ఇక మోడి సర్కారు పాలసీ చర్యలపై దృష్టి!
కొత్త ప్రభుత్వం మంత్రివర్గ కూర్పుపై కూడా..
* స్టాక్ మార్కెట్ కదలికలపై నిపుణుల అంచనా..
* ఈ వారం సూచీలు స్వల్పశ్రేణిలోనే..
* ప్రస్తుతానికి మార్కెట్లో కొంత కన్సాలిడేషన్‌కు చాన్స్
* కొద్ది వారాలపాటు బులిష్ ధోరణి కొనసాగుతుంది..
న్యూఢిల్లీ: కేంద్రంలో నరేంద్ర మోడీ నేతృత్వంలోని సుస్థిరమైన ఎన్‌డీఏ ప్రభుత్వం కొలువుదీరనుండటంతో మార్కెట్లలో ఎనలేని జోష్ నెలకొంది. ఇప్పటికే సెన్సెక్స్, నిఫ్టీలు సరికొత్త ఆల్‌టైమ్ గరిష్టాలకు ఎగబాకాయి. ఎన్నికల ఫలితాలు తేటతెల్లం కావడంతో ఇకపై మోడీ సర్కారు ప్రకటించే విధానపరమైన నిర్ణయాలు, కొత్త ప్రభుత్వంలో కేబినెట్ మంత్రుల కూర్పు వంటి అంశాలపైనే మార్కెట్లు దృష్టిసారించనున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
లోక్‌సభలో బీజీపీ సొంతంగా 282 సీట్ల పూర్తిస్థాయి మెజారిటీతో చరిత్ర సృష్టించడం, ఎన్‌డీఏ కూటమికి 336 సీట్ల పటిష్టమైన బలం లభించడం తెలిసిందే. అంతేకాకుండా 30 ఏళ్ల తర్వాత(1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం రాజీవ్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌కు 414 సీట్ల బంపర్ మెజారిటీ లభించింది) ఒక పార్టీ సొంతంగా 272 సీట్ల మేజిక్ ఫిగర్‌ను అధిగమించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత బలాన్ని సంపాదించడం ఇదే తొలిసారి.
కొన్నాళ్లు బులిష్‌గానే...
ప్రస్తుతానికైతే మార్కెట్లు కొంత స్థిరీకరణ(కన్సాలిడేషన్) దిశగా అడుగులు వేయొచ్చని... అయితే, రానున్న కొద్దివారాలపాటు బులిష్ ధోరణిలోనే ఉండొచ్చని ఆర్‌కేఎస్‌వీ బ్రోకరేజి సంస్థ సహ వ్యవస్థాపకుడు రఘు కుమార్ అభిప్రాయపడ్డారు. మోడీ-బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ సుస్థిర ప్రభుత్వం కొలువుదీరనున్న అంశాన్ని మార్కెట్లు ఇంకా పూర్తిగా ఫ్యాక్టర్ చేసుకోలేదని... కాబట్టి మరికొంత పుంజుకోవడానికి అవకాశం ఉందనేది ఆయన అభిప్రాయం.
‘ఇప్పుడు సుస్థిర ప్రభుత్వానికి ఢోకాలేదన్న విషయం స్పష్టమైంది. దీంతో విధానపరమైన నిర్ణయాల్లో సందిగ్ధతకు అవకాశాలు లేనట్టే. ఈ వారంలో పెద్దగా చెప్పుకోదగ్గ పరిణామాలేవీ లేనందున.. స్టాక్ సూచీలు ఇప్పుడున్న స్థాయిలోనే కొంత కన్సాలిడేట్ కావచ్చు’ అని రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ అభిప్రాయపడ్డారు. మరోపక్క, కేంద్రంలో కీలక మంత్రివర్గ శాఖలు ఎవరికి కేటాయించనున్నారు... కొత్త సర్కారు జూలైలో ప్రవేశపెట్టనున్న తొలి బడ్జెట్‌పై అంచనాలు వంటి అంశాలపైనే ఇప్పుడిక మార్కెట్లు నిశితంగా దృష్టిపెడతాయన్నారు.
సంస్కరణలను పరుగులు పెట్టించాలి...
ఎన్‌డీఏ కూటమి దక్కించుకున్న బంపర్ విజయంతో మేనిఫెస్టోలో పేర్కొన్న పాలసీ చర్యలను అమలు చేయడానికి తగినంత అవకాశం లభించినట్లే. దీంతో ప్రభుత్వ ఏర్పాటు, పాలసీపరమైన ప్రకటనలను ఇన్వెస్టర్లు జాగ్రత్తగా గమనించనున్నారు. పాలసీ చర్యలను పటిష్టంగా అమలు చేయాలంటే... కేబినెట్ మంత్రులుగా సమర్థులకు పట్టం కట్టాలని, ఇప్పుడు మోడీ సర్కారుకు ఇదే అత్యంత కీలక అంశం కానుందని సిస్టెమాటిక్స్ షేర్స్ సీఈఓ సునిల్ సర్దా వ్యాఖ్యానించారు. కాగా, దేశంలో సంస్కరణలను మరింత పరుగులు పెట్టించడం ద్వారా ఆర్థిక పరిస్థితులు మెరుగయ్యేలా చేయొచ్చని.. దీనివల్ల దేశ సార్వభౌమ రేటింగ్ కూడా మెరుగవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ పరిణామాలు సాకారమైతే... విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ), విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐ) నిధుల ప్రవాహం మరింత పుంజుకుంటుందన్నారు. దీంతో డాలరుతో రూపాయి మారకం విలువ బలపడేందుకు దోహదం చేస్తుందని చెప్పారు.
స్వల్పకాలానికి స్టాక్ మార్కెట్ ట్రెండ్‌ను ఎఫ్‌ఐఐల పెట్టుబడులు, అంతర్జాతీయ పరిణామాలు, రూపాయి కదలికలే నిర్ధేశించనున్నాయని నిపుణులు పేర్కొన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ), ఐటీసీ వంటి దిగ్గజాల ఆర్థిక ఫలితాలు కూడా ఈ వారంలోనే రానున్నాయి. ఎన్‌డీఐ అఖండ విజయంతో గడచిన శుక్రవారం సెన్సెక్స్ ఇంట్రాడేలో 1,470 పాయింట్లు దూసుకెళ్లి 25,000 మార్కును అధిగమించడం తెలిసిందే. అయితే, ఆతర్వాత లాభాల స్వీకరణ జరగడంతో 216 పాయింట్ల లాభంతో 24,122 పాయింట్ల వద్ద ముగిసింది. గత వారం మొత్తంమీద చూస్తే.. సెన్సెక్స్ 1,128 పాయింట్లు ఎగబాకవడం విశేషం.