అమెరికా టు ఆస్ట్రేలియా... అమ్మకాల ముసలం! | Stock market crash: Investors lose Rs 4 lakh crore in wealth in 5 minutes | Sakshi
Sakshi News home page

అమెరికా టు ఆస్ట్రేలియా... అమ్మకాల ముసలం!

Published Fri, Oct 12 2018 12:38 AM | Last Updated on Fri, Nov 9 2018 5:30 PM

Stock market crash: Investors lose Rs 4 lakh crore in wealth in 5 minutes - Sakshi

అమెరికాలో మొదలైన అమ్మకాల ముసలం ప్రపంచ మార్కెట్లంతటికీ విస్తరించి మన మార్కెట్‌ను కూడా గురువారం నష్టాలపాలు చేసింది. దీంతో బుధవారం లాభాలొచ్చాయన్న సంతోషం గురువారం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. చమురు, విమానయాన, మీడియా మినహా అన్ని రంగాల షేర్లలో అమ్మకాల సునామీ చోటు చేసుకుంది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 34,000  పాయింట్ల చేరువకు పడిపోగా,  ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 10,250 పాయింట్ల దిగువకు పతనమైంది. ప్రభుత్వ రంగ బ్యాంక్‌ షేర్లు, లోహ, వాహన, ఫార్మా, ఐటీ షేర్లు బాగా నష్టపోయాయి. సెన్సెక్స్‌ 760 పాయింట్లు (2.19 శాతం) పతనమై 34,001 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 225 పాయింట్లు (2.16 శాతం) పతనమై 10,235 పాయింట్ల వద్ద ముగిశాయి. స్టాక్‌ సూచీలు దాదాపుగా ఆరు నెలల కనిష్టానికి పడిపోయాయి. మీడియా, చమురు మినహా అన్ని రంగాల నిఫ్టీ సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. ఈ ఏడాది స్టాక్‌ సూచీలు సాధించిన లాభాలన్నీ గురువారంతో హరించుకుపోయాయి. బీఎస్‌ఈలో నమోదైన ప్రతి మూడు షేర్లలో రెండు షేర్లు నష్టాల్లోనే ముగిశాయి.   

భారీ గ్యాప్‌డౌన్‌తో ఆరంభం... 
సెన్సెక్స్‌ భారీ గ్యాప్‌డౌన్‌... 697  పాయింట్ల భారీ నష్టంతో ఆరంభమైంది. ట్రేడింగ్‌ ఆరంభమైన అరగంటలోనే 1,037 పాయింట్ల నష్టంతో 33,724 పాయింట్ల వద్ద కనిష్ట స్థాయిని తాకింది. నిఫ్టీ కూడా ఆరంభంలో 10,250 పాయింట్ల దిగువకు పడిపోయింది. ఇంట్రాడేలో నిఫ్టీ 321 పాయింట్ల నష్టంతో 10,139 పాయింట్లకు పడిపోయింది. అయితే ఇంధన షేర్లు కోలుకోవడంతో ఈ నష్టాలు ఒకింత తగ్గాయి. ప్రపంచ మార్కెట్ల పతనంలో భాగంగానే మన మార్కెట్‌ కూడా నష్టపోయిందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఎనలిస్ట్‌ వి.కె. విజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. అమెరికాలో బాండ్ల రాబడులు పెరగడం, వర్ధమాన దేశాల కరెన్సీలు పతనం కావడం, భారత్‌ వంటి వర్ధమాన దేశాల నుంచి విదేశీ నిధులు తరలిపోతుండటం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయని వివరించారు. కాగా నిఫ్టీ తదుపరి మద్దతు స్థాయి 10,000 పాయింట్లని, నిరోధం 10,650 పాయింట్లని బొనాంజా పోర్ట్‌ఫోలియో అంచనా వేస్తోంది.
 
ఎదురీదిన ఆయిల్‌ షేర్లు  
స్టాక్‌ మార్కెట్‌ భారీగా పతనమైనప్పటికీ, ఆయిల్‌ షేర్లు మంచి లాభాలు సాధించాయి. అమెరికా చమురు నిల్వలు అంచనాలను మించి పెరిగాయన్న గణాంకాలు, అమెరికాలోని మైకేల్‌ తుఫాన్‌ కారణంగా చమురు క్షేత్రాలపై పెద్దగా ప్రభావం పడలేదని, సరఫరా సమస్యలు ఉండబోవని వచ్చిన వార్తల కారణంగా ముడి చమురు ధరలు 1.5 శాతానికి పైగా పతనమై, నాలుగేళ్ల గరిష్ట స్థాయి నుంచి రెండు వారాల కనిష్ట స్థాయికి చేరాయి. అంతేకాకుండా చమురు కంపెనీలు అదనపు సబ్సిడీ భారాన్ని భరించాల్సిన అవసరం లేదంటూ కేంద్రం భరోసానివ్వడం కూడా కలసివచ్చింది. దీంతో హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఓఎన్‌జీసీ, ఐఓసీ, గెయిల్‌ ఇండియా షేర్లు 4–15% వరకూ ర్యాలీ చేశాయి.  మరోవైపు విమానయాన ఇంధనంపై ఎక్సైజ్‌ సుంకాన్ని కేంద్రం 14 శాతం నుంచి 11 శాతానికి   తగ్గించడంతో విమానయాన ఇంధన షేర్లు పెరిగాయి. జెట్‌ ఎయిర్‌వేస్, ఇండిగో, స్పైస్‌జెట్‌ షేర్లు 1–3 శాతం రేంజ్‌లో లాభపడ్డాయి. ఇంట్రాడేలో ఈ మూడు షేర్లు 7.4 శాతం వరకూ పెరిగాయి.  

మరిన్ని విశేషాలు... 
►మొత్తం 31 సెన్సెక్స్‌ షేర్లలో మూడు  షేర్లు–ఓఎన్‌జీసీ, యస్‌ బ్యాంక్, హిందుస్తాన్‌ యూనిలివర్‌  మాత్రమే లాభపడగా, మిగిలిన 28 షేర్లు నష్టాల్లో ముగిశాయి.  
►మొత్తం 50 నిఫ్టీ షేర్లలో 8 షేర్లు మాత్రమే లాభపడగా, 42 షేర్లు నష్టపోయాయి.  
►  స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 5.7 శాతం నష్టంతో రూ.262 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్‌ ఇదే.  
►  క్యూ2 ఆర్థిక ఫలితాలు వెల్లడి కానున్న నేపథ్యంలో టీసీఎస్‌ షేర్‌ 3.1 శాతం నష్టపోయి రూ.1,980 వద్దకు చేరింది.  
► బీఎస్‌ఈలో 370 షేర్లు తాజా ఏడాది కనిష్టాలకు పడిపోయాయి. ఎయిర్‌టెల్, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.  
► యస్‌ బ్యాంక్‌ సీఈఓ ఎంపిక కమిటీ తొలి  సమావేశం  నేపథ్యంలో షేర్‌  ఇంట్రాడే కనిష్ట స్థాయి, రూ.217 నుంచి చూస్తే, ఈ షేర్‌ 24% లాభపడింది. 2.5% పెరిగి రూ.240 వద్ద ముగిసింది.  
►   మార్కెట్‌ భారీగా నష్టపోయినప్పటికీ, గ్రాఫైట్‌ ఎలక్ట్రోడ్‌లు తయారు చేసే గ్రాఫైట్‌ ఇండియా, హెచ్‌ఈజీలు 10% వరకూ పెరిగాయి.  
► 250కు పైగా షేర్లు వాటి వాటి లోయర్‌ సర్క్యూట్లను తాకాయి. క్వాలిటీ, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ ట్రాన్స్‌పోర్టేషన్, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, వి–మార్ట్, ట్రీ హౌజ్‌ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.  

2.69 లక్షల కోట్లు ఆవిరి 
బీఎస్‌ఈ సెన్సెక్స్‌ భారీ పతనం కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.2.69 లక్షల కోట్లు హరించుకుపోయింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.2,69,348 కోట్లు ఆవిరై రూ.1,35,70,403 కోట్లకు పరిమితమైంది.  

పతనానికి ప్రధాన కారణాలు...
ప్రపంచ మార్కెట్ల పతనం... 
ఇటీవల అమెరికాలో వెలువడిన ఆర్థిక గణాంకాలు పటిష్టంగా ఉన్నాయి. దీంతో అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీరేట్లను మరింతగా పెంచుతుందనే అంచనాలతో బుధవారం బాండ్ల రాబడులు భారీగా పెరిగాయి. ఫలితంగా అమెరికా కంపెనీల వడ్డీ వ్యయాలు పెరిగి, లాభదాయకత దెబ్బతింటుందనే ఆందోళనలు నెలకొన్నాయి. దీంతో బాండ్లు, ఇతరత్రా సురక్షిత సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేయడం కోసం ఇన్వెస్టర్లు ఈక్విటీలను తెగనమ్మారు. దీంతో అమెరికా స్టాక్‌ మార్కెట్‌ భారీగా నష్టపోయింది. అమెరికా స్టాక్‌ సూచీలు గత ఎనిమిది నెలల్లో అధ్వానమైన నష్టాలను బుధవారం నమోదు చేశాయి. ఈ ప్రభావంతో గురువారం ఆసియా, యూరప్‌ మార్కెట్లు కూడా భారీ నష్టాల్లోనే ముగిశాయి. అమెరికా– చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు మరింతగా ముదిరే అవకాశాలుండటం, అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి అంచనాలను అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ తగ్గించడం.. అంతర్జాతీయంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌పై తీవ్రమైన ప్రభావం చూపాయి. చైనా స్టాక్‌ సూచీలు నాలుగేళ్ల కనిష్టానికి పడిపోగా, జపాన్, కొరియా, ఆస్ట్రేలియా సూచీలు కూడా భారీగా పతనమయ్యాయి. జపాన్‌ నికాయ్‌ సూచీ 3.8%, చైనా షాంగై సూచీ 5.2 వాతం, హాంకాంగ్‌ హాంగ్‌సెంగ్‌ 3.7 శాతం చొప్పున నష్టపోయాయి. యూరప్‌ మార్కెట్లు కూడా 1–1.5 శాతం రేంజ్‌లో పతనమయ్యాయి.  

కొనసాగుతున్న విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు 
విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులకు ఇప్పటివరకూ ఆకర్షణీయంగా ఉన్న మన స్టాక్‌ మార్కెట్‌ ఆ ప్రాభవాన్ని కోల్పోయింది. రూపాయి భారీగా పతనం కావడం, ముడిచమురు ధరలు పెరుగుతుండటంతో కరెంట్‌ అకౌంట్‌ లోటు మరింతగా పెరుగుతున్న భయాలు దీనికి ప్రధాన కారణాలు. దీంతో విదేశీ ఇన్వెస్టర్లు మన క్యాపిటల్‌ మార్కెట్‌ నుంచి తమ పెట్టుబడులను ఉపసంహరిస్తున్నారు. ఈ నెలలో ఇప్పటివరకూ విదేశీ ఇన్వెస్టర్లు రూ.16,536 కోట్ల మేర పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు.  

మళ్లీ జీవిత కాల కనిష్టానికి రూపాయి  
డాలర్‌తో రూపాయి మారకం మళ్లీ జీవిత కాల కనిష్ట స్థాయి, 74.48కు పడిపోవడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌పై తీవ్రమైన ప్రభావాన్నే చూపించింది. చివరి రెండు గంటల్లో రూపాయి ఒకింత రికవరీ అయినా, స్టాక్‌ సూచీల పతనం ఆగలేదు.  

వృద్ధి మందగమన భయాలు 
అమెరికా– చైనాల మధ్య సుంకాల పోరు అంతర్జాతీయంగా వృద్ధిని మందగింపజేస్తుందని ప్రపంచ బ్యాంక్‌ అధ్యక్షుడు జిమ్‌ యంగ్‌ కిమ్‌ వ్యాఖ్యానించారు. అన్ని దేశాలు సుంకాలను పెంచుతూ పోతే ప్రపంచ వృద్ధికి విఘాతం కలుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.  

హెవీ వెయిట్‌ షేర్ల నష్టాలు:  
సెన్సెక్స్‌లో వెయిటేజీ అధికంగా ఉన్న 5 షేర్లు.. ఇన్ఫీ, హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం, టీసీఎస్, ఎస్‌బీఐ భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్‌ 760 పాయింట్ల నష్టంలో ఈ 5 షేర్ల వాటాయే సగం వరకూ ఉంది. 

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement