10 సెకన్లకు రూ.6 లక్షలు!
⇒ ఐపీఎల్‌లో సోనీ ప్రకటనల చార్జ్ ఇది
⇒ 14 కంపెనీలతో స్పాన్సర్‌షిప్ ఒప్పందం
⇒ తెలుగు, బెంగాళీ, తమిళంలో కామెంటరీ
⇒ సోనీ స్పోర్ట్స్ హెడ్ ప్రసన్న కృష్ణన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఐపీఎల్ ప్రసార సమయంలో ప్రదర్శించే ప్రకటనలకు 10 సెకన్లకు గాను రూ.6 లక్షలు చార్జీ నిర్ణయించినట్లు సోనీ పిక్చర్స్ నెట్‌వరŠక్స్ ఇండియా (ఎస్‌పీఎన్) తెలియజేసింది. వచ్చే నెల 5 నుంచి ప్రారంభం కానున్న వివో ఐపీఎల్–10 సీజన్ ప్రసార హక్కులను ఎస్‌పీఎన్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. గురువారమిక్కడ 10 సాల్ ఆప్ కే నామ్ క్యాంపెయిన్‌ను ప్రారంభించిన సందర్భంగా సంస్థ స్పోర్ట్స్ ఈవీపీ, బిజినెస్ హెడ్ ప్రసన్న కృష్ణన్ ‘సాక్షి బిజినెస్ బ్యూరో’తో మాట్లాడారు. స్థానికంగా క్రికెట్ ప్రియులకు మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో తెలుగు, తమిళం, బెంగాళీ భాషల్లో కామెంటరీని ప్రారంభించనున్నట్లు తెలిపారు.
వేణుగోపాలరావు, వెంకటపతి రాజు, చంద్రశేఖర్ పీ, సుధీర్ మహావాడీ, కల్యాణ్ కృష్ణ, సీ వెంకటేష్‌లు తెలుగు వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తారని తెలియజేశారు. గతేడాది 9వ సీజన్‌లో 36.1 కోట్ల మంది వీక్షకులను సంపాదించుకున్నామని... ఈ ఏడాది 40 కోట్లకు చేరుతామని ధీమా వ్యక్తం చేశారు. ‘‘గతేడాదితో పోలిస్తే ప్రకటనల చార్జీలను 10 శాతం పెంచాం. ఐపీఎల్ 9లో 11 మంది స్పాన్సర్స్ రాగా.. ఇప్పుడా సంఖ్య 14కు చేరింది. మరో ఒకటో రెండో సంస్థలు స్పాన్సరర్లుగా చేరే అవకాశముంది. ప్రస్తుతానికైతే అమెజాన్, వివో, వొడాఫోన్, పాలీ క్యాబ్, యమహా, విమల్ పాన్ మసాలా, మేక్‌మై ట్రిప్, పార్లే, వోల్టాస్, ఎస్ బ్యాంక్ వంటివి స్పాన్సర్ ఒప్పందం చేసుకున్నాం’’ అని వివరించారు.