స్టాక్స్ వ్యూ | Stocks Overview | Sakshi
Sakshi News home page

స్టాక్స్ వ్యూ

Published Mon, Aug 10 2015 12:59 AM | Last Updated on Sun, Sep 3 2017 7:07 AM

Stocks Overview

ఆర్తి డ్రగ్స్
బ్రోకరేజ్ సంస్థ: ఫస్ట్‌కాల్ రీసెర్చ్
ప్రస్తుత ధర: రూ.668
టార్గెట్ ధర: రూ.790
ఎందుకంటే:
జెనరిక్ బల్క్ యాక్టివ్స్, అడ్వాన్స్‌డ్ ఇంటెర్మీడియేట్స్, స్పెషాల్టీ కెమికల్స్‌ను తయారు చేసి భారత్‌లోనూ, విదేశాల్లోనూ విక్రయిస్తోంది. బ్రెజిల్, మెక్సికో, నెదర్లాండ్స్, స్పెయిన్‌లతో సహా మొత్తం 94 దేశాల్లో తన ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చింది.  ఫైజర్, బేయర్, క్లారియంట్, సనోఫి-అవెంటీస్, మెర్క్, తెవ, సీర్లే తదితర కంపెనీలకు తన ఉత్పత్తులను కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ విధానంలో అందిస్తోంది. కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఓ మోస్తరుగా ఉన్నాయి. నికర అమ్మకాలు 2 శాతం వృద్ధితో రూ.264కోట్లకు పెరిగాయి. రూ.17 కోట్ల నికర లాభం సాధించింది. ఇబిటా 9 శాతం వృద్ధితో రూ.40 కోట్లకు పెరిగింది.

ఫార్మా సెగ్మెంట్లో అత్యంత పటిష్టమైన సెగ్మెంట్లలో ఒకటైన యాంటీ-బయోటిక్ విభాగాన్ని మరింత శక్తివంతం చేస్తోంది. కొత్త ప్రాజెక్ట్‌లు అందుబాటులోకి రానున్నాయి. దీంతో దేశీయ మార్కెట్లో గణనీయమైన రాబడులను సాధించగలమన్న ధీమా కంపెనీ వ్యక్తం చేస్తోంది. ఫార్ములేషన్ విభాగం ఆదాయం పెంచుకోవడానికి ఇటీవలే ఒక అమెరికా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. రెండేళ్లలో నికర అమ్మకాలు 12 శాతం, నికర లాభం 21 శాతం చొప్పున వృద్ధి సాధించగలవని అంచనా వేస్తున్నాం. షేర్ వారీ ఆర్జన(ఈపీఎస్) ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.36గానూ, వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.40గానూ ఉండొచ్చని భావిస్తున్నాం. అలాగే మార్కెట్ ధరకు, పుస్తక ధరకు ఉన్న నిష్పత్తి ఈ ఆర్థిక సంవత్సరంలో 4.6గానూ వచ్చే ఆర్థిక సంవత్సరంలో 4కు తగ్గొచ్చని అంచనా వేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎక్స్‌పోర్ట్ హౌస్ స్టేటస్ లభించింది.

 
ఇమామి
బ్రోకరేజ్ సంస్థ: నొముర
ప్రస్తుత ధర: రూ.1,010
టార్గెట్ ధర: రూ.1,313
ఎందుకంటే:
ఇమామి ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలంలో అంచనాలను మించిన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. దేశీయ వ్యాపారంలో రాబడి జోరుగా పెరిగింది. అమ్మకాలు బాగా ఉండటంతో స్థూల మార్జిన్లు అధికంగా వచ్చాయి. దేశీయ వ్యాపారంలో ఆదాయం 23 శాతం వృద్ధితో రూ.590 కోట్లకు పెరిగాయి. అమ్మకాలు (పరిమాణం పరంగా) 15 శాతం వృద్ధి చెందాయి. నవరత్న ఆయిల్ 17 శాతం, నవరత్న టాల్క్ 12 శాతం, ఫెయిర్ అండ్ హ్యాండ్‌సమ్ 20 శాతం, బోరోప్లస్ 12 శాతం, ఫాస్ట్ రిలీఫ్ 18 శాతం, హెల్త్‌కేర్ డివిజన్ 28 శాతం చొప్పున రాబడులను సాధించాయి. స్థూల మార్జిన్లు 440 బేసిస్ పాయింట్లు పెరిగాయి. దీంతో ఇబిటా మార్జిన్ 130 బేసిస్ పాయింట్లు పెరిగింది.

ఇబిటా 33 శాతం వృద్ధితో రూ.100 కోట్లకు పెరిగింది.  నికర లాభం 24 శాతం వృద్ధితో 87 కోట్లకు ఎగసింది. ప్రకటనల వ్యయాలు బాగా పెరిగాయి. ప్రకటనలు, ప్రమోషన్ల వ్యయాలు 24 శాతానికి వృద్ధి చెందాయి. దాదాపు 8 సంవత్సరాల్లో ఇదే అధిక వ్యయం. ఈ క్వార్టర్‌ల్లో కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తేవడం వల్ల  ఈ స్థాయి వ్యయాలయ్యాయని భావిస్తున్నాం.  కొత్తగా జండు జెల్ బామ్ జూనియర్, ఫెయిర్ అండ్ హ్యాండ్‌సమ్ ఇన్‌స్టంట్ ఫెయిర్‌నెస్ ఫేస్ వాష్, జండూ నిత్యం ట్యాబ్లెట్లను మార్కెట్లోకి తెచ్చింది. సార్క్ రీజియన్‌లో 47 శాతం వృద్ధి కారణంగా అంతర్జాతీయ వ్యాపారం 22 శాతం పెరిగింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement