
స్టాక్స్ వ్యూ
సియట్ కొనొచ్చు
బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్
ప్రస్తుత ధర: రూ.1,695 ; టార్గెట్ ధర: రూ.2,029
ఎందుకంటే: ఆర్‌పీజీ గోయంకా గ్రూప్‌కు చెందిన ఈ కంపెనీ... ఆదాయం పరంగా భారత్‌లో నాలుగో అతి పెద్ద టైర్ల కంపెనీ. రోజుకు 95 వేల టైర్ల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ఈ కంపెనీకి దేశవ్యాప్తంగా పటిష్టమైన డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ ఉంది. కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. ఆదాయం అంచనాలకు అనుగుణంగా ఉండగా, నికర లాభం, ఇబిటా అంచనాలను అందుకోలేకపోయాయి. ఆదాయం 1% క్షీణించి రూ.1,628 కోట్లకు తగ్గింది. ముడిపదార్ధాల వ్యయాలు చెప్పుకోదగ్గ స్థాయిలో పెరగడంతో గత క్యూ1లో రూ.185 కోట్లుగా ఉన్న ఇబిటా ఈ క్యూ1లో రూ.55 కోట్లకు తగ్గింది. ఫలితంగా నికర లాభం రూ.104 కోట్ల నుంచి 99% క్షీణించి రూ.కోటికి పడిపోయింది.
సహజ రబ్బరు ధరలు 30%, సింథటిక్ రబ్బర్ ధరలు 50% పెరగడం బాగా ప్రభావం చూపించింది. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2లో ఇప్పటికే సగటు ముడి పదార్ధాల వ్యయాలు 10% తగ్గాయి. ఇవి మరింతగా తగ్గే అవకాశాలున్నాయి. దీంతో మార్జిన్లు పుంజుకుంటాయని భావిస్తున్నాం. పంక్చర్ లెస్, మైలేజీ అధికంగా ఇచ్చే వంటి వినూత్నమైన టైర్లను మార్కెట్లోకి తెస్తుండటంతో ప్రయాణికుల సెగ్మెంట్ టైర్ల అమ్మకాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నాం.
గత ఏడాది సెప్టెంబర్‌లో మార్కెట్లోకి తెచ్చిన ట్రక్, బస్ రేడియల్(టీబీఆర్) టైర్ల సెగ్మెంట్ 70–80 % వృద్ధి సాధించగా, భవిష్యత్తులో మరో 10–15% వృద్ధికి అవకాశాలున్నాయని కంపెనీ అంచనా వేస్తోంది. ముడి పదార్ధాలు ధరలు తగ్గుతుండడం, జీఎస్‌టీ అమలు తర్వాత రికవరీ జరిగే అవకాశాలు, చైనా నుంచి దిగుమతయ్యే టైర్లపై యాంటీ డంపింగ్ సుంకం విధింపు కారణంగా దేశీయ టైర్ల కంపెనీల మార్కెట్ వాటా పెరిగే అవకాశాలు.. ఇవన్నీ సానుకూలాంశాలు. రెండేళ్లలో ఆదాయం 8 శాతం, నికర లాభం 17% చొప్పున చక్రగతిన వృద్ధి చెందే అవకాశాలున్నాయి.
ఫ్యూచర్ రిటైల్ కొనొచ్చు
బ్రోకరేజ్ సంస్థ: యాక్సిస్ డైరెక్ట్
ప్రస్తుత ధర: రూ.443 ; టార్గెట్ ధర: రూ.560
ఎందుకంటే: ఫ్యూచర్ రిటైల్ సంస్థ–బిగ్‌బజార్, ఫుడ్‌హాల్, ఫుడ్ బజార్, ఈజీ డే ఫార్మాట్ స్టోర్స్‌ను, ఎఫ్‌బీబీ, హోమ్ టౌన్(హోమ్ అండ్ ఫర్నిషింగ్స్), ఈజోన్(ఎలక్ట్రానిక్స్ రిటైల్) స్టోర్స్‌ను నిర్వహిస్తోంది. 2005–10 కాలంలో భారీగా విస్తరించడం, సంబంధం లేని వ్యాపారాల్లోకి ప్రవేశించిండం వంటి కారణాల వల్ల కంపెనీ రుణ భారం పెరిగిపోయింది. 2011–12 ఏడాది నుంచి పునర్వ్యస్థీకరణ చేపట్టింది. పాంటలూన్స్ సంస్థను విక్రయించింది. బిగ్‌బజార్ స్టోర్స్‌ను పునర్వ్యస్థీకరించింది.
వీటన్నింటి ఫలితంగా ఆరోగ్యకరమైన ఆర్థిక స్థితిగతులతో.. భారత్‌లో అగ్రస్థాయి మల్టీ ఫార్మాట్ రిటైలర్ కంపెనీగా అవతరించింది. చౌక ధరల్లో ఉత్పత్తులందించే రిటైల్ చెయిన్‌గా 2001లో ప్రారంభమైన బిగ్‌బజార్‌ను పూర్తి స్థాయి వెరైటీ డిపార్టమెంటల్ స్టోర్‌గా పునర్వ్యస్థీకరించింది. యువతను ఆకర్షించేందుకు బిగ్‌బజార్ జెన్ నెక్స్‌ట్ పేరుతో కొత్త స్టోర్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఫ్యాషన్ బిగ్ బజార్(ఎఫ్‌బీబీ)ను కూడా మారుతున్న ఫ్యాషన్ ట్రెండ్స్‌కు అనుగుణంగా మార్పుచేర్పులు చేసింది. ఈజీ డే, హెరిటేజ్ రిటైల్ స్టోర్స్‌ను కొనుగోలు చేసి, స్మాల్ ఫార్మాట్ స్టోర్ నెట్‌వర్క్‌ను మరింత పటిష్టం చేసుకుంది.
స్వంత బ్రాండ్ కొర్యొ ఉత్పత్తుల విక్రయాల పెంపుపై దృష్టి సారిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,100 కోట్లుగా ఉన్న నికర రుణ భారం వచ్చే ఏడాది కల్లా పూర్తిగా తగ్గిపోగలదన్న అంచనాలున్నాయి. పాంటలూన్స్‌లో మెజారిటీ వాటాను విక్రయించడం, క్యాపిటల్ ఫస్ట్‌లో పూర్తి వాటాను అమ్మేయడం, జెనరాలి సంస్థతో ఏర్పాటు చేసిన రెండు బీమా జేవీల్లో వాటాలను కూడా విక్రయించి రుణభారాన్ని తగ్గించుకుంది. హోమ్, ఫర్నిషింగ్స్ విభాగం హోమ్ టౌన్‌ను డీమెర్జ్ చేయాలని యోచిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో 3.4 శాతంగా ఉన్న ఆపరేటింగ్ మార్జిన్ 2021–22 ఆర్థిక సంవత్సరానికి 5.5 శాతానికి పెరగగలదని అంచనా వేస్తున్నాం.