అమెరికన్ ఎక్స్ప్రెస్తో ఎస్బీఐ ఒప్పందం
హైదరాబాద్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అమెరికన్ ఎక్స్‌ప్రెస్‌ల మధ్య ఒక భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం కారణంగా ఎస్‌బీఐ ఏర్పాటు చేసిన పాయింట్ ఆఫ్ సేల్స్(పీఓఎస్)ల్లో అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కార్డులను అంగీకరిస్తారని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఒప్పందం ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ లావాదేవీలకు వర్తిస్తుందని ఎస్‌బీఐ డీఎండీ మంజు అగర్వాల్ పేర్కొన్నారు.
ఎలక్ట్రానిక్ చెల్లింపుల విధానాన్ని ప్రోత్సహించడానికి కట్టుబడి ఉన్నామని, భారత్‌లో 3.12 లక్షల పీఓఎస్(పాయింట్ ఆఫ్ సేల్స్) ఏర్పాటు చేశామని వివరించారు. అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కార్డుదారులు తమ కార్డులను ప్రతి రోజూ కొనుగోళ్లకు ఉపయోగించి, రివార్డులు పొందవచ్చని అమెరికన్ ఎక్స్‌ప్రెస్ రీజనల్ ప్రెసిడెంట్ సంజయ్ రిషి పేర్కొన్నారు. ఈ ఒప్పందం కారణంగా తమ క్రెడిట్ కార్డ్ వ్యాపారం మరింత పెరుగుతుందని తెలిపారు. ఈ ఏడాది మార్చి నాటికి భారత్‌లో తమ క్రెడిట్ కార్డులు 8.28 లక్షలుగా ఉన్నాయని వివరించారు.