హిందుస్తాన్ యూనిలీవర్ కొనొచ్చు
బ్రోకరేజ్ సంస్థ: మోతీలాల్ ఓస్వాల్
ప్రస్తుత ధర: రూ. రూ.1,240 టార్గెట్ ధర: రూ. 1400
ఎందుకంటే: జీఎస్‌టీ(గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్) ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే రికవరీ అవుతున్నామని, అయితే పూర్తి ప్రతికూల ప్రభావం ఇంకా తొలగిపోలేదని యాజమాన్యం భావిస్తోంది. దక్షిణాది, పశ్చిమ భారత ప్రాంతాల్లో హోల్‌సేల్ అమ్మకాలు సాధారణ స్థాయికి వచ్చాయని, ఇతర ప్రాంతాల్లో అమ్మకాలు పుంజుకోలేదని పేర్కొంది. కంపెనీ డిస్ట్రిబ్యూటర్లలో అధిక భాగం జీఎస్‌టీ విధానానికి ఇప్పడిప్పుడే అలవాటు పడుతున్నారు. జీఎస్‌టీకి అనుగుణంగా పూర్తిస్థాయిలో మారడానికి కనీసం మరో నెల రోజుల సమయం పట్టవచ్చు.
మొత్తం మీద జీఎస్‌టీ కారణంగా వ్యవస్థీకృత రంగంలోని ఈ తరహా పెద్ద కంపెనీలకు ప్రయోజనకరమే. జీఎస్‌టీ పూర్తి ప్రభావం ఈ ఏడాది రెండో క్వార్టర్‌లో కనిపించవచ్చు. జీఎస్‌టీ ప్రయోజనాల బదిలీతో టర్నోవర్ ఒకింత తగ్గవచ్చు. జీఎస్‌టీ అకౌంటింగ్ కారణంగా మార్జిన్లు పెరిగే అవకాశాలు అధికం. వస్తువుల ధరల్లో చెప్పుకోదగ్గ స్థాయి మార్పులు, చేర్పులు లేవు. గత మూడేళ్లలో నికర లాభం 6%, గత ఐదేళ్లలో 11%, గత పదేళ్లలో 11% చొప్పున చక్రగతిన వృద్ది చెందగా, రానున్న రెండేళ్లలో నికర లాభం 18% చొప్పున చక్రగతిన వృద్ధి చెందవచ్చు.
వేదాంత లిమిటెడ్ కొనొచ్చు
బ్రోకరేజ్ సంస్థ: ఎడెల్‌వీజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్
ప్రస్తుత ధర: రూ. రూ.308 టార్గెట్ ధర: రూ. 362
ఎందుకంటే: లండన్‌లో లిస్టైన వేదాంత రిసోర్సెస్‌కు భారత్‌లో అనుబంధ కంపెనీ ఇది. ఇనుము కాకుండా ఇతర లోహాలకు సంబంధించి భారత్‌లో అతి పెద్ద కంపెనీ ఇదే. ఆయిల్, గ్యాస్, జింక్, లెడ్, సిల్వర్, రాగి, ఖనిజాల సంబంధిత ఉత్పత్తితో పాటు విద్యుదుత్పత్తి కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఈ కంపెనీకి హిందుస్తాన్ జింక్‌లో 64.9 శాతం, చమురు రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కెయిర్న్ ఇండియాలో 38.8 శాతం చొప్పున వాటాలున్నాయి.
ఒడిశాలోని జర్సుగూడలోని వేదాంత కంపెనీకి చెందిన మూడు విద్యుత్‌ప్లాంట్లపై నిషేధాన్ని ఒడిశా స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తొలగించింది. ఈ ప్లాంట్లపై నిషేధం తొలగడంతో ఉత్పత్తి కార్యకలాపాల కోసం అదనంగా విద్యుత్తును కొనుగోలు చేయాల్సిన భారం వేదాంత కంపెనీకి తప్పింది. మంచి నాణ్యత గల జింక్ గనుల కారణంగా ప్రపంచంలోనే అతి తక్కువ వ్యయాలతో జింక్‌ను ఉత్పత్తి చేసే కంపెనీల్లో ఒకటిగా నిలిచింది. కెయిర్న్ చమురు అన్వేషణ విజయవంతం, బాల్కో, హిందుస్తాన్ జింక్‌ల్లో మిగిలిన ప్రభుత్వ వాటాను కొనుగోలు చేసే అవకాశం, బాక్సైట్, డోలమైట్ మైనింగ్ లైసెన్స్‌ల పొందడం... ఇవన్నీ భవిష్యత్తులో షేర్ ధరను పెంచే ట్రిగ్గర్లు కానున్నాయి.