న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ సౌత్ ఇండియన్ బ్యాంక్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం జనవరి–మార్చి క్వార్టర్‌లో 51 శాతం ఎగసింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2016–17) ఇదే క్వార్టర్‌లో రూ.76 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.114 కోట్లకు పెరిగిందని సౌత్ ఇండియన్ బ్యాంక్ తెలిపింది.
మొత్తం ఆదాయం రూ.1,608 కోట్ల నుంచి రూ.1,768 కోట్లకు పెరిగిందని పేర్కొంది. వడ్డీ ఆదాయం రూ.1.471 కోట్ల నుంచి 8 శాతం వృద్దితో రూ.1,589 కోట్లకు పెరిగిందని వివరించింది. ఒక్కో షేర్‌కు 40 పైసలు డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపింది.
పెరిగిన మొండి బకాయిలు...
స్థూల మొండి బకాయిలు రూ.1,149 కోట్ల నుంచి రూ. 1,980 కోట్లకు, నికర మొండి బకాయిలు రూ.675 కోట్ల నుంచి రూ.1,416 కోట్లకు పెరిగాయని బ్యాంక్ పేర్కొంది. శాతం పరంగా చూస్తే, స్థూల మొండి బకాయిలు 2.45 శాతం నుంచి 3.59 శాతానికి, నికర మొండి బకాయిలు 1.45 శాతం నుంచి 2.60 శాతానికి పెరిగాయని తెలిపింది. మొండి బకాయిలు పెరిగినప్పటికీ, కేటాయింపులు మాత్రం రూ.165 కోట్ల నుంచి రూ.149 కోట్లకు తగ్గాయని బ్యాంక్ తెలిపింది.
ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2016–17లో రూ.393 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 15 శాతం క్షీణించి రూ.335 కోట్లకు తగ్గిందని తెలిపింది. మొత్తం ఆదాయం రూ.6,563 కోట్ల నుంచి రూ.7,030 కోట్లకు పెరిగిందని వివరించింది. నికర లాభం 51 శాతం ఎగియడంతో బీఎస్‌ఈలో సౌత్ ఇండియన్ బ్యాంక్ షేర్ 3.5 శాతం లాభంతో రూ.26 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment