ఎస్‌బీఐ ఏటీఎం (ఫైల్ ఫోటో)
ఇండోర్: ప్రభుత్వం పెద్ద నోట్లు రూ.500, రూ.1000ను రద్దు చేసిన తర్వాత రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త కొత్త నోట్లను మార్కెట్‌లోకి ప్రవేశపెడుతూ వస్తోంది. 2000 రూపాయి నోటు నుంచి 500 రూపాయి నోట్లు, 200 రూపాయి నోట్లు, 50 రూపాయి నోట్లు, 20 రూపాయి నోట్లు, 10 రూపాయి నోట్లు ఇలా కొత్త నోట్లు మార్కెట్‌లోకి వచ్చాయి. ఈ కొత్త నోట్లను పాతనోట్లతో పోలిస్తే మరిన్ని భద్రతా పరమైన ఫీచర్లతో ప్రవేశపెడుతోంది. అయితే పాత నోట్లకు, కొత్త నోట్లకు సైజుల్లో మార్పులు ఉండటం వల్ల.. కొత్త నోట్లకు అనుకూలంగా బ్యాంక్‌లు ఏటీఎంలను మార్చాల్సి వస్తుంది.
డిమానిటైజేషన్ పూర్తయి ఇప్పటికి 21 నెలల కావొస్తున్నా.. ఇంకా 18,315 ఏటీఎంలను రికాలిబ్రేట్ చేయాల్సి ఉందని దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్ ఎస్‌బీఐ తెలిపింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఆర్‌టీఐ కార్యకర్త చంద్రశేఖర్ గౌడ్ కోరిన మేరకు ఆర్‌టీఐ డేటాలో ఎస్‌బీఐ ఈ విషయం తెలిపింది. ఏటీఎం రికాలిబ్రేషన్( ఏటీఎం పునరుద్ధరణ) ప్రక్రియ ఇంకా కొనసాగుతుందని పేర్కొంది. కొత్త నోట్లు రూ.2000, రూ.500, రూ.200ను పంపిణీ చేయడానికి ఎన్ని ఏటీఎంలను రికాలిబ్రేట్ చేశారని చంద్రశేఖర్ ఎస్‌బీఐను ఆర్‌టీఐ ద్వారా కోరాడు.
చంద్రశేఖరన్ ప్రశ్నకు ఆగస్టు 18న ఎస్‌బీఐ ఇచ్చిన సమాధానంలో... మొత్తం 59,521 ఏటీఎంలు ఉండగా, 41,386 ఏటీఎంలను రికాలిబ్రేట్ చేసినట్టు పేర్కొంది. ఈ ప్రక్రియకు మొత్తం రూ.22.50 కోట్లు వెచ్చించినట్టు తెలిపింది. ఇంకా 18,135 ఏటీఎంలను రికాలిబ్రేట్ చేయాల్సి ఉందని, అవి ప్రస్తుతం కొత్త కరెన్సీ నోట్ల పంపిణీకి సిద్ధంగా లేవని చెప్పింది. కాగ, 2016 నవంబర్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పెద్ద నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆ అనంతరం పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment