
మళ్లీ ఎయిర్‌లైన్స్... డిస్కౌంట్ ఆఫర్లు
ముంబై: స్పెస్‌జెట్, ఇండిగో విమానయాన సంస్థలు నాలుగో రౌండ్ ధరల పోరుకు తెర తీశాయి. ఈ రెండు కంపెనీలు సూపర్ హోలి సేల్స్, ఫ్లాష్ సేల్స్ పేరుతో ఎంపిక చేసిన రూట్లలో విమాన టికెట్లపై భారీ డిస్కౌంట్‌ను ప్రకటించాయి. ఈ విషయాన్ని స్పైస్‌జెట్ ధ్రువీకరించగా, ఇండిగో నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే ఇండిగో కంపెనీ 30% వరకూ డిస్కౌంట్‌ను ఇస్తోందని, ఈ ఆఫర్ మరో 5 రోజుల వరకూ ఉంటుందని సమాచారం.
స్పైస్‌జెట్ ఎంపిక చేసిన రూట్లలో సూపర్ హోలి సేల్ పేరుతో డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ డిస్కౌంట్ ధరలు రూ.1,999 నుంచి ప్రారంభమవుతాయి. ఈ నెల 16 వరకూ బుక్ చేసుకునే, వచ్చే నెల 14 నుంచి జూన్ 30 మధ్య ప్రయాణాలకు వర్తిస్తాయని కంపెనీ పేర్కొంది. ప్రయాణాలకు 30 రోజుల ముందు బుక్ చేసుకునే టికెట్లకు ఈ డిస్కౌంట్లు లభిస్తాయి. తాజా ఆఫర్ కారణంగా హైదరాబాద్-కొచ్చిన్ చార్జీ రూ.2,999గా ఉంటుందని పేర్కొంది. ఈ ఏడాది జనవరి రెండో వారంలో తొలి సారి, గత నెలలో 2 సార్లు విమాన యాన సంస్థలు టికెట్ల ధరలను భారీగా తగ్గించాయి.