
ఇపుడు మహిళలు అన్ని రంగాల్లోకీ విస్తరించారని వేరే చెప్పాల్సిన పనిలేదు. కాకపోతే ఇప్పటికీ ఆస్తుల విషయంలో మగవారిదే పైచేయిగా ఉంటోంది. ఎందుకంటే వారే ఎక్కువగా సంపాదిస్తారు కనక సొంతింటి వంటివి వారి పేరిటే ఉండటం... స్వయం ఉపాధిలోనూ వారే ముందుండటం వంటివి జరుగుతున్నాయి. ఈ పరిస్థితిని మార్చటానికి ప్రభుత్వ ప్రోత్సాహంతో బ్యాంకులు కాస్త తెలివైన పథకాలనే అమలు చేస్తున్నాయి. ఎలాగంటే గృహ రుణాల్లో మహిళల పేరిటైతే కాస్తంత వడ్డీ తగ్గిస్తున్నాయి.
అలాగే స్వయం ఉపాధి విషయంలో కూడా!!. దీని వల్ల ఇల్లు కొనేవారు రుణం తీసుకోవటానికి తమ ఇంట్లోని మహిళలను కనీసం సహ భాగస్వామిగా నైనా చేసే వీలుంటుంది. సొంతిల్లు కల నెరవేర్చుకోవాలనుకుంటున్నారా...? సొంతంగా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాలని ఉందా...? మీరు మహిళామణులా? అయితే బ్యాంకులు రెడ్ కార్పెట్‌తో స్వాగతం పలుకుతున్నాయి. రుణానికి దరఖాస్తు చేసుకోవడం ఆలస్యం వేగంగా ప్రాసెస్ చేస్తున్నాయి. ఆడవారి కోసం ప్రత్యేక రుణ పథకాలు, వడ్డీ రేట్లలో రాయితీలను ఆఫర్ చేస్తున్నాయి.
వేతన జీవులు
ప్రభుత్వరంగంలోని అగ్రగామి బ్యాంకు ఎస్‌బీఐ మహిళల కోసం గృహరుణాల జారీకిగాను ప్రత్యేకంగా ఓ పథకాన్ని నిర్వహిస్తోంది. దీనిపేరు హర్‌ఘర్. వేతనం ఆర్జించేవారు, స్వయం ఉపాధిలో ఉన్న మహిళలకూ ఈ పథకాన్ని అమలు చేస్తోంది. వేతనం ఆర్జించే వారు అయి ఉండి రూ.30 లక్షల వరకు గృహ రుణం తీసుకోదలిస్తే 0.05% తక్కువగా 8.3% వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది. సాధారణంగా ఇతర కస్టమర్లకు ఇది 8.35 శాతంగా ఉంది.
ఉదాహరణకు 20 ఏళ్ల కాల వ్యవధిపై రూ.30 లక్షల రుణం తీసుకుంటే 0.05% తక్కువ వడ్డీ రేటు కారణంగా మొత్తం మీద రూ.23,000 ఆదా అవుతుంది. 20 ఏళ్ల కాలంలో రుణంపై వడ్డీ రూపేణా రూ.31.57 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఇతరులకు అయితే రూ.31.8 లక్షలు వడ్డీ అవుతుంది. రూ.30 లక్షలకు పైన రూ.75 లక్షల వరకు ఉండే రుణాలపై వడ్డీ రేట్లు మహిళలకు 8.30–8.35%గా ఉన్నాయి.
ఇతరులకు అయితే ఇంతే మొత్తం రుణాలపై వడ్డీ రేట్లు 0.10 శాతం ఎక్కువ. మహిళలకు ఈ స్వల్ప రాయితీ కారణంగా ఆదా అయ్యే మొత్తం 20 ఏళ్ల కాలంలో రూ.50,000 వరకు ఉంటుంది. రూ.75 లక్షలకు పైన రుణాల్లో ఉద్యోగులైన మహిళలకు 8.4–8.45%గా ఉండగా, ఇతరులకు 8.5% అమలవుతోంది. రూ.కోటి రూపాయల రుణంపై 20 ఏళ్ల కాలంలో వడ్డీపై తగ్గింపు రూపంలో మహిళలకు రూ.75,000 వరకు మిగులుతుంది.
స్వయం ఉపాధిలో ఉంటే...
ఉద్యోగం చేస్తున్న మహిళలతో పోలిస్తే తమకాళ్లపై తాము నిలబడిన స్వయం ఉపాధి మహిళల నుంచి బ్యాంకులు కొంచెం ఎక్కువ వడ్డీ రేటు రాబడుతున్నాయి. అయితే, స్వయం ఉపాధిలో ఉన్న ఇతర కస్టమర్లతో పోల్చుకుంటే మహిళలకు వడ్డీ రేటు రూ.30 లక్షల వరకు రుణంపై 0.05 శాతం మేర తక్కువకే ఆఫర్ చేస్తున్నాయి బ్యాంకులు.
వడ్డీరేటు 8.4 శాతంగా ఉంది. రూ.30లక్షలకు పైన రూ.75 లక్షల వరకు రుణాలపైనా వడ్డీ రేటు 0.05 శాతం తక్కువే ఉంది. రూ.75లక్షలకు పైన రుణం కావాలంటే స్వయం ఉపాధి మహిళలకు ఎస్‌బీఐ 0.05 శాతం తక్కువగా 8.55 శాతం వరకు వడ్డీ రేటును అమలు చేస్తోంది. వడ్డీ రేట్లు రెండేళ్ల వరకు స్థిరంగా ఉండేలా ఆప్షన్ కూడా ఇస్తోంది. దీంతో రెండేళ్ల పాటు ఒకే వడ్డీ రేటు కొనసాగుతుంది.
ఇతర ఆఫర్లు
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మహిళా కస్టమర్లకు రూ.30 లక్షల వరకు రుణాన్ని 8.35 శాతం వడ్డీ రేటుపై ఆఫర్ చేస్తోంది. ఇతరుల కంటే వడ్డీ రేటులో 0.05 శాతం తక్కువ. రూ.30–75లక్షల వరకు రుణాలను 8.4 శాతం వడ్డీ రేటుపై అందిస్తోంది. ఇతరులకు 8.45 శాతం వడ్డీ రేటు అమలు చేస్తోంది. అదే రూ.75 లక్షలకు పైబడిన రుణాలకు వడ్డీ రేటు 8.45 శాతం. ఇతరులతో పోలిస్తే వడ్డీ రేటు 0.05 శాతం తక్కువ. కొన్ని బ్యాంకులు కేవలం వడ్డీ రేట్ల రాయితీలతోనే సరిపుచ్చడం లేదు.
ప్రాసెసింగ్ ఫీజులోనూ తగ్గింపునిస్తున్నాయి. ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ప్రాసెసింగ్ ఫీజులో మహిళా కస్టమర్లకు 50 శాతం తగ్గింపునిస్తోంది. ఇతరులకు ప్రాసెసింగ్ ఫీజు రూ.5,000 కాగా, మహిళల్లో ఉద్యోగులు, స్వయం ఉపాధిలో ఉన్న వారికి రూ.2,500 మాత్రమే తీసుకుంటోంది. ఈ చార్జీలపై జీఎస్టీ అదనం. ఒక్కరిగా, లేదా మరొకరితో కలసి ఉమ్మడిగా దరఖాస్తు చేసినప్పుడు, సంబంధిత ప్రాపర్టీ తమ పేరిట లేదా మరొకరితో కలసి ఉమ్మడిగా హక్కులు కలిగి ఉంటేనే రుణానికి అర్హులు.
వ్యాపారం కోసం...
సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటే లేదా ఉన్న వ్యాపారాన్ని విస్తరించాలనుకుంటే బ్యాంకులు వాణిజ్య రుణాలకు సంబంధించి అందిస్తున్న ప్రత్యేక పథకాలను పరిశీలించొచ్చు. సెంట్రల్ బ్యాంకు ‘సెంట్ కల్యాణి’, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు ‘ఉద్యోగిని’ పథకం, దేనా బ్యాంకు అందించే ‘దేనా శక్తి’, పీఎన్‌బీ ‘మహిళా ఉద్యమ్‌నిధి’ తదితర పథకాలు ఇందుకు సంబంధించినవే.
సెంట్ కల్యాణి పథకం కింద సెంట్రల్ బ్యాంకు ప్రాసెసింగ్ ఫీజు మాఫీ చేస్తోంది. అలాగే, రూ.కోటి వరకు ఎటువంటి తనఖా లేకుండానే మంజూరు చేస్తోంది. పీఎన్‌బీ మహిళా ఉద్యమ్ పథకం కింద పదేళ్ల కాలంలో తిరిగి చెల్లించే వెసులుబాటు కల్పిస్తోంది. దేనా బ్యాంకు 0.25శాతం తక్కువ వడ్డీ రేటుకు రుణాలను అందిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment