
న్యూఢిల్లీ: స్మార్ట్ హంగులతో ఉన్న టెలివిజన్లకు వినియోగదారుల ఆదరణ పెరుగుతోంది. అక్టోబర్లో దేశవ్యాప్తంగా జరిగిన టీవీల అమ్మకాల్లో 55 శాతం వాటా స్మార్ట్ టీవీలదే. పెద్ద పట్టణాల్లో అయితే స్మార్ట్ టీవీల విక్రయాలు 65 శాతం. క్రితం ఏడాది ఇదే మాసంలో స్మార్ట్ టీవీల అమ్మకాలు 45 శాతంగానే ఉండడం గమనార్హం.
ఇంటర్నెట్‌తో అనుసంధానమనేది స్మార్ట్ టీవీకి అదనపు ఆకర్షణగా మారింది. బ్రాడ్ బ్యాండ్ అందుబాటు ధరల్లోకి రావడం స్మార్ట్ టీవీలకు మహర్ధశ పట్టించిందని అనుకోవచ్చు. యాప్స్‌కు అవకాశం, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్ వంటి స్ట్రీమింగ్ సర్వీసులు స్మార్ట్ టీవీని కొనేలా చేస్తున్నాయి. దీనికి తోడు ఇతర టీవీలకు, స్మార్ట్ టీవీల మధ్య ధరల పరంగా వ్యత్యాసం తగ్గిపోవడం ప్రధాన కారణాలని ఈ రంగానికి చెందిన వారు చెబుతున్నారు.
యువత ఓటు స్మార్ట్‌కే
జీఎఫ్‌కే సంస్థ వెల్లడించిన గణాంకాల ప్రకారం చూస్తే... ఈ ఏడాది జనవరిలో మొత్తం టీవీల అమ్మకాల్లో స్మార్ట్ టీవీల వాటా 45 శాతంగా ఉంటే, సెప్టెంబర్ నాటికి 50 శాతానికి చేరింది. అక్టోబర్ నెలకు సంబంధించి జీఎఫ్‌కే గణాంకాలు అందుబాటులో లేవు. కానీ, దేశవ్యాప్తంగా అక్టోబర్‌లో స్మార్ట్ టీవీల అమ్మకాలు 55 శాతానికి, పెద్ద పట్టణాల్లో 65 శాతానికి చేరాయని, పండుగలకు తోడు, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటివి భారీగా ఆఫర్లివ్వటం ఇందుకు కారణమని ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ టీవీల విభాగం హెడ్ రిషిటాండన్ తెలిపారు. పట్టణాల్లో యువ వినియోగదారులు స్మార్ట్ టీవీల వృద్ధికి ప్రధాన చోదకులుగా మారినట్టు సోనీ ఇండియా విక్రయాల అధిపతి సతీష్ పద్మనాభన్ చెప్పారు.
తాము నాన్ స్మార్ట్ టీవీల మోడళ్లను తగ్గించేశామని, ప్రారంభ స్థాయిలో 24, 32, 40 అంగుళాల్లో ఒకే మోడల్‌ను అందిస్తున్నామని చెప్పారు. సంప్రదాయ టీవీలు, స్మార్ట్ టీవీల మధ్య ఏడాది క్రితం వ్యత్యాసం రూ.7,000– 8,000 మధ్య ఉంటే, అదిపుడు రూ.2,000– 3,000కు తగ్గిపోయినట్టు వ్యూ టెలివిజన్ సీఈవో దేవిత సరాఫ్ తెలిపారు. దీంతో యువత స్మార్ట్ టీవీలకు మళ్లినట్టు చెప్పారు. ఇక తమ స్టోర్లలో అమ్ముడైన టీవీల్లో 90% స్మార్ట్ టీవీలేనని క్రోమా రిటైల్ దుకాణాల చీఫ్ ఎగ్జిక్యూటివ్ అవిజిత్ మిత్రా తెలిపారు. వినియోగదారులు పెద్ద తెరల టీవీలను ఇష్టపడుతున్నారని, సులభంగా ఫైనాన్స్ లభిస్తుండడంతో వీటిలో అధిక శాతం స్మార్ట్ టీవీలే ఉంటున్నాయని చెప్పారు.
సంప్రదాయ టీవీలతో పోలిస్తే స్మార్ట్ టీవీల అమ్మకాలు గత ఏడాదిలో రెట్టింపైనట్టు ముంబైకి చెందిన రిటైల్ చెయిన్ కొహినూర్ డైరెక్టర్ విషాల్ మేవాని సైతం పేర్కొనడం స్మార్ట్ ట్రెండ్‌ను తెలియజేస్తోంది. ధరల పరంగా పోటీనిచ్చే టీసీఎల్, షావోమీ బ్రాండ్ల రాకతో స్మార్ట్ టీవీలు కొనేవారి సంఖ్య పెరిగినట్టు చెప్పారు. మన దేశ టీవీల మార్కెట్ పరిమాణం రూ.22,000 కోట్లుగా ఉంటుందని అంచనా. ఏటా 6–7 శాతం స్థాయిలో వృద్ధి చెందుతుంటే, స్మార్ట్ టీవీల అమ్మకాల్లో ఈ వృద్ధి ఏటా 20–21% స్థాయిలో ఉండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment