గత నెలలో ఐపీవోకి వచ్చిన కెమ్‌కాన్ స్పెషాలిటీ కెమికల్స్ స్టాక్ ఎక్స్ఛేంజీలలో బంపర్ లిస్టింగ్‌ను సాధించింది. ఇష్యూ ధర రూ. 340కాగా.. ఎన్ఎస్‌ఈలో ఏకంగా 115 శాతం(రూ. 391) ప్రీమియంతో రూ. 731 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. తదుపరి అమ్మకాలు పెరగడంతో కొంతమేర వెనకడుగు వేసింది. రూ. 610 దిగువన ఇంట్రాడే కనిష్టానికి చేరింది. ప్రస్తుతం రూ. 305 లాభంతో రూ. 645 వద్ద ట్రేడవుతోంది. ఇంతక్రితం హ్యాపీయెస్ట్ మైండ్స్ 111 శాతం ప్రీమియంతో లిస్ట్‌కావడం ద్వారా 2020లో రికార్డ్ సాధించిన సంగతి తెలిసిందే.
149 రెట్లు
సెప్టెంబర్ 21-23 మధ్య ఐపీవో చేపట్టిన కెమ్‌కాన్ స్పెషాలిటీ రూ. 318 కోట్లను సమీకరించింది. ఇష్యూ 149 రెట్లు అధికంగా సబ్‌స్క్రయిబ్ అయ్యింది. తద్వారా ఈ ఏడాది(2020) పబ్లిక్ ఇష్యూకి అత్యధిక స్పందన సాధించిన రెండో కంపెనీగా నిలిచింది. 151 రెట్లు బిడ్స్ సాధించడం ద్వారా హ్యాపియెస్ట్ మైండ్స్ తొలి ర్యాంకును కైవసం చేసుకుంది. ఐపీవోలో భాగంగా యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి కెమ్‌కాన్ స్పెషాలిటీ కెమికల్స్ రూ. 95.4 కోట్లను సమకూర్చుకుంది. షేరుకి రూ. 340 ధరలో 28.06 లక్షల షేర్లను జారీ చేసింది. ఇష్యూ నిధులను తయారీ సామర్థ్య విస్తరణ, వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో కెమ్‌కాన్ పేర్కొంది.
బ్యాక్‌గ్రౌండ్
కెమ్‌కాన్ ప్రధానంగా హెచ్‌ఎండీఎస్, సీఎంఐసీగా పేర్కొనే స్పెషలైజ్‌డ్ కెమికల్స్‌ను రూపొందిస్తోంది. వీటిని ఫార్మాస్యూటికల్ రంగంలో వినియోగిస్తారు. అంతేకాకుండా ఇన్‌ఆర్గానిక్ బ్రోమైడ్స్‌లోనూ ఉపయోగిస్తారు. కాల్షియం, జింక్, సోడియం బ్రోమైడ్స్‌గా పిలిచే వీటిని అత్యధికంగా చమురు క్షేత్రాల పరిశ్రమలో వినియోగిస్తారు. ఆయిల్‌వెల్ కంప్లీషన్ కెమికల్స్‌గా వీటిని సంబోధిస్తారు. ఫ్రాస్ట్ అండ్ సల్లివాన్ నివేదిక ప్రకారం దేశీయంగా హెచ్‌ఎండీఎస్ కెమికల్స్‌ను కెమ్‌కాన్ మాత్రమే తయారు చేస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో మూడో పెద్ద కంపెనీగా నిలుస్తోంది. కెమికల్ ఉత్పత్తులను యూఎస్, ఇటలీ, జర్మనీ, జపాన్, రష్యా తదితర పలు దేశాలకు ఎగుమతి చేస్తోంది. ఫార్మా రంగంలో హెటెరో ల్యాబ్స్, లారస్ ల్యాబ్స్, అరబిందో తదితర పలు కంపెనీలను కస్టమర్లుగా కలిగి ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 262 కోట్ల ఆదాయం, రూ. 70 కోట్ల నిర్వహణ లాభం ఆర్జించింది. నికర లాభం రూ. 49 కోట్లుగా నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment