న్యూఢిల్లీ: అమెరికా–చైనా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరే అంశానికి సంబంధించిన పరిణామాలు, విదేశీ పెట్టుబడుల ప్రవాహం, డెరివేటివ్స్‌కి సంబంధించి ముగియనున్న నవంబర్ సిరీస్ తదితర అంశాలు ఈ వారం మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని విశ్లేషకులు తెలిపారు. అలాగే మహారాష్ట్రలో మారుతున్న రాజకీయ పరిస్థితులను కూడా ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలిస్తారని పేర్కొన్నారు. ‘ఈ వారం మార్కెట్లు మరీ ఆసక్తికరంగా ఉండకపోవచ్చు.
డిజిన్వెస్ట్‌మెంట్‌కి సంబంధించి లేదా ఆర్థిక విధానాలపరంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, అంతర్జాతీయ పరిణామాలు మొదలైన వాటి ఆధారంగా ఏవైనా కదలికలు ఉండొచ్చు‘ అని సామ్కో సెక్యూరిటీస్ అండ్ స్టాక్‌నోట్ వ్యవస్థాపకుడు జిమీత్ మోదీ తెలిపారు. అంతర్జాతీయంగా అమెరికా–చైనా మధ్య వాణిజ్య చర్చల పురోగతి .. ట్రేడింగ్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేయనుంది. ఇక, డాలర్‌తో రూపాయి మారకం తీరుతెన్నులు, చమురు ధరలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల విధానం తదితర అంశాలూ కీలకంగా ఉండనున్నాయి. గురువారంతో ముగిసే నవంబర్ సిరీస్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్‌అండ్‌వో) కాంట్రాక్టులపై ఇవి ప్రభావం చూపవచ్చని అంచనా.
క్యూ2 గణాంకాలపై దృష్టి..
ఈ వారమే విడుదలయ్యే స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) రెండో త్రైమాసిక గణాంకాలపై మార్కెట్ దృష్టి ఉంటుందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ (రీసెర్చ్ విభాగం) వినోద్ నాయర్ తెలిపారు. అటు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనలిస్టు గౌరంగ్ సోమయ్య కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. శుక్రవారం మార్కెట్ వేళలు ముగిసిన తర్వాత జీడీపీ గణాంకాలు వెలువడే అవకాశముంది. వినియోగం బలహీనపడటం, అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు మొదలైన వాటి కారణంగా ఆర్థిక వృద్ధి మరింతగా దిగజారే అవకాశం ఉందని వివిధ రేటింగ్ ఏజెన్సీలు అంచనా వేస్తున్న నేపథ్యంలో ఈ గణాంకాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రెండవ త్రైమా సికంలో జీడీపీ వృద్ధి రేటు 5 నుంచి 5.5% మధ్యే ఉంటుందన్నది మెజారిటీ విశ్లేషణ.
Comments
Please login to add a commentAdd a comment