‘అక్షయ’ అమ్మకాలు ఓకే! | Should you buy gold this Akshaya Tritiya? | Sakshi
Sakshi News home page

‘అక్షయ’ అమ్మకాలు ఓకే!

Published Sat, May 3 2014 1:52 AM | Last Updated on Sat, Sep 2 2017 6:50 AM

‘అక్షయ’ అమ్మకాలు ఓకే!

‘అక్షయ’ అమ్మకాలు ఓకే!

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అక్షయ తృతీయకు దేశవ్యాప్తంగా స్వర్ణ ప్రియులు తమ సెంటిమెంటును కొనసాగించారు. చిన్న చిన్న ఆభరణాలను ఎక్కువగా కొనడం విశేషం. ఎన్నికల నగదు ఆంక్షలు, అధిక బంగారం ధర కారణంగా ఈ దఫా అక్షయ తృతీయకు అమ్మకాలు అంతంతగానే వుంటాయని వ్యాపారస్తులు భావించినప్పటికీ, షాపులు కళకళలాడాయి. కానీ గతేడాదితో పోలిస్తే అమ్మకాలు తక్కువగానే వున్నాయని బులియన్ వర్తకులు వివరించారు.  వినియోగదారుల సౌకర్యార్థం కొన్ని దుకాణాలు ఉదయం 8 నుంచే తెరిచారు. పెళ్లిళ్ల సీజన్ కూడా కావడంతో కస్టమర్లతో షాపులు కిటకిటలాడాయి.

పెళ్లి కోసం ఆభరణాలను ఇప్పటికే ఆర్డరు ఇచ్చినవారు అక్షయ తృతీయ రోజు వాటిని తీసుకెళ్లారని ఆంధ్రప్రదేశ్ గోల్డ్ సిల్వర్ జువెలరీ, డైమండ్ మర్చంట్స్ అధ్యక్షుడు బి.సూర్యప్రకాశ్‌రావు సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. మధ్య తరగతి కుటుంబాల వారు చిన్న ఆభరణాలను ఎక్కువగా కొనుగోలు చేశారని ఆయన చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల్లో అమ్మకాలు జోరుగా ఉన్నాయని వరల్డ్ గోల్డ్ కౌన్సి ల్ తెలిపింది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా పుత్తడికి మంచి డిమాండ్ ఉంటుందని, ఇందుకు అక్షయ తృతీయ అమ్మకాలు నిదర్శనమని వెల్లడించింది.

 ఆఫర్లే ఆఫర్లు..
 అక్షయ తృతీయ సందర్భంగా దాదాపు అన్ని దుకాణాలు పలు ఆఫర్లను ప్రకటించాయి. బహుమతిగా బంగారు నాణేలను సైతం అందించాయి. వజ్రాభరణాలు, వజ్రాలపై భారీ తగ్గింపుతోపాటు బంగారు ఆభరణాల తయారీ వ్యయంపై డిస్కౌంట్ వంటి ఆఫర్లు అమ్మకాలు పెరిగేందుకు దోహదం చేసింది. కొన్ని నెలలుగా బంగారం అమ్మకాలు లేక దుకాణాలు బోసిగా దర్శనమిచ్చాయి. అక్షయ తృతీయ రాకతో ఒక్కసారిగా కళకళలాడాయని ఆర్‌ఎస్ బ్రదర్స్ అమీర్‌పేట్ షోరూం జువెలరీ విభాగం మేనేజర్ నాగ కిరణ్ చెప్పారు. తమ అంచనాలకు తగ్గట్టుగా అమ్మకాలు ఉన్నాయని ఆల్ ఇండియా జెమ్స్ జువెలరీ ట్రేడ్ ఫెడరేషన్(జీజేఎఫ్) డెరైక్టర్ మోహన్‌లాల్ జైన్ తెలిపారు.

 అక్షయ తృతీయ కోసం సుమారు 40-50 టన్నుల బంగారం ఏప్రిల్‌లో భారత్‌కు దిగుమతి అయి ఉంటుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా. గతేడాది ఇది 200 టన్నులున్నట్టు సమాచారం. శుక్రవారం హైదరాబాద్ మార్కెట్లో మేలిమి బంగారం ధర 10 గ్రాములకు రూ.30 వేలుంది. ఆభరణాల అమ్మకాలు పెంచుకునేందుకు ఈసారి బంగారం వర్తకులు హోం డెలివరీ సేవలను విస్తృతంగా అందిస్తున్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్లడం సమస్యగా పరిణమించడమే ఇందుకు ప్రధాన కారణం. మరోవైపు క్రెడిట్, డెబిట్ కార్డులతో చెల్లింపులు పెద్ద ఎత్తున పెరిగాయి. అక్షయ తృతీయ సందర్భంగా పుత్తడి కొనుగోళ్లు మరో రెండురోజులు కొనసాగుతాయని వ్యాపారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement