బ్రిటన్‌లో బుధవారం ఒక్క రోజే 36 కరోనా (కొవిడ్–19) వైరస్ కేసులు బయటపడ్డాయి. ఇక్కడ ఒక్క రోజే ఇంతమందికి వైరస్ సోకడం ఇదే మొదటిసారి. దీంతో అక్కడ ఇప్పటివరకు వైరస్ బాధితుల సంఖ్య 87కు పెరిగింది. అత్యంత ప్రమాదకరమైన ఈ వ్యాధి వల్ల మృత్యువాత పడే అవకాశం ఉందంటూ ఇంగ్లండ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ క్రిస్ విట్టీ గురువారం దేశ పౌరులను హెచ్చరించారు. వైరస్ విస్తరించకుండా సరైన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. (కరోనా దెబ్బకు కుప్పకూలిన ‘ఫ్లైబీ’)
ఈ నేపథ్యంలో లండన్‌లోని తమ ప్రధాన కార్యాలయాలను నైక్, సోని పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీలు మూసివేశాయి. ఇంటి నుంచి పనిచేయాల్సిందిగా సోని కంపెనీ తమ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసింది. బెల్‌ఫాస్ట్‌లోని ఆపిల్ స్టోర్‌లో ఓ ఉద్యోగికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడంతో బుధవారం కార్యాలయాన్ని, ఆ కార్యాలయం ఉన్న మైఫేర్ భవనాన్ని పూర్తిగా శుద్ధి చేశారు. ఇవాళ్టి (గురువారం) నుంచి కొంతకాలంపాటు తమ స్టోర్‌ను మూసివేస్తున్నట్లు ఆపిల్ ప్రకటించింది. (అమెజాన్, ఫేస్బుక్కు కరోనా సెగ )
లండన్‌లోని డిలాయిట్ ఉద్యోగికి, గోల్డ్‌స్మిత్స్ యూనివర్శిటీలో ఓ విద్యార్థికి కరోనా వైరస్ సోకినట్లు తాజా వార్తలు తెలియజేస్తున్నాయి. ఎవరైనా కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్లయితే వారు వెంటనే సంబంధిత ఆస్పత్రిని సంప్రతించాలని, మొదటి రోజు నుంచే సిక్ లీవుకు పూర్తి వేతనాలు చెల్లిస్తామని కూడా బ్రిటన్ అధికారులు ప్రకటించారు. సాధారణంగా ఉద్యోగులు నాలుగు రోజులు జబ్బు పడితేనే నాలుగవ రోజు నుంచి మాత్రమే సిక్ లీవుకు చెల్లింపులు అమలు చేస్తారు. (పడకేసిన పర్యాటకం..కుదేలైన వాణిజ్యం)
Comments
Please login to add a commentAdd a comment