
స్వల్ప లాభాలతో సరి
* ప్లస్ 217 నుంచి ప్లస్ 27కు పరిమితమైన సెన్సెక్స్ లాభం
* 25,868 వద్ద ముగింపు
ఆద్యంతం ఒడిదుడుకులమయంగా సాగిన శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో స్వల్పలాభాలతో స్టాక్ సూచీలు గట్టెక్కాయి. స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగియడం ఇది వరుసగా రెండో రోజు. అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు లాభాల బాటలో ఉండటానికి తోడు దేశీయంగా కొనుగోళ్లు జోరందుకోవడంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ 27 పాయింట్ల లాభంతో 25,868 పాయింట్లు వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 14 పాయింట్ల లాభంతో 7,857 పాయింట్ల వద్ద ముగిశాయి.
ఇంట్రాడేలో సెన్సెక్స్ 217 పాయింట్లు లాభపడింది. 26 వేల పాయింట్లను దాటింది. కానీ చివరి గంటలో అమ్మకాల కారణంగా ఆ లాభాలను నిలుపుకోలేకపోయింది. ఐటీ, కొన్ని ఆయిల్, గ్యాస్, వాహన షేర్ల మద్దతుతో దూసుకుపోయిన స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చివరలో బ్యాంక్, ఆర్థిక సేవల షేర్లలో అమ్మకాల కారణంగా స్వల్పలాభాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది. ఈ వారంలో సెన్సెక్స్ 258 పాయింట్లు (1 శాతం), నిఫ్టీ 94 పాయింట్లు(1.21 శాతం) చొప్పున లాభపడ్డాయి.
గత నాలుగు వారాల్లో లాభాల్లో ముగిసిన వారం ఇదే. డిసెంబర్‌లోనే వడ్డీరేట్లను పెంచడానికి అమెరికా ఫెడరల్ రిజర్వ్ సిద్ధమవుతున్నప్పటికీ, ఈ పెరుగుదల దశలవారీగానే ఉంటుందన్న అంచనాలతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లు జరిపారు. వేతన సంఘం సిఫారసు చేయడం సెంటిమెంట్‌కు ఊపునిచ్చింది.ప్రారంభంలో లాభాల స్వీకరణ కారణంగా నష్టాల్లోకి జారిపోయిన సెన్సెక్స్, బ్లూ చిప్‌ల్లో కొనుగోళ్లతో తేరుకుంది. కాగా ఐపీఓ కోసం మహానగర్ గ్యాస్ లిమిటెడ్ సెబీకి దరఖాస్తు చేసింది. దీంతో మహానగర్ గ్యాస్ కంపెనీలో 49.75 శాతం వాటా ఉన్న గెయిల్ 10 శాతం లాభపడి రూ.350 వద్ద ముగిసింది.