హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల విక్రయాల్లో ఆన్‌లైన్ వాటా మెల్లగా పెరుగుతున్నట్లు కనిపిస్తున్నా... మల్టీ బ్రాండ్ రిటైల్ చైన్ల అమ్మకాలు అంతకన్నా వేగంగా పెరుగుతున్నాయి. దీంతో వీటి విస్తరణ కూడా యమ స్పీడుగా జరుగుతోంది. మొత్తం పరిశ్రమలో వ్యాపార పరంగా ఇవి ఏకంగా 20 శాతం వాటాను కైవసం చేసుకున్నాయి. కస్టమర్లకు వినూత్న ఎక్స్‌పీరియెన్స్ అందిస్తూ ఈ–కామర్స్ కంపెనీలకూ పోటీనిస్తున్నాయి. ఆన్‌లైన్ సంస్థలకు పోటాపోటీ ధరల్లో అన్ని ప్రముఖ బ్రాండ్ల ఫోన్లను విక్రయిస్తున్న ఈ మల్టీ బ్రాండ్ మొబైల్ రిటైల్ చైన్లలో... దక్షిణాదికి చెందిన కంపెనీలే ఎక్కువగా ఉండడం విశేషం.
20 శాతం వాటాతో..
మొబైల్స్ మార్కెట్లో వ్యాపారం పరంగా సంప్రదాయ రిటైల్ స్టోర్ల వాటా 60 శాతం ఉండగా... ఆన్‌లైన్ 20 శాతం చేజిక్కించుకుంది. మిగిలిన వాటాను మల్టీ బ్రాండ్ మొబైల్స్ రిటైల్ చైన్లు కైవసం చేసుకున్నాయి. 50 ఆపైన స్టోర్లు కలిగి ఉన్న రిటైల్ చైన్లు దేశంలో 20 దాకా ఉంటాయని సమాచారం. ఇందులో అత్యధికం దక్షిణాది రాష్ట్రాలకు చెందినవే. సంగీత, పూర్విక, బిగ్ సి, లాట్, సెల్ పాయింట్, బీ న్యూ, చెన్నై మొబైల్స్ వంటివి వీటిలో ఉన్నాయి.
విస్తరణ బాటలో..
తెలుగు రాష్ట్రాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న ‘బిగ్ సి’ సంస్థ ప్రస్తుతం 195 స్టోర్లను నిర్వహిస్తోంది. డిసెంబర్‌లోగా ఈ సంఖ్య 300కు చేరుతుందని సంస్థ సీఎండీ ఎం.బాలు చౌదరి ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. త్వరలోనే కర్ణాటకలో అడుగుపెడతామన్నారు. మరో రిటైల్ చైన్ లాట్ మొబైల్స్‌కు 160 కేంద్రాలున్నాయి. ఈ ఏడాది మరో 50 స్టోర్లు జోడించనుంది. బీ న్యూ మొబైల్స్‌కు 50 స్టోర్లుండగా... ఈ ఏడాది మరో 85 స్టోర్స్‌ను ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం 85 స్టోర్లను నిర్వహిస్తున్న సెల్ పాయింట్ మరో 30 ఔట్‌లెట్లను జోడిస్తోంది. ఆరు రాష్ట్రాల్లో విస్తరించిన సంగీత మొబైల్స్ ఖాతాలో ఇప్పటికే 333 స్టోర్లున్నాయి. ప్రధాన మార్కెట్లలో కొత్త ఔట్‌లెట్లనూ ప్రారంభిస్తోంది.
రంగంలోకి కొత్త బ్రాండ్స్..
పోటీ ఉన్నా వ్యాపార వృద్ధికి ఢోకా లేకపోవటంతో మల్టీ బ్రాండ్ మొబైల్స్ రిటైల్‌లోకి తెలుగు రాష్ట్రాల నుంచి మరిన్ని కొత్త బ్రాండ్లు ప్రవేశం చేస్తున్నాయి. తాజాగా హ్యాపీ మొబైల్స్ తొలి స్టోర్‌ను అనంతపూర్‌లో ప్రారంభించింది. ఏడాదిలో 200 స్టోర్లను తెరుస్తామని హ్యాపీ మొబైల్స్ ఎండీ కృష్ణ పవన్ చెప్పారు. రూ.200 కోట్లతో 500 స్టోర్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్టు సెలెక్ట్ మొబైల్స్ ఎండీ వై.గురు ప్రకటించారు. ఈ రెండు బ్రాండ్లూ తెలంగాణ, ఏపీతోపాటు ఇతర రాష్ట్రాల్లో అడుగుపెట్టనున్నాయి.
పెరిగిన ఈఎంఐల వాటా..
స్మార్ట్‌ఫోన్ సగటు విక్రయ ధర రెండేళ్ల క్రితం రూ.4,000. ఇప్పుడది రూ.9,000 చేరిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. గ్రామాల్లో ఇది రూ.8,000గా ఉంది. వాయిదాల్లో ఫోన్లు కొంటున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గతేడాది 10 శాతం ఉంటే, ఇప్పుడీ వాటా ఏకంగా రెండింతలవడం గమనార్హం. మొత్తంగా మొబైల్ పరిశ్రమను చూస్తే... దేశంలో నెలకు 2 కోట్ల మొబైల్ ఫోన్లు అమ్ముడవుతున్నాయి. ఇందులో 40 శాతం స్మార్ట్‌ఫోన్లు, 60 శాతం బేసిక్ మోడళ్లు. ప్రతి నెలా రూ.10,000 కోట్ల వ్యాపారం జరుగుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో నెలకు 12 లక్షల ఫోన్లు అమ్ముడవుతుండగా వీటిలో స్మార్ట్‌ఫోన్ల వాటా 50 శాతం. విలువ పరంగా ఏపీ, తెలంగాణలో తలా రూ.300 కోట్ల వ్యాపారం జరుగుతోంది. కాకపోతే దీన్లో హైదరాబాద్ వాటా రూ.150 కోట్లు.
రిటైల్‌లో దక్షిణాది బ్రాండ్ల హవా!!
Published Fri, Mar 23 2018 12:57 AM | Last Updated on Tue, Nov 6 2018 5:26 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment