హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పరుపుల తయారీ దిగ్గజం స్లీప్‌వెల్... కంఫర్ట్ సెల్ టెక్నాలజీతో నూతన శ్రేణిని రూపొందించింది. అత్యంత సౌకర్యవంతంగా ఉండేలా ఈ పరుపులను డిజైన్ చేశామని, కస్టమర్ల వ్యక్తిగత అభిరుచులకు తగ్గట్టుగా (కస్టమైజేషన్) వీటిని తయారు చేసి ఇస్తామని స్లీప్‌వెల్ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్న షీలా ఫోమ్ డైరెక్టర్ రాకేశ్ చహర్ సోమవారమిక్కడ తెలిపారు.
కంపెనీ ప్రతినిధులు భూషన్ పాఠక్, శశిధర్ బాబుతో కలసి మీడియాతో మాట్లాడారు. కంఫర్ట్ సెల్ టెక్నాలజీకి పేటెంటుకు దరఖాస్తు చేశామని తెలియజేశారు. నాలుగు మోడళ్లను ప్రవేశపెట్టామని, వీటి ధరలు రూ.40,000 మొదలుకుని రూ.1 లక్ష వరకు ఉన్నాయని వివరించారు. కస్టమైజేషన్‌కు ఎటువంటి అదనపు చార్జీ లేకుండానే ప్రమోషన్‌లో భాగంగా ఆఫర్ చేస్తున్నట్టు చెప్పారు.
15 శాతంపైగా వృద్ధి..
స్లీప్‌వెల్‌కు భారత మార్కెట్ నుంచి గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,450 కోట్ల టర్నోవర్ సమకూరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15 శాతంపైగా వృద్ధి ఆశిస్తున్నట్టు రాకేశ్ చహర్ వెల్లడించారు. ‘సరైన పరుపు ఉంటేనే నిద్ర బాగా పడుతుంది.
ఈ విషయం చాలా మందికి తెలియదు. అందుకే మా షోరూంల ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. వినియోగదార్లకు అవసరమైన రీతిలో పరుపులను రూపొందించి సరఫరా చేస్తున్నాం. చిన్న పట్టణాల్లో మా ఔట్‌లెట్లు ఉన్నచోట రూ.20 వేల ఖరీదైన పరుపులూ కొంటున్నారు. దేశవ్యాప్తంగా స్లీప్‌వెల్ షోరూంలు 800, షాప్ ఇన్ షాప్స్ 1,200ల దాకా ఉన్నాయి. స్లీప్‌వెల్ ఆదాయంలో ఔట్‌లెట్ల నుంచి 45 శాతం సమకూరుతోంది’ అని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment