స్టాక్ మార్కెట్లకు ఇన్ఫీ జోష్
* ఐటీ షేర్ల ర్యాలీ
* 184 పాయింట్లు ఎగసిన సెన్సెక్స్
* వారంలో హెచ్‌యూఎల్ వృద్ధి 14 శాతం
మార్కెట్ అప్‌డేట్
ముంబై: అంచనాలను మించిన ఇన్ఫోసిస్ ఫలితాలతో శుక్రవారం ఆ కంపెనీ షేరే కాకుండా స్టాక్ మార్కెట్లు కూడా పెరిగాయి. దీంతో వరుసగా రెండో రోజూ కూడా స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. ఆద్యంతం ఒడిదుడుకుల మయంగా సాగిన స్టాక్‌మార్కెట్లలో ఐటీ షేర్లు ర్యాలీ జరిపాయి.
ఇన్ఫోసిస్ డిసెంబర్ క్వార్టర్ ఫలితాలు బాగా ఉండటంతో ఆ కంపెనీ షేర్ 5 శాతం, దీంతోపాటు టీసీఎస్ షేర్ 2.8 శాతం చొప్పున పెరిగాయి. 184 పాయింట్ల సెన్సెక్స్ లాభంలో ఈ రెండు షేర్ల వాటానే 140 పాయింట్లుగా ఉండడం విశేషం. ఒక దశలో 233 పాయింట్లు ఎగసిన సెన్సెక్స్ ఇన్ఫోసిస్ ఫలితాలు ఎలా ఉంటాయోనన్న ఆందోళన, కొన్ని షేర్లలో లాభాల స్వీకరణ కారణంగా నష్టాల్లోకి జారిపోయింది. ఇన్ఫోసిస్ ఫలితాలు బాగా ఉండటంతో మళ్లీ పుంజుకుంది. హిందూస్తాన్ యూనిలివర్, టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూ చిప్‌లు మద్దతుతో 184 పాయింట్లు లాభపడింది. 27,120- 27,508 పాయింట్ల కనిష్ట, గరిష్ట స్థాయిల మధ్య కదలాడిన సెన్సెక్స్ చివరకు 184 పాయింట్లు పెరిగి 27,458 పాయింట్ల వద్ద, నిఫ్టీ 50 పాయింట్లు పెరిగి 8,285 పాయింట్ల వద్ద ముగిశాయి.
ఇన్ఫోసిస్ ఫలితాల ఊపుతో టీసీఎస్, టెక్‌మహీంద్రా, విప్రో, సీఎంసీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కంపెనీల షేర్లు 4 శాతం నుంచి 1 శాతం రేంజ్‌లో పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మిగిలిన మూడు నెలలకు చమురు సబ్సిడీ భారం నుంచి ఓఎన్‌జీసీ, ఆయిల్ ఇండియాలకు మినహాయింపునివ్వాలని ప్రభుత్వం యోచిస్తోందన్న వార్తల కారణంగా ఓఎన్‌జీసీ షేర్ 3 శాతం పెరిగింది. హిందూస్తాన్ యూనిలివర్ 5.8 శాతం లాభపడింది. ఆల్‌టైమ్ హై(868.4)ని తాకిన ఈ షేరు రూ.863.5 వద్ద ముగిసింది.
వివిధ బ్రోకరేజ్ సంస్థల రికమండేషన్లతో ఈ షేర్ ఈ వారంలో 14 శాతం లాభపడింది. 30 షేర్ల సెన్సెక్స్‌లో 16 షేర్లు లాభపడగా, 14 షేర్లు నష్టాలపాలయ్యాయి. ఇన్ఫోసిస్ 5 శాతం, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 3.2 శాతం, టీసీఎస్ 2.8 శాతం, ఓఎన్‌జీసీ 2.7 శాతం, సిప్లా 2.3 శాతం,రిలయన్స్ ఇండస్ట్రీస్ 2 శాతం, టాటా మోటార్స్ 1.88 శాతం,విప్రో 1.5 శాతం, హిందాల్కో 1.5 వాతం, సన్ ఫార్మా 1.4 శాతం, టాటాస్టీల్ 1.2 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 1 శాతం చొప్పున పెరిగాయి.
ఎన్‌టీపీసీ 3.3 శాతం, బజాజ్ ఆటో 1.3 శాతం, యాక్సిస్ బ్యాంక్ 1.32 శాతం,భారతీ ఎయిర్‌టెల్ 1.3 శాతం, భెల్ 1.16 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ 1 శాతం చొప్పున తగ్గాయి. 1,352 షేర్లు లాభపడగా, 1,541 షేర్లు నష్టపోయాయి. బీఎస్‌ఈలో రూ.3,285 కోట్ల టర్నోవర్ నమోదైంది. ఎన్‌ఎస్‌ఈలో టర్నోవర్ నగదు విభాగంలో రూ.19,139 కోట్లు, డెరివేటివ్స్ విభాగంలో రూ.2,57,439 కోట్లుగా ఉంది.
విదేశీ ఇన్వెస్టర్లు రూ.298 కోట్ల నికర అమ్మకాలు, దేశీయ ఇన్వెస్టర్లు రూ.300 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతోందన్న వార్త లు, ముడి చమురు ధరలు నిలకడగా ఉండడంతో ట్రేడింగ్ మొదట్లో ఆసియా మార్కెట్లు లాభాల్లో మొదలయ్యాయి. ఆ తర్వాత మిశ్రమంగా ముగిశాయి. జర్మనీ ఆర్థిక వ్యవస్థ రికవరీ నెమ్మదిగా ఉందని వెల్లడించే గణాంకాల కారణంగా యూరప్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.