
బహుశా! 2018వ సంవత్సరాన్ని ఇన్వెస్టర్లెవరూ మరిచిపోలేరేమో!! ఎందుకంటే ఈ ఏడాది వచ్చినన్ని ఒడిదుడుకులు గతంలో ఎన్నడూ రాలేదు. ఈ ఏడాదిలో ఒకదశలో మార్కెట్లు జీవితకాల గరిష్ఠ స్థాయిలకు వెళ్లాయి. భారీ లాభాలనిచ్చాయని అనుకున్నారంతా!. కానీ ఏడాది చివరికి వచ్చేసరికి పరిస్థితి తల్లకిందులైంది. ఈ ఏడాది వచ్చిన లాభాలన్నీ హరించుకుపోయాయి. మన దేశంలోనే కాదు. అంతర్జాతీయంగానూ ఇదే పరిస్థితి.
మార్కెట్లే కాదు. మన కరెన్సీ రూపాయిదీ అదే పరిస్థితి. జీవితంలో ఎన్నడూ చూడని గరిష్ఠ స్థాయిని మన రూపాయి ఈ ఏడాది చూసింది. డాలర్‌తో మారకంలో ఏకంగా 74 రూపాయల్ని దాటేసింది. మళ్లీ 70 దిగువకు వచ్చేసింది. మన ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమైన ముడి చమురుదీ అదే పరిస్థితి. ఈ ఏడాది ఒక దశలో 80 డాలర్లను కూడా దాటిన బ్యారెల్ చమురు... మళ్లీ 50 డాలర్ల దిగువకు వచ్చేసింది. మన బ్యాంకులు కొన్ని భారీ కుంభకోణాల్ని చూశాయి. బిట్‌కాయిన్ పాతాళానికి పడిపోయింది. ఇక అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థల్ని ప్రభావితం చేసే వాణిజ్య యుద్ధాలనూ ఈ ఏడాది మనకు పరిచయం చేసింది. చైనా దిగుమతులపై అమెరికా భారీ సుంకాలు విధిస్తే... దాన్ని చైనా అంతే దీటుగా తిప్పికొట్టింది. చివరకు ఈ యుద్ధంలోకి మనలాంటి దేశాలూ చేరక తప్పలేదు. అందుకే... ఆర్థిక వ్యవస్థకు ఇది ఎగుడుదిగుడుల నామ సంవత్సరమని చెప్పొచ్చు.
మరి అలాగని ఈ సంవత్సరం సానుకూల పరిణామాలేవీ లేవా? అంటే... చాలా ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యం... మార్కెట్లు పరిణతి సాధించాయి. ఎన్నికల ఫలితాలొచ్చినపుడో, ఆర్‌బీఐ గవర్నరు ఉన్నట్టుండి రాజీనామా చేసినపుడో మార్కెట్లు ఒక్కసారి ఉలిక్కిపడ్డా... వెంటనే సర్దుకున్నాయి. మార్కెట్లే కాదు!! మన ఇన్వెస్టర్లలోనూ పరిణతి పెరిగింది. గతంలో మార్కెట్లు పెరిగేటపుడు పెట్టుబడులు పెట్టి... ఒకవేళ పడిపోతే ఉపసంహరించుకునే సంస్కృతి ఉండేది. ఇపుడు మార్కెట్లు పడుతున్నపుడే మరిన్ని పెట్టుబడులు పెట్టే ధోరణి పెరిగింది. ఫండ్లలోకి.. అది కూడా సిప్ రూపంలో వచ్చే పెట్టుబడులు పెరగటం దీనికి నిదర్శనం. ఇక కనుమరుగైన బ్రాండ్లు, వాహనాలు మళ్లీ మార్కెట్లో హల్‌చల్ చేస్తున్నాయి. శాంత్రో, జావా ఇలాంటి కథలే. దేశీయంగా జరిగిన విలీనాలు– కొనుగోళ్లలో ఈ ఏడాదిది రికార్డు స్థాయి. అద్భుతాలు సృష్టించిన స్టార్టప్‌ల సంఖ్య పెరగటమే కాదు. రిటైల్ దిగ్గజం ఐకియా భారత్‌లో తొలి స్టోర్‌ను ఆరంభించటం... ఇవన్నీ శుభపరిణామాలే. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్న వేళ 2018 నాటి కీలక ఆర్థిక ఘటనల సమాహారం మీకోసం..
స్టాక్ మార్కెట్: లాభాలు హరీ!
గతేడాది భారీ రాబడులిచ్చిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ ఏడాది పడుతూ లేస్తూ ముగించాయి. ప్రస్తుతానికి ఏడాది ఆరంభంతో పోలిస్తే ప్రధాన సూచీలు దాదాపు 7 శాతం లాభపడ్డాయి. ఈ ఏడాది మధ్యలో నిఫ్టీ, సెన్సెక్స్ జీవితకాల గరిష్ఠాలను చవిచూశాయి. ప్రధాన సూచీలతో పోలిస్తే మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు అత్యంత అధ్వాన్న ప్రదర్శనిచ్చాయి. ఏడాది ఆరంభంతో పోలిస్తే మిడ్‌క్యాప్ సూచీ 13 శాతం, స్మాల్‌క్యాప్ సూచీ 23 శాతం మేర నష్టపోయాయి. గతేడాది ర్యాలీ అనంతరం ఈ సంవత్సరం సూచీలు ఒకదశలో భారీ కరెక్షన్ చవిచూశాయి. ఈక్విటీ మార్కెట్లోకి దేశీయ నిధుల ప్రవాహం ఈ ఏడాది కూడా కొనసాగింది. ఈక్విటీ ఫండ్స్ దేశీయ మార్కెట్లో దాదాపు 1.18 లక్షల కోట్ల రూపాయల కొనుగోళ్లు చేశాయి. మరోవైపు ఎఫ్‌పీఐలు దేశీయ మార్కెట్ నుంచి సుమారు 87వేల కోట్ల రూపాయల అమ్మకాలు జరిపాయి. వరుసగా ఆరేళ్లు భారత మార్కెట్లో కొనుగోలుదారులుగా ఉన్న ఎఫ్‌పీఐలు ఈ ఏడాది నికర అమ్మకందారులుగా మారాయి. ఈ సంవత్సరం మోదీ సర్కారు బడ్జెట్లో దీర్ఘకాలిక మూలధన రాబడి పన్నును (ఎల్‌టీసీజీ) ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
అంతర్జాతీయ మార్కెట్లదీ అదేదారి...
ట్రేడ్‌వార్ పుణ్యమా అని అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు ఈ ఏడాది భారీ పతనాలను నమోదు చేశాయి. ముఖ్యంగా చైనా సూచీ సంవత్సరంలో 22 శాతం పతనమైంది. వర్ధమాన దేశాల మార్కెట్లు అతలాకుతలం అయ్యాయి. యూఎస్ సూచీలు సైతం పలు ఆటుపోట్లు చవిచూశాయి. యూకేలో బ్రెగ్జిట్ భయాలతో మార్కెట్లు దాదాపు 12 శాతం క్షీణించాయి. ఇతర యూరప్ మార్కెట్లు సైతం నేల చూపులు చూశాయి.
ఐపీఓలు.. సెకండాఫ్ నీరసం
2018లో దాదాపు 60వేల కోట్ల రూపాయల విలువైన పబ్లిక్ ఆఫర్లకు సెబి అనుమతినిచ్చింది. అయితే ఇంతవరకు కేవలం 31వేల కోట్ల రూపాయల ఐపీఓలే మార్కెట్ ముందుకు వచ్చాయి. ప్రైమరీ మార్కెట్లు పేలవంగా ఉండటంతో అనుమతి పొందిన ఇతర కంపెనీలు సరైన తరుణం కోసం వేచి చూస్తూ ప్రస్తుతానికి తమ ప్రణాళికలను వాయిదా వేసుకున్నాయి. ఈ సంవత్సరం ఐపీఓకి వచ్చిన కంపెనీల్లో భారత్ డైనమిక్స్ లిమిటెడ్, హెచ్‌ఏఎల్, ఇండోస్టార్ క్యాపిటల్ ఫైనాన్స్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్; అపోలో మైక్రోసిస్టమ్స్ అధ్వాన పనితీరు కనబరిచాయి. ఎండీఎన్‌ఎల్, హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ, ఫైన్ ఆర్గానిక్స్, బంధన్ బ్యాంక్, రైట్స్ కంపెనీల షేర్లు ఒక మోస్తరు రాబడులు అందించాయి. అందుకే ఈ ఏడాది తొలి అర్ధ సంవత్సరంతో పోలిస్తే రెండో అర్ధ భాగంలో పెద్దగా ఐపీఓలు రాలేదు. దేశీయ మ్యూచ్‌వల్ ఫండ్లలోకి పెట్టుబడుల వరద ఈ సంవత్సరం కూడా కొనసాగింది. కానీ ఈ సంవత్సరం లార్జ్‌క్యాప్ ఫండ్స్ 4 శాతం, మిడ్‌క్యాప్ ఫండ్స్ 14 శాతం, స్మాల్‌క్యాప్ ఫండ్స్ 21 శాతం మేర నెగటివ్ రాబడులు ఇచ్చాయి. అయినా.. సిప్ రూపంలో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల్ని కొనసాగిస్తూనే వస్తున్నారు.
ఉర్జిత్ పటేల్: ఎగ్జిట్
ప్రభుత్వానికి, రిజర్వు బ్యాంకుకు మధ్య పొరపచ్చాలున్నాయంటూ ఈ ఏడాది వార్తలు వచ్చాయి. వీటికి పరాకాష్టగా ఉన్నట్లుండి ఏడాది చివర్లో ఆర్‌బీఐ గవర్నర్ పదవికి ఉర్జిత్ పటేల్ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ఆయన చెప్పినా, ప్రభుత్వ పోకడలు నచ్చక వైదొలిగారని సంబంధిత వర్గాలంటున్నాయి. ముఖ్యంగా ఆర్‌బీఐ ఎన్‌పీఏలున్న బ్యాంకులపై ఆంక్షలు, లిక్విడిటీ మేనేజ్‌మెంట్, రిజర్వు నిధుల వినియోగంపై ఇరు పక్షాలకు బేధాభిప్రాయాలున్నాయి. ఇవన్నీ చినికి చినికి పటేల్ రాజీనామాకు దారితీశాయి. అనంతరం ప్రభుత్వం శక్తికాంతదాస్‌ను కొత్త గవర్నర్‌గా నియమించింది.
ఐఎల్‌ఎఫ్‌ఎస్: సంక్షోభం
లిక్విడిటీ కొరత కారణంగా అప్పులిచ్చినవాళ్లకు సకాలంలో చెల్లింపులు చేయలేక ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ చేతులెత్తేసింది. దీంతో బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల(ఎన్‌బీఎఫ్‌సీ) రంగంలో పెను సంక్షోభం బయటపడింది. ఈ ప్రభావం డెట్, ఈక్విటీ మార్కెట్‌పై విపరీతంగా పడింది. సుమారు మూడునెలలు మార్కెట్లు, ఎన్‌బీఎఫ్‌సీ షేర్లు అల్లకల్లోలం అయ్యాయి. రేటింగ్ ఏజెన్సీలు కంపెనీ బాండ్లను డౌన్‌గ్రేడ్ చేశాయి. కంపెనీ ఎక్కువగా రుణాలిచ్చిన రియల్టీ రంగంపై ఈ సంక్షోభం ప్రభావం చూపించింది. ఇంతలో డీహెచ్‌ఎఫ్‌ఎల్ బాండ్లను డీఎస్‌పీ బ్లాక్‌రాక్ మ్యూచ్‌వల్ ఫండ్ ఉన్నట్లుండి విక్రయించడంతో అనుమానాలు ముదిరాయి. ఈ నేపథ్యంలో గృహ ఫైనాన్స్ రంగ షేర్లు కుదేలయ్యాయి.
ఫేస్‌బుక్... వివాదాలు
కొత్త సంవత్సరం ఫేస్‌బుక్ పలు వివాదాల బారిన పడింది. కేంబ్రిడ్జ్ అనలిటికా సంస్థ... ఫేస్‌బుక్ యూజర్ల డేటాను రాజకీయంగా దుర్వినియోగం చేసిందని మార్చిలో బయటపెట్టింది. ఏప్రిల్‌లో వ్యవహారం మరింత మంది యూజర్ల డేటా హ్యాకింగ్‌కు గురైందని ఫేస్‌బుక్ ప్రకటించింది. పలు వివాదాలపై సంస్థ సీఈఓ యూఎస్ కాంగ్రెషనల్ కమిటీ ముందు హాజరయి వివరణ ఇచ్చారు. పలుదేశాల ప్రభుత్వాలు డేటా వినియోగంపై ఫేస్‌బుక్‌ను వివరణ కోరాయి. ఈ వివాదాలతో 2018లో కంపెనీ షేరు దాదాపు 30 శాతం పతనమైంది.
కొనుగోళ్లు, విలీనాలు: రికార్డు
భారత ఎంఅండ్‌ఏ (మెర్జర్స్ అండ్ ఎక్విజిషన్స్) డీల్స్ ఈ ఏడాది ఆల్‌టైమ్ హైని చేరాయి. 2018లో ఏకంగా 12,520 కోట్ల డాలర్ల విలువైన డీల్స్ జరిగాయి. అంతర్జాతీయ దిగ్గజం వాల్‌మార్ట్ భారత ఈకామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో 77% వాటాను 1600 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది. వొడాఫోన్, ఐడియా విలీనమై దేశంలో అతిపెద్ద టెలికం కంపెనీగా అవతరించాయి. టెలినార్, టాటాటెలీని ఎయిర్‌టెల్ సొంతం చేసుకుంది. ఇండస్ టవర్స్, భారతి ఇన్‌ఫ్రాటెల్ కలిసిపోయాయి. హెచ్‌పీసీఎల్‌లో 51% వాటాను ఓఎన్‌జీసీ సొంతం చేసుకుని హెచ్‌పీసీఎల్‌కు యజమానిగా మారింది. ప్రఖ్యాత హార్లిక్స్, బూస్ట్ బ్రాండ్లతో పాటు గ్లాక్సో స్మిత్‌క్లైన్ కన్జూమర్ న్యూట్రిషన్ వ్యాపారాన్ని హెచ్‌యూఎల్ కొనుగోలు చేసింది. బీఓబీ, విజయాబ్యాంక్, దేనా బ్యాంకులను విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అరైస్టా లైఫ్ సైన్సెస్‌ను యూపీఎల్ కొనుగోలు చేసింది. దివాలా తీసిన ఎలక్ట్రో స్టీల్‌ను వేదాంత... భూషణ్ స్టీల్‌ను టాటా స్టీల్... మోన్నెట్ ఇస్పాత్‌ను జేఎస్‌డబ్ల్యూ స్టీల్... ఆమ్‌టెక్ ఆటోను లిబర్టీ హౌస్ సొంతం చేసుకున్నాయి.
దిగ్గజాలుగా మన స్టార్టప్స్
ఈ ఏడాది ఇండియన్ స్టార్టప్స్ అనేకం యూనికార్న్స్‌గా (వందకోట్ల డాలర్ల పైచిలుకు వాల్యుయేషన్ సాధించినవి) అవతరించాయి. ప్రస్తుతం భారత్‌లో 26 యూనికార్న్‌లున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఓయో, ఓలా, బైజు, పేటీఎం, జొమాటో, స్విగ్గీలు ఈ ఏడాది భారీగా అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించాయి. వీటితో పాటు ఈ సంవత్సరం పలు దేశీయ కంపెనీల్లో విదేశీ ఇన్వెస్టర్లు భారీగా పెట్టుబడులు పెట్టారు. దాదాపు 77 డీల్స్‌లో సుమారు 360 కోట్ల డాలర్ల నిధులు దేశీ కంపెనీల్లోకి ప్రవహించాయి. తొలిసారి వారెన్ బఫెట్ భారతీయ కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. పేటీఎం మాతృసంస్థలో బఫెట్‌కు చెందిన బెర్క్‌షైర్ హాత్‌వే 30 కోట్ల డాలర్లు పెట్టుబడి పెట్టింది. ఏడేళ్లలో ఎన్నడూ లేనట్లు ఈ సంవత్సరం చైనా, జపాన్ నుంచి పలువురు ఇన్వెస్టర్లు దేశీయ కంపెనీల్లో వాటాలు కొన్నారు. వీటిలో సాఫ్ట్‌బ్యాంక్ అత్యధికంగా 25 డీల్స్ కుదుర్చుకుని పలు భారతీయ కంపెనీల్లో వాటాలు కొన్నది.
ఎకానమీ... తిరిగి గాడిలోకి!
రెండేళ్ల పాటు నోట్లరద్దు, జీఎస్‌టీ అమలుతో కుంటుపడిన దేశ ఆర్థిక వృద్ధి ఈ ఏడాది కాస్త గాడిన పడింది. ఈ సంవత్సరం తిరిగి జీడీపీ 7 శాతం పైకి చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఎకాఎకిన 8.2 శాతం వృద్ధి నమోదు చేసింది. రెండో త్రైమాసికంలో కాస్త చల్లబడి 7.1%కి చేరింది. ఇండియా జీడీపీ వృద్ధి రేటు అంచనాలను ఫిచ్ 7.8% నుంచి 7.2%కి తగ్గించింది. ఈ ఏడాది ద్రవ్యోల్బణం క్రమంగా దిగివచ్చింది. నవంబర్‌లో ద్రవ్యోల్బణం 2.3%గా నమోదయింది. ప్రపంచ బ్యాంకు ప్రకటించే ఈజ్ ఆఫ్ డూయింగ్ ర్యాంకింగ్స్‌లో ఇండియా ర్యాంకు 23 స్థానాలు మెరుగుపడి 77కు చేరింది. ఈ ఏడాది ప్రభుత్వం కొత్తగా డ్రోన్స్ పాలసీ, జాతీయ ఎలక్ట్రానిక్స్ పాలసీ, పీఎస్‌ఎస్ చట్ట సవరణ, కంపెనీల చట్ట సవరణ బిల్లులను, ఇ– ఫార్మసీ పాలసీని తీసుకువచ్చింది. ఎలక్ట్రిక్ వాహనాల పాలసీలో మార్పులు చేసింది. జీఎస్‌టీ పూర్తయి సంవత్సరం పూర్తయిన వేళ తొలిసారి ఈ ఏడాది జీఎస్‌టీ నెలవారీ వసూళ్లు లక్ష కోట్ల రూపాయలను తాకాయి.
స్కాములు... షరా మామూలు
ఈ ఏడాది ఫిబ్రవరిలో పంజాబ్ నేషనల్ బ్యాంకుకు సంబంధించి దాదాపు 14వేల కోట్ల రూపాయల కుంభకోణం బయటపడింది. భారత బ్యాంకింగ్ చరిత్రలోనే ఇది అతిపెద్ద కుంభకోణం. వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, ఆయన బంధువు మెహుల్ చోక్సీ... లెటర్ ఆఫ్ అండర్‌టేకింగ్‌ల పేరిట పీఎన్‌బీని ఏకంగా రూ.13,000 కోట్ల మేర మోసగించారు. తరవాత ఇద్దరూ దేశం విడిచి పరారయ్యారు కూడా. ఇక కాన్పూర్‌కు చెందిన రొటోమాక్ కంపెనీ... దాదాపు ఏడు బ్యాంకులకు సుమారు రూ.3,700 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టింది. దీంతోపాటు కనిష్క గోల్డ్, ఆర్‌పీ ఇన్ఫోసిస్టమ్స్, యూబీఐ స్కాములు సైతం బయటపడ్డాయి. మరోవైపు కింగ్‌ఫిషర్ విజయ్‌మాల్యాను భారత్‌కు అప్పగించేందుకు బ్రిటన్ కోర్టు అంగీకరించింది. ఈ ఏడాది స్కామ్‌లతో బ్యాంకులకు రూ.35,000 కోట్ల మేర నష్టం వచ్చింది. వీడియోకాన్ గ్రూప్‌లో అనుచిత పెట్టుబడులకు పరోక్ష సహకారం అందించారని ప్రముఖ బ్యాంకర్ చందా కొచ్చర్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీంతో ఆమె ఐసీఐసీఐ సీఈఓ పదవికి రాజీనామా చేశారు.
ఆటో రంగం: కొత్త లాంచింగ్‌లు
హుందాయ్ సంస్థ తన హ్యాచ్‌బ్యాగ్ శాంత్రోను మళ్లీ మార్కెట్లోకి తీసుకువచ్చింది. మహీంద్రా సంస్థ కొత్త ఎస్‌యూవీ మారాజోను, టయోటా కొత్తకారు యారిస్‌ను విడుదల చేశాయి. హోండా కంపెనీ అమేజ్ న్యూవెర్షన్‌ను తెచ్చింది. టూవీలర్స్ విభాగంలో టీవీఎస్ ఎన్‌టార్క్, హీరో డెస్టినీ, ఎక్స్‌ట్రీమ్ 200ఆర్, రాయల్‌ఎన్‌ఫీల్డ్ ఇంటర్ సెప్టార్, కాంటినెంటల్ జీటీ, బీఎండబ్ల్యూ జీ310, హోండా డెస్టినీ, సుజుకీ బర్గ్‌మాన్ స్ట్రీట్ మార్కెట్లో సందడి చేశాయి. 80వ దశకం వరకు బాగా క్రేజ్ ఉన్న జావా బైక్‌ను మహీంద్రా అండ్ మహీంద్రా తిరిగి మార్కెట్లోకి తీసుకువచ్చింది.
క్రూడ్, రూపాయి: ఎగసిపడి...
2018లో ముడి చమురు భారీ కదలికలు నమోదు చేసింది. ఇరాన్‌పై యూఎస్ ఆంక్షలు విధించడంతో క్రూడ్ ధరకు రెక్కలొచ్చాయి. బ్రెంట్ ధర ఒక దశలో 90 డాలర్లకు చేరువైంది. అయితే కొన్ని దేశాలకు ఆంక్షల నుంచి మినహాయింపు ఇవ్వడం, షేల్ గ్యాస్ ఉత్పాదన పెరగడంతో క్రూడ్ ధర ఒక్కసారిగా పతనమై 60 డాలర్ల దిగువకు చేరింది. మరోవైపు డాలర్‌తో రూపాయి మారకం విలువను క్రూడ్ ధర పెరగడం ప్రభావితం చేసింది. క్యాడ్ భయాలు, డాలర్ బలపడటంతో మన రూపాయి ఈ ఏడాది జీవితకాల కనిష్ఠం 74.48 స్థాయిలకు పతనమైంది. కానీ ఆ తర్వాత పరిస్థితులు చక్కబడటంతో ఏడాది చివరకు రూపీ క్రమంగా బలపడుతూ 70 స్థాయిలకు అటుఇటుగా కదలాడుతోంది.
అమెరికా ఫెడ్: ట్రంప్‌తో రగడ
ఈ ఏడాది అమెరికా ఫెడరల్ రిజర్వు బ్యాంకు 4 సార్లు రేట్లు పెంచింది. దీంతో ఫెడ్ రేటు 2.5%కి చేరింది. యూఎస్ ఎకానమీ అనుకున్నట్లుగానే బలపడుతోందని.... వచ్చే ఏడాది 3, ఆపై ఏడాది 2 దఫాలు రేట్లు పెంచవచ్చని అంచనా వేసింది. కాకపోతే ఇది అధ్యక్షుడు ట్రంప్‌కు సుతరామూ నచ్చలేదు. తాజాగా డిసెంబర్లో పెంపు వద్దని ఆయన ఫెడ్‌ను కోరినా... ఫెడ్ ఆయన మాట వినలేదు. దీంతో ఫెడ్ చైర్మన్‌ను తీసేయాలని ట్రంప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వస్తున్న కథనాలు తాజాగా అంతర్జాతీయ మార్కెట్లను అతలాకుతలం చేస్తున్నాయి.
విమానయానం: నేల చూపులు
దేశీయ విమానయాన రంగం ఈ ఏడాది రెండు రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంది. ఒకపక్క వైమానిక ఇంధనం ధరలు పెరిగిపోవడం, మరోపక్క రూపాయి పతనం కంపెనీలను కుంగదీశాయి. విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్నా... అది కంపెనీలకు లాభాలు తెచ్చి పెట్టే స్థాయిలో లేదు. పైపెచ్చు మార్కెట్లో ప్రముఖంగా ఉన్న ఏడు కంపెనీల్లో చాలా వరకు రుణభారం ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్ ఇండియాను ప్రైవేటీకరించడానికి ప్రభుత్వం చేసిన యత్నాలు ఫలించలేదు. దీంతో కంపెనీని ఆదుకునేందుకు విడతలవారీగా మూలధన సాయం అందిస్తూ వస్తోంది.
బంగారం: మెరుపులు
ఈ సంవత్సరం బంగారం ధరలు దాదాపు 7 శాతం మేర లాభపడ్డాయి. ఈక్విటీలు అంతంతమాత్రపు పనితీరు చూపించటంతో బంగారానికి డిమాండ్ పెరిగింది. ఈ ఏడాది గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి నిధుల ప్రవాహం బాగానే కనిపించింది. ప్రభుత్వ గోల్డ్ సావరిన్ బాండ్లలోకీ పెట్టుబడులు బాగానే వచ్చాయి.
ఐకియా... తొలి స్టోర్ ఆరంభం
అంతర్జాతీయ ఫర్నిచర్, ఫర్నిషింగ్ దిగ్గజం ఐకియా తొలిసారి ఇండియాలో కాలు మోపింది. నాలుగేళ్ల పరిశోధన, ప్రయత్నాల అనంతరం హైదరాబాద్‌లో కొత్త స్టోర్‌ను ఈ ఏడాది ఆగస్టులో ఆరంభించింది. దాదాపు 10,500 కోట్ల రూపాయలను ఐకియా ఈ స్టోరుపై వెచ్చించింది. క్రమేపీ దేశంలో ఇతర నగరాలకు విస్తరించాలని కంపెనీ భావిస్తోంది. 2025కు 11 స్టోర్లతో పాటు 14,600 మందికి ఉపాధి కల్పిస్తామని తెలిపింది.
బిట్‌కాయిన్: పెరిగిన భయాలు
నిజ కరెన్సీకి ప్రత్యామ్నాయంగా భావించిన మిధ్యా (క్రిప్టో) కరెన్సీలు ఈ ఏడాది భారీగా దెబ్బతిన్నాయి. బిట్‌కాయిన్ విలువ ఏడాది చివరకు 19,350 డాలర్ల నుంచి ఏకంగా 3,360 డాలర్లకు దిగి రాగా, ఇథెరియమ్ విలువ 1,405 డాలర్ల నుంచి 88.71 డాలర్లకు పడిపోయింది.
యూఎస్, చైనా ట్రేడ్‌వార్
చైనా అనుసరిస్తున్న వాణిజ్య విధానాలు బాగాలేవంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆయన పలు చైనా ఉత్పత్తులపై సుంకాలను భారీగా పెంచారు. ఇందుకు దీటుగా చైనా సైతం యూఎస్ ఉత్పత్తులపై సుంకాలను పెంచింది. ఈ పరిణామాలన్నీ అంతర్జాతీయ ట్రేడ్ వార్‌కు దారి తీసేలా ఉద్రిక్తతలను పెంచాయి. అయితే ఏడాది చివరకు ఇరుదేశాల మధ్య ఒక అవగాహన వచ్చింది. 90 రోజుల్లో ఒక ఒప్పందానికి రావాలని ఇరుదేశాలు సంకల్పించాయి.
Comments
Please login to add a commentAdd a comment