భారత్‌ రేటింగ్‌కు ప్రతికూలం! | States' climate risks are rising, led by health impacts: Moody's | Sakshi
Sakshi News home page

భారత్‌ రేటింగ్‌కు ప్రతికూలం!

Published Wed, Oct 10 2018 12:34 AM | Last Updated on Wed, Oct 10 2018 12:34 AM

States' climate risks are rising, led by health impacts: Moody's - Sakshi

న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాల కోత ప్రభుత్వ ఆదాయాలకు గండి కొడుతుందని అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజం– మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ తన తాజా నివేదికలో విశ్లేషించింది. ఇది భారత్‌కు ‘క్రెడిట్‌ నెగటివ్‌’ అని పేర్కొంది. ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం– ద్రవ్య లోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) లో 3.3 శాతంగా ఉండాలన్న కేంద్ర బడ్జెట్‌ లక్ష్యాలను ప్రస్తావిస్తూ, ఇది 3.4 శాతానికి పెరిగే అవకాశం ఉందని తెలియజేసింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు 6.24 లక్షల కోట్లుగా (2018–19 జీడీపీ విలువలో 3.3 శాతం) ఉండాలని  బడ్జెట్‌ నిర్దేశించింది. అయితే మొదటి ఐదు  నెలల్లో (ఏప్రిల్‌–ఆగస్టు) ఈ లోటు రూ.5.91 లక్షల కోట్లుగా ఉంది. పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూ.1.5 ఎక్సైజ్‌ సుంకం తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.10,500 కోట్ల మేర కేంద్రం ఆదాయాలకు గండికొడుతుందని వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. ఆయా అంశాలపై మూడీస్‌ తాజా ప్రకటనలో వెలువరించిన ముఖ్యాంశాలివీ...

తమ ప్రైసింగ్‌లో లీటరుకు రూపాయి తగ్గించుకోవాలన్న ఆదేశాలు ప్రభుత్వ రంగ ఆయిల్‌ మార్కె టింగ్‌ కంపెనీలకు (ఓఎంసీ) ప్రతికూలమైనవే.  
   జీడీపీలో కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు 3.4 శాతం ఉంటుందని భావిస్తున్నాం. కేంద్ర–రాష్ట్రాలు రెండూ కలిపితే ఈ లోటు జీడీపీలో 6.3 శాతంగా ఉండే వీలుంది. ప్రభుత్వ మూలధన వ్యయాల కోతకూ ఆయా పరిస్థితులు దారితీయవచ్చు.
 అయితే ఫ్యూయెల్‌ ఎక్సైజ్‌ కోత జీడీపీ వృద్ధి రేటుపై మాత్రం స్వల్ప ప్రభావమే చూపుతుంది.   
 ఆయా అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే భారత్‌ జీడీపీ వృద్ధి 2018, 2019 ఆర్థిక సంవత్సరాల్లో వరుసగా 7.3 శాతం, 7.5 శాతంగా ఉంటుందని భావిస్తున్నాం.  
గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ పరిస్థితుల ప్రతికూలత, అధిక చమురు ధరలు, దేశీయ క్రెడిట్‌ పరిస్థితుల్లో క్లిష్టత భారత్‌కు తక్షణ సవాళ్లు.  
 భారత సావరిన్‌ రేటింగ్‌ను 13 యేళ్ల తరువాత మొట్టమొదటిసారి మూడీస్‌ గత ఏడాది పెంచింది. దీనితో ఈ రేటు ‘బీఏఏ2’కు చేరింది. వృద్ధి అవకాశాలు బాగుండటం, ఆర్థిక, వ్యవస్థీకృత విభాగాల్లో సంస్కరణల కొనసాగింపు రేటింగ్‌ పెంపునకు కారణమని వివరించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement