న్యూఢిల్లీ : పేటీఎం, మొబిక్విక్, పోన్‌పే వంటి డిజిటల్ వాలెట్స్ అందుబాటులోకి వచ్చిన తరువాత నగదుపై ఆధారపడటం చాలా వరకు తగ్గిపోయింది. మనీ ట్రాన్స్‌ఫర్స్ నుంచి మొబైల్ రీఛార్జుల వరకు అన్ని రకాల చెల్లింపులు డిజిటల్ వాలెట్స్ ద్వారా చకచకా జరిగిపోతున్నాయి. అయితే ఇన్ని రకాల ప్రయోజనాలను అందిస్తున్న డిజిటల్ వాలెట్లు, తమ తమ వాలెట్ల మధ్య నగదు బదిలీ చేసుకునేందుకు మాత్రం అవకాశం కల్పించలేదు. ప్రస్తుతం డిజిటల్ చెల్లింపులను మరింతగా ప్రోత్సహించే క్రమంలో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలోనే మొబైల్ వాలెట్ ఇంటెరోపెరాబిలిటీకి అనుమతి ఇస్తోంది. దీని ద్వారా వాలెట్ల మధ్య కూడా నగదు బదిలీ చేసుకోవచ్చు. అయితే దీనికోసం ఆర్‌బీఐ ఓ షరతు పెడుతోందని తెలుస్తోంది.
ఈ సర్వీసులను అందజేయడానికి లైసెన్స్ హోల్డర్స్‌కు మూలధనం రూ.25 కోట్లు ఉండాలని షరతు విధిస్తుందని పేమెంట్ ఇండస్ట్రీకి చెందిన ఎగ్జిక్యూటివ్‌లు చెప్పారు. ఎవరికైతే నికర సంపద రూ.25 కోట్లు ఉంటుందో, ఆ ప్లేయర్లకు ఇంటెరోపెరాబిలిటీని అనుమతించనుందని, కేవలం దిగ్గజ వాలెట్ కంపెనీలు మాత్రమే ఈ అవకాశం పొందేలా ఆర్‌బీఐ మార్గదర్శకాలు ఉండబోతున్నాయని ఢిల్లీకి చెందిన ఓ పేమెంట్స్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. చాలా కంపెనీలు రూ.25 కోట్ల మూలధనాన్ని కలిగి లేవని చెప్పారు. అత్యధిక మొత్తంలో నికర సంపద ఉన్న కంపెనీలకు, కొత్తగా ఇంటర్-వాలెట్ పేమెంట్ సర్వీసులను తమ కస్టమర్లకు ఆఫర్ చేసేందుకు మార్గం సుగుమం అవుతుందని తెలిపారు. అయితే ఈ విషయంపై ఆర్‌బీఐ మాత్రం స్పందించడం లేదు.
మొబైల్ వాలెట్ జారీదారికి ఉండాల్సిన కనీస సంపదను రూ.5 కోట్ల నుంచి రూ.15 కోట్లకు పెంచింది ఆర్‌బీఐ. ఒకవేళ మొబైల్ వాలెట్లు ఇంటెరోపెరాబిలిటీ సర్వీసులను ఆఫర్ చేస్తే, పేమెంట్ బ్యాంక్‌లకు ఇది మేజర్ సవాల్‌గా నిలువనుంది. యూపీఏ ప్లాట్‌ఫామ్ ద్వారా బ్యాంక్ అకౌంట్లకు, వాలెట్లకు మధ్య ఫండ్ ట్రాన్స్‌ఫర్స్ చేసేందుకు దశల వారీగా అనుమతి ఇవ్వనున్నట్టు ఆర్‌బీఐ తన మార్గదర్శకాల్లో చెప్పింది. ఇంటెరోపెరాబిలిటీని ఆఫర్ చేసే వాలెట్లు, తప్పనిసరిగా కేవైసీ నిబంధనలను పాటించాల్సి ఉంది. మూలధన నిబంధనపై ఆర్‌బీఐ తన తుది గైడ్‌లైన్స్‌లో వెల్లడించనుంది.
Comments
Please login to add a commentAdd a comment