అంబానీ చానెల్స్‌లో ‘సోనీ’కి వాటా...! | Sony in talks to buy stake in Mukesh Ambani Network18 TV media group | Sakshi
Sakshi News home page

అంబానీ చానెల్స్‌లో ‘సోనీ’కి వాటా...!

Published Fri, Nov 22 2019 5:05 AM | Last Updated on Fri, Nov 22 2019 5:16 AM

Sony in talks to buy stake in Mukesh Ambani Network18 TV media group - Sakshi

ముంబై: ముకేశ్‌ అంబానీకి చెందిన నెట్‌వర్క్‌ 18 మీడియా అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ లిమిటెడ్‌లో కొంత వాటాను జపాన్‌ ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం సోనీ కార్పొరేషన్‌ కొనుగోలు చేసే అవకాశాలున్నాయి.  దీనికి సంబంధించి నెట్‌వర్క్‌ 18 మీడియాలో సోనీ కంపెనీ మదింపు నిర్వహిస్తోందని సమాచారం. చర్చలు ఆరంభ దశలోనే ఉన్నాయని, ఒప్పందం కుదరవచ్చు లేదా కుదరకపోవచ్చని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం...   

‘స్థానిక’ బలం కోసం సోనీ.....
నెట్‌వర్క్‌18లో వాటా కైవసం కోసం ఏ రకమైన ఒప్పందాలు కుదుర్చుకోవాలి అనే విషయమై కూడా సోనీ కంపెనీ కసరత్తు చేస్తోంది. నెట్‌వర్క్‌18లో వాటా కోసం బిడ్‌ను దాఖలు చేయడం లేదా తన భారత వ్యాపారాన్ని నెట్‌వర్క్‌18 వినోద చానెళ్లలో విలీనం చేయడం, తదితర మార్గాలపై సోనీ అధ్యయనం చేస్తోంది. ఒక వేళ ఒప్పందం సాకారమైతే, సోనీకి ‘స్థానిక’ బలం పెరుగుతుంది. నెట్‌ఫ్లిక్స్‌ తదితర పోటీ సంస్థలకు గట్టిపోటీనివ్వగలుగుతుంది. మరోవైపు అంబానీ చానెళ్లకు సోనీ ఇంటర్నేషనల్‌ కంటెంట్‌కు యాక్సెస్‌ లభిస్తుంది. కాగా వివిధ అవకాశాలను మదింపు చేస్తున్నామని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ప్రతినిధి పేర్కొన్నారు. సోనీ సంస్థ భారత, జపాన్‌ విభాగాలు ఎలాంటి స్పందనను వ్యక్తం చేయలేదు.  

రెండేళ్లలో మరిన్ని భాగస్వామ్యాలు....
భారత ఓటీటీ మార్కెట్లో అపార అవకాశాలున్నాయి. ఏ అంతర్జాతీయ సంస్థయినా, ఇక్కడి అవకాశాలు అందిపుచ్చుకోవాలంటే స్థానిక వ్యూహం తప్పనిసరని నిపుణులంటున్నారు. రానున్న రెండేళ్లలో ఇలాంటి భాగస్వామ్యాలు, వ్యూహాత్మక భాగస్వామ్యాలు మరిన్ని చోటు చేసుకుంటాయని వారంటున్నారు. సోనీ కంపెనీ భారత్‌తో సోనీ పిక్చర్స్‌ నెట్‌వర్క్స్‌ ఇండియా ద్వారా వివిధ చానెళ్లను నిర్వహిస్తోంది. ఇక టీవీ18 బ్రాడ్‌కాస్ట్‌ సంస్థ మొత్తం 56 చానెళ్లను (వార్తలు, వినోద విభాగాలు) నిర్వహిస్తోంది.  

ఈ వార్తలతో బీఎస్‌ఈలో ఇంట్రాడేలో నెట్‌వర్క్‌18 మీడియా షేర్‌ 19%,  టీవీ18 బ్రాడ్‌కాస్ట్‌ షేర్‌ 10% మేర పెరిగాయి. చివరకు నెట్‌వర్క్‌18 షేర్‌ 8% లాభంతో రూ.27.70 వద్ద, టీవీ18 బ్రాడ్‌కాస్ట్‌ 1.5% లాభంతో రూ. 23 వద్ద ముగిశాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement