కెమ్‌కాన్ స్పెషాలిటీ కెమికల్స్ పబ్లిక్ ఇష్యూకి రెండో రోజు మంగళవారానికల్లా దాదాపు 13 రెట్లు అధికంగా బిడ్స్ దాఖలయ్యాయి. సంస్థాగత ఇన్వెస్టర్ల విభాగంలో 1.4 రెట్లు, సంపన్న వర్గాల నుంచి 3.6 రెట్లు అధికంగా స్పందన లభించగా.. రిటైల్ ఇన్వెస్టర్లు 13 రెట్లు అధికంగా దరఖాస్తు చేశారు. నేడు ముగియనున్న ఇష్యూకి రూ. 338-340 ధరల శ్రేణికాగా.. తద్వారా రూ. 318 కోట్లను సమీకరించాలని కంపెనీ యోచిస్తోంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 44 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇష్యూలో భాగంగా 45 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. వీటితోపాటు మరో రూ. 165 కోట్ల విలువచేసే షేర్లను తాజాగా జారీ చేయనుంది.
యాంకర్ నిధులు
ఐపీవోలో భాగంగా యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి కెమ్‌కాన్ స్పెషాలిటీ కెమికల్స్ ఇప్పటికే రూ. 95.4 కోట్లను సమకూర్చుకుంది. షేరుకి రూ. 340 ధరలో 28.06 లక్షల షేర్లను జారీ చేసింది. ఫార్మాస్యూటికల్ కెమికల్స్ తయారీ కంపెనీ.. కెమ్‌కాన్‌లో ఇన్వెస్ట్ చేసిన యాంకర్ సంస్థలలో ఐడీఎఫ్‌సీ ఎమర్జింగ్ బిజినెస్ ఫండ్, డైనమిక్ ఈక్విటీ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ చైల్డ్‌కేర్ ప్లాన్, మిరాయి అసెట్ ఫండ్స్, టాటా మల్టీ అసెట్ అపార్చునిటీస్ ఫండ్ తదితరాలున్నాయి.
ప్రమోటర్ల వాటా విక్రయం
కెమ్‌కాన్ స్పెషాలిటీ కెమికల్స్‌లో ప్రమోటర్లయిన అగర్వాల్, గోయల్ కుంటుంబీకులకు 100 శాతం వాటా ఉంది. ఐపీవోలో భాగంగా కేఆర్ అగర్వాల్, ఎన్‌వీ గోయల్ 22.5 లక్షల షేర్లు చొప్పున విక్రయించనున్నారు. ఇవికాకుండా కంపెనీ రూ. 165 కోట్ల విలువచేసే ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. ఇష్యూ నిధులను తయారీ సామర్థ్య విస్తరణ, వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో కెమ్‌కాన్ పేర్కొంది.
బ్యాక్‌గ్రౌండ్
కెమ్‌కాన్ ప్రధానంగా హెచ్‌ఎండీఎస్, సీఎంఐసీగా పేర్కొనే స్పెషలైజ్‌డ్ కెమికల్స్‌ను రూపొందిస్తోంది. వీటిని ఫార్మాస్యూటికల్ రంగంలో వినియోగిస్తారు. అంతేకాకుండా ఇన్‌ఆర్గానిక్ బ్రోమైడ్స్‌లోనూ ఉపయోగిస్తారు. కాల్షియం, జింక్, సోడియం బ్రోమైడ్స్‌గా పిలిచే వీటిని అత్యధికంగా చమురు క్షేత్రాల పరిశ్రమలో వినియోగిస్తారు. ఆయిల్‌వెల్ కంప్లీషన్ కెమికల్స్‌గా వీటిని సంబోధిస్తారు. ఫ్రాస్ట్ అండ్ సల్లివాన్ నివేదిక ప్రకారం దేశీయంగా హెచ్‌ఎండీఎస్ కెమికల్స్‌ను కెమ్‌కాన్ మాత్రమే తయారు చేస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో మూడో పెద్ద కంపెనీగా నిలుస్తోంది. కెమికల్ ఉత్పత్తులను యూఎస్, ఇటలీ, జర్మనీ, జపాన్, రష్యా తదితర పలు దేశాలకు ఎగుమతి చేస్తోంది. ఫార్మా రంగంలో హెటెరో ల్యాబ్స్, లారస్ ల్యాబ్స్, అరబిందో తదితర పలు కంపెనీలను కస్టమర్లుగా కలిగి ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 262 కోట్ల ఆదాయం, రూ. 70 కోట్ల నిర్వహణ లాభం ఆర్జించింది. నికర లాభం రూ. 49 కోట్లుగా నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment