స్పోర్ట్స్... 365 రోజులూ!
► క్రీడా వస్తువుల కోసం ప్రత్యేక ఆన్‌లైన్ షాప్
► 150 బ్రాండ్లు.. 35 వేలకు పైగా ఉత్పత్తులు లభ్యం
► టెన్నిస్, రన్నింగ్ ఉత్పత్తుల కోసం ప్రత్యేకంగా హమ్‌లు
► రూ.35-40 కోట్ల నిధుల సమీకరణకు రెడీ
► ‘సాక్షి’ స్టార్టప్ డైరీతో చంద్రశేఖర రెడ్డి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: క్రీడాకారుల్లో ఎవరి ఇంటర్వ్యూ చదివినా... కామన్‌గా వినిపించేదొక్కటే. ‘‘చిన్నతనం నుంచే ఆటలంటే ఇష్టం ఉండేదని’’!. నెల్లూరు జిల్లాకు చెందిన చంద్రశేఖర్ రెడ్డి మాత్రం ఇందుకు మినహాయింపే. ఎందుకంటే అందరిలా తాను అక్కడికే పరిమితం కాలేదు. ఆటలే కాదు ఆట వస్తువులూ ముఖ్యమే అనుకున్నాడు. దేశంలో ప్రొఫెషనల్‌గా ఆట వస్తువులను విక్రయించే సంస్థ ఏదీ లేదని కూడా తెలుసుకున్నాడు.
ఇంకేముంది!! టెన్నిస్ దిగ్గజం మహేష్ భూపతితో కలిసి ‘స్పోర్ట్స్ 365’ పేరిట ఆన్‌లైన్ సంస్థను ప్రారంభించేశాడు. మూడేళ్ల కిందట ప్రారంభమైన ఈ సంస్థ... ఇపుడు ఏకంగా 25 రకాల ఆటలు... 150కి పైగా బ్రాండ్లకు చెందిన 35 వేలకు పైగా ఉత్పత్తులను విక్రయించే స్థాయికి ఎదిగింది. సంస్థ ప్రారంభం... విస్తరణ ప్రణాళికల గురించి మరిన్ని వివరాలు చంద్రశేఖర్ రెడ్డి మాటల్లోనే..
వరంగల్ ఆర్‌ఈసీలో ఇంజనీరింగ్ చేశా. తర్వాత ఐఐఎం లక్నో నుంచి ఎంబీఏ పూర్తి చేశా. ఆ తర్వాత ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, మెకిన్సే వంటి కంపెనీల్లో వివిధ హోదాల్లో ఎనిమిదేళ్ల పాటు పనిచేశా. ఆ సమయంలో ఓ వైపు టెన్నిస్ క్రీడాకారుడిగా ఉంటూనే మరోవైపు గ్లోబోస్పోర్ట్ కంపెనీతో సక్సెస్‌ఫుల్ బిజినెస్‌మెన్‌గా రాణిస్తున్న మహేష్ భూపతితో పరిచయం ఏర్పడింది. దేశంలో స్పోర్ట్స్, ఫిట్‌నెస్ ఉత్పత్తులను విక్రయించే మార్కెట్ అసంఘటితంగా ఉందని.. దీనికి కాస్త టెక్నాలజీని జోడించి సంఘటిత పరిస్తే అద్భుతాలు సృష్టించవచ్చని ఒకరోజు నా ఆలోచనను భూపతితో పంచుకున్నా. ఇంకేముంది...! బెంగళూరు కేంద్రంగా 2012లో స్పోర్ట్స్ 365 సంస్థను ప్రారంభమైంది.
150 బ్రాండ్లు.. 35 వేలకు పైగా ఉత్పత్తులు
ప్రస్తుతం ‘స్పోర్ట్స్ 365’లో క్రికెట్, టెన్నిస్, బ్యాడ్మింటన్, రన్నింగ్ వంటి 25 రకాల ఆటలకు సంబంధించిన 150కి పైగా బ్రాండ్లకు చెందిన 35 వేలకు పైగా స్పోర్ట్స్, ఫిట్‌నెస్ ఉత్పత్తులున్నాయి. హీరో సైకిల్, వింబుల్డన్, మూవ్‌లర్, యూనికార్న్, నైకీ గోల్ఫ్ వంటి సుమారు 11 బ్రాండ్లతో ఎక్స్‌క్లూజివ్ ఎంఓయూ కుదుర్చుకున్నాం కూడా. ఇప్పటివరకు మా వద్ద 3 లక్షల మంది కస్టమర్లు... 25 వేల ఆర్డర్లు రిజిస్టరై ఉన్నాయి. వ్యక్తిగత ఆర్డర్లే కాదు... పాఠశాలలు, కళాశాలలు, స్పోర్ట్స్ క్లబ్, శిక్షణ సంస్థలూ ఉన్నాయిందులో. ఆర్డరొచ్చిన తేదీ నుంచి దూరాన్ని బట్టి 3-4 రోజుల్లో ఉత్పత్తులను డెలివరీ చేస్తున్నాం.
ప్రత్యేక హబ్‌లు..
ఇండియన్ ప్రీమియర్ లీగ్, ఇండియన్ సూపర్ లీగ్, హాకీ ఇండియా లీగ్, ప్రొ కబడ్డీ.. వంటి వాటితో ఆటలపై దేశవాసులకు రోజురోజుకూ మక్కువ పెరుగుతోంది. ఈ మార్కెట్‌ను అందిపుచ్చుకోవడానికి ఒక్కో ఆటకు ఒక్కో వెబ్‌పోర్ట్‌ల్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఇందులో భాగంగానే ఇటీవలే టెన్నిస్, రన్నింగ్‌లకు సంబంధించిన ఉత్పత్తుల కోసం ప్రత్యేకంగా హబ్‌లను ప్రారంభించాం. వచ్చే మార్చిలోగా సైక్లింగ్, బ్యాడ్మింటన్, అవుట్ డోర్ స్పోర్ట్స్ (ట్రెక్కింగ్, జాగింగ్ వంటివి) హబ్‌లనూ ప్రారంభించనున్నాం. ప్రస్తుతం మా సంస్థలో 100 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. మరింత మందికి ఉపాధి లక్ష్యం.
బ్రాండ్ అంబాసిడర్లు కూడా..
ఇండియన్ క్రికెట్ సూపర్ స్టార్ యువరాజ్ సింగ్, బాలీవుడ్ నటి లారాదత్తా, అంతర్జాతీయ స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పల్లికాల్‌లను స్పోర్ట్స్ 365కు బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించుకున్నాం. హీరోయిన్‌ను అంబాసిడర్‌గా తీసుకోవడానికో కారణముంది. మహిళలనూ ఆటలు, ఫిట్‌నెస్‌ల వైపు ఆకర్షించాలంటే నిత్యం యోగా, ఏరోబిక్స్ చేసే హీరోయిన్.. అదీ అందరూ ఐకాన్‌గా తీసుకునే నటి కావాలని నిర్ణయించుకున్నాం. అందుకే లారాను ఎంచుకున్నాం.
2020 నాటికి రూ.1,000 కోట్లు..
సంస్థను ప్రారంభించిన తొలి ఏడాది అంటే 2012-13లో రూ.4.6 కోట్ల టర్నోవర్‌ను సాధించాం. గతేడాది రూ.15 కోట్లు టర్నోవర్‌ను చేరుకున్నాం. ఈ ఏడాది మూడింతల వృద్ధి రేటును లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటివరకు రూ.40 కోట్లకు చేరుకున్నాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి 10-12 శాతం మార్కెట్ వాటా ఉంది. 2020 నాటికి రూ.1,000 కోట్ల టర్నోవర్‌కు చేరుకోవాలనేది లక్ష్యం. అ దిశగా ప్రణాళికలు రచిస్తున్నాం.
అందుకే సొంత చానల్ ద్వారా మాత్రమే కాకుండా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఇతర ఈ-కామర్స్ సంస్థల నుంచి 40 శాతం అమ్మకాలు జరపాలని నిర్ణయించాం. గతేడాది అమెరికాకు చెందిన వెంచర్ క్యాపిటల్ సంస్థ పవర్‌హౌజ్ వెంచర్స్, జోలోన్ టెక్ ఐటీ సంస్థలు మా సంస్థలో రూ.12 కోట్ల పెట్టుబడులు పెట్టాయి. రెండో విడతగా రూ.35-40 కోట్ల నిధులను సమీకరించనున్నాం. పాత ఇన్వెస్టర్లతో పాటుగా కొత్త వారితోనూ చర్చిస్తున్నాం. వచ్చే ఫిబ్రవరి నాటికి డీల్స్‌ను క్లోజ్ చేస్తాం.