదాపు 8 శాతమే ఉండొచ్చని.. వీజీఎఫ్ లేకుండా బిడ్డర్లను ఆకట్టుకోవడం కష్టసాధ్యమనేది షిప్పింగ్ శాఖ అభిప్రాయం.
దుగరాజపట్నం పోర్టులో రేట్ ఆఫ్ రిటర్న్ 18 శాతం మేర(భూమి విలువ కాకుండా) ఉంటుందని, ఈ రెండు పోర్టులకు వీజీఎఫ్ అంశాన్ని పరిశీలించాల్సిందిగా కేబినెట్‌కు ప్రతిపాదించనున్నామని సంబంధిత అధికారి పేర్కొన్నారు. భారీ ప్రాజెక్టులకు దీర్ఘకాలిక నిర్మాణ వ్యవధి ఇతరత్రా కారకాల వల్ల ఆర్థికపరమైన నిధుల సమస్య, తక్కువ లాభదాయకత వంటివి ఎదురయ్యేపక్షంలో ప్రభుత్వం అందించే నిధుల సహకారాన్ని వీజీఎఫ్‌గా వ్యవహరిస్తారు.
కాగా, సాగర్ పోర్టుకు రెండుమూడు నెలల్లో ప్రాథమిక బిడ్‌లను ఆహ్వానించనున్నట్లు షిప్పింగ్ శాఖ మంత్రి జీకే వాసన్ ఇటీవలే వెల్లడించారు. అదేవిధంగా దుగ్గరాజపట్నం పోర్టుకు కూడా తగిన స్థలాన్ని గుర్తించనున్నట్లు తెలిపారు. ఈ పోర్టులను ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య(పీపీపీ) పద్ధతిలో అభివృద్ధి చేయనున్నారు. ప్రస్తుత 2013-14 ఆర్థిక సంవత్సరంలో(జనవరి వరకూ) కేంద్ర ప్రభుత్వం పీపీపీ విధానంలో 30 పోర్టు నిర్మాణ ప్రాజెక్టులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టుల మొత్తం సామర్థ్యం 217.57 మిలియన్ టన్నులు కాగా, మొత్తం పెట్టుబడుల విలువ రూ.2.07 లక్షల కోట్లుగా అంచనా. రెండు అంతకంటే ఎక్కువ బెర్తులు ఉండటంతోపాటు సముద్రమార్గంలో రవాణా జరిపే నౌకల నుంచి నెలకు లక్ష టన్నుల కార్గో నిర్వహణ సామర్థ్యం, అందుకుతగ్గ యంత్రపరికరాలు ఉన్న పోర్టులను ప్రధాన పోర్టులుగా వ్యవహరిస్తున్నారు.