పండుగ అమ్మకాల్లో 25% వృద్ధి!
సోనీ ఇండియా ఎండీ కెనిచిరో హిబి
సాక్షి, విశాఖపట్నం: ఈ పండుగల సీజన్లో గత ఏడాదితో పోలిస్తే అమ్మకాల్లో 25 శాతం వృద్ధిని సాధిస్తామని సోనీ సంస్థ ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. గత సంవత్సరం ఆగస్టు నుంచి నవంబర్ వరకు పండుగల సీజన్లో దేశవ్యాప్తంగా రూ.325 కోట్ల విలువైన సోనీ ఉత్పత్తుల్ని విక్రయించినట్లు సంస్థ ఇండియా ఎండీ కెనిచిరో హిబి చెప్పారు. 2016 ఆర్థిక సంవత్సరం మొత్తమ్మీద 20 శాతం వృద్ధి సాధించినట్టు చెప్పరాయన. గురువారం రాత్రి విశాఖ శంకరమఠం రోడ్డులోని సోనీ షోరూమ్‌ను ఆయన సందర్శించి... విలేకరులతో మాట్లాడారు.
ఈ సీజన్లో తమ ఉత్పత్తులపై ఆకర్షణీయమైన ఆఫర్లతో పాటు తేలికపాటి రుణ సదుపాయాన్ని కూడా కల్పించామని, ఈ ఆఫర్లు సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 19 వరకు కొనసాగుతాయని కెనిచిరో హిబి తెలియజేశారు. సోనీ సంస్థకు ఆంధ్రప్రదేశ్ అత్యంత కీలకమైనదంటూ... ఏపీలోని విశాఖ, విజయవాడ, తిరుపతి నగరాలు తమకు కీలమన్నారు. దేశవ్యాప్తంగా తమ కు 12 వేలకు పైగా డీలర్లు, పంపిణీదార్లు, 250కి పైగా ఎక్స్‌క్లూజివ్ అవుట్‌లెట్లు, 349 సర్వీస్ అవుట్‌లెట్లు ఉన్నట్లు తెలియజేశారు. తమ సంస్థ మొబైల్ ఫోన్ల వ్యాపారం కూడా పెరుగుతోందన్నారు. జీఎస్‌టీ వల్ల తమకు సానుకూల ఫలితా లే వస్తున్నాయని, రికవరీ శాతం కూడా పెరిగిందని చెప్పారాయన. విలేకరుల సమావేశంలో విశాఖ షోరూం మేనేజింగ్ పార్టనర్లు జగదీష్, చైతన్య, బ్రాంచి హెడ్ సంగమేష్ తదితరులు పాల్గొన్నారు.