
స్టాక్స్ వ్యూ
జెట్ ఎయిర్‌వేస్
బ్రోకరేజ్ సంస్థ: ఎడిల్‌వేజ్
ప్రస్తుత ధర: రూ.558 టార్గెట్ ధర: రూ.615
ఎందుకంటే: జెట్ ఎయిర్‌వేస్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. ఆదాయం 4% వృద్ధితో రూ.5,730 కోట్లకు పెరిగింది. ఇంధన వ్యయాలు పెరగడంతో ఇబిటార్(ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్, ట్యాక్స్, డిప్రిసియేషన్, అమోర్టైజేషన్, రిస్ట్రక్చరింగ్ లేదా రెంట్ కాస్టŠస్) మార్జిన్ 13 శాతానికి తగ్గింది. దీంతో నికర లాభం 95 శాతం క్షీణించి రూ.2.3 కోట్లకు పరిమితమైంది. కంపెనీ నికర రుణ భారం రూ.470 కోట్లు తగ్గింది. వ్యయనియంత్రణ కోసం కంపెనీ తీసుకున్న చర్యలు గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో మంచి ఫలితాలనిచ్చాయి. అయితే ఇంధన వ్యయాలు పెరగడం ప్రతికూల ప్రభావం చూపింది.
అంతక్రితం ఏడాది (2015–16) క్యూ4లో 19 శాతంగా ఉన్న ఇంధన వ్యయాలు గత ఆర్థిక సంవత్సరం (2016–17) క్యూ4లో 30 శాతానికి పెరిగాయి. సిబ్బంది వ్యయాలు17% పెరిగాయి. ఫలితంగా 2015–16 క్యూ4లో 27 శాతంగా ఉన్న ఇబిటార్ మార్జిన్ 13%కి తగ్గింది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఆదాయం 2 శాతం పెరగ్గా, ఇబిటా 22 శాతం తగ్గింది. రుణ భారం రూ.1,700 కోట్లు తగ్గింది. మొత్తం కంపెనీ వ్యయాల్లో విమానయాన ఇంధనం వ్యయాలు 43%గా ఉంటాయి.
అయితే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గడం కంపెనీకి ప్రయోజనం కలిగించే అంశం. ముడి చమురు ధరలు తగ్గితే కంపెనీ మార్జిన్లు పెరుగుతాయి. దేశీయ విమానయాన మార్కెట్లో ఈ కంపెనీ వాటా 24%. పదేళ్లలో దేశీయ ఎయిర్‌ట్రాఫిక్ 11 శాతం, అంతర్జాతీయ ప్యాసింజర్ ట్రాఫిక్ 8 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందుతాయని అంచనా వేస్తున్నాం. అంతర్జాతీయ కార్యకలాపాలను మరింతగా పెంచుకోవడంపై దృష్టిపెడుతోంది. లాభదాయకత మెరుగుపడుతుండడడం, ఇంధనేతర వ్యయాలు తగ్గుతుండడం, రుణభారం కూడా దిగివస్తుండడం కంపెనీకి కలసి వచ్చే అంశాలు.
మహీంద్రా అండ్ మహీంద్రా
బ్రోకరేజ్ సంస్థ: కోటక్ సెక్యూరిటీస్
ప్రస్తుత ధర: రూ.1,376 టార్గెట్ ధర: రూ.1,565
ఎందుకంటే: ఈ ఆర్థిక సంవత్సరంలో ట్రాక్టర్ల అమ్మకాలు జోరుగా ఉండొచ్చని, వాహన విక్రయాలు మాత్రంత అంతంతమాత్రంగా ఉండొచ్చని అంచనా వేస్తున్నాం. గత కొన్నేళ్లుగా కంపెనీ యుటిలిటి వెహికల్స్(యూవీ) అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. యూవీ సెగ్మెంట్లో రెండేళ్లలో నాలుగు కొత్త మోడళ్లను, ప్రస్తుతమున్న మోడళ్లలో అప్‌డేట్ వేరియంట్లను అందుబాటులోకి తేనుండడంంతో రానున్న కొన్నేళ్లలో యూవీ అమ్మకాలు పుంజుకునే అవకాశాలున్నాయి. వర్షాలు బాగానే కురుస్తాయన్న అంచనాల కారణంగా ట్రాక్టర్లకు డిమాండ్ పెరుగుతుంది. రైతుల ఆదాయం పెంపుపై కేంద్ర ప్రభుత్వం దృష్టిపెట్టడం, రైతు రుణాల మాఫీ... ట్రాక్టర్ డిమాండ్‌పై సానుకూల ప్రభావం చూపుతాయి.
గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ట్రాక్టర్ల అమ్మకాలు 23 శాతం పెరిగాయి. కంపెనీ మార్కెట్ వాటా 43 శాతానికి ఎగసింది. గత 34 ఏళ్లలో ఇదే అత్యధిక మార్కెట్ వాటా. ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో స్వరాజ్ బ్రాండ్ కింద కొత్త ట్రాక్టర్ మోడళ్లను అందించనున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా అమ్మకాల్లో రెండంకెల వృద్ధి సాధించే అవకాశాలున్నాయి. ఇక జీఎస్టీ అమలు కారణంగా స్కార్పియో, ఎక్స్‌యూవీ500 తదితర పెద్ద ఎస్‌యూవీల ధరలు తగ్గనున్నాయి. ఫలితంగా ఈ వాహనాలకు డిమాండ్ పెరిగే అవకాశాలున్నాయి.
వాణిజ్య వాహనాల విభాగం పనితీరు కూడా మెరుగుపడవచ్చు. చిన్న వాణిజ్య వాహనాల సెగ్మెంట్ అమ్మకాలు గత ఆర్థిక సంవత్సరంలో 8 శాతం పెరిగాయి. ఈ సెగ్మెంట్లో సగం మార్కెట్ వాటా ఈ కంపెనీదే. భారీ వాణిజ్య వాహనాల సెగ్మెంట్లో మరిన్ని కొత్త మోడళ్లను అందుబాటులోకి తేనున్నది. వ్యయ నియంత్రణ పద్ధతులను కొనసాగించడం, అధిక మార్జిన్లు ఉన్న ట్రాక్టర్ల విభాగం డిమాండ్ పుంజుకుంటుండంతో మార్జిన్లు మరింతగా మెరుగుపడే అవకాశాలున్నాయి.