ఫెడరల్ బ్యాంక్ - కొనొచ్చు
బ్రోకరేజ్ సంస్థ: ఎడెల్‌వీజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్
ప్రస్తుత ధర: రూ.103
టార్గెట్ ధర: రూ.152
ఎందుకంటే: ఈ మిడ్‌సైజ్ ప్రైవేట్ రంగ బ్యాంక్ కేరళ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాలు, ఢీల్లీ, ఎన్‌సీఆర్‌లతో పాటు 4 కేంద్ర పాలిత రాష్ట్రాల్లో సేవలందిస్తోంది. ఐడీబీఐతో కలిసి జాయింట్‌వెంచర్‌గా బీమా, ఎన్‌బీఎఫ్‌సీ వ్యాపారాలను కూడా నిర్వహిస్తోంది. 1,252 బ్రాంచ్‌లు, 1,679 ఏటీఎమ్‌లతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. ఎస్‌ఎంఈ, రిటైల్ రుణాలకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది.
బ్యాంక్ రుణాల్లో ఎస్‌ఎంఈ రుణాలు 22 శాతంగా, రిటైల్ రుణాలు 38 శాతంగా ఉన్నాయి. ఈ క్యూ3లో రుణాలు 22 శాతం వృద్ధి చెందాయి. నికర వడ్డీ ఆదాయం 20 శాతం పెరిగింది. నికర వడ్డీ మార్జిన్(ఎన్‌ఐఎమ్) 3.3 శాతంగా ఉంది. నిర్వహణ లాభం 35 శాతానికి ఎగసింది. ఈ జోరు కొనసాగుతుందని బ్యాంక్ అంచనా వేస్తోంది. 18 నెలల కాలంలో 50 కొత్త బ్రాంచ్‌లను ఏర్పాటు చేయాలనుకుంటోంది.
టైర్–1 మూలధనం 13.8 శాతంగా ఉండడం, స్థూల నికరర్థ రుణాలు, రీస్ట్రక్చరింగ్, తదితర రుణాలన్నీ 5 శాతంలోపే ఉండటం, డిజిటల్ బ్యాంకింగ్ జోరు పెంచుకోవడానికి తీసుకున్న చర్యల ఫలాలు భవిష్యత్తులో అందనుండటం, సానూకూల అంశాలు. 2019–20 కల్లా రిటర్న్ ఆన్ అసెట్(ఆర్‌ఓఏ) 1 శాతంగానూ, ఆర్‌ఓఈ(రిటర్న్ ఆన్ ఈక్విటీ) 12.3 శాతానికి పెరుగుతాయని అంచనా వేస్తున్నాం. రెండేళ్లలో ఆదాయం 27 శాతం, ఆర్‌ఈఓ 12 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందుతాయని భావిస్తున్నాం. ఈ బ్యాంక్ డిపాజిట్లు అధికంగా ప్రవాస భారతీయుల నుంచే వస్తున్నాయి. బ్యాంక్ మొత్తం డిపాజిట్లలో ఎన్నారైల వాటా 48 శాతంగా ఉంది.
హిందుస్తాన్ యూనిలీవర్ - కొనొచ్చు
బ్రోకరేజ్ సంస్థ: రిలయన్స్ సెక్యూరిటీస్
ప్రస్తుత ధర: రూ.1,363
టార్గెట్ ధర: రూ.1,514
ఎందుకంటే: ఈ ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. గత క్యూ3లో పెద్ద కరెన్సీ నోట్ల రద్దు కారణంగా అమ్మకాలు తక్కువగా ఉండడం వల్ల వృద్ధి కాస్త మందగించింది. ఈ లో–బేస్ ఎఫెక్ట్‌కు పెరుగుతున్న వృద్ధి జోరు జత కావడంతో ఈ క్యూ3లో మంచి ఫలితాలను ఈ కంపెనీ సాధించింది. నికర అమ్మకాలు రూ.8,320 కోట్లకు, ఇబిటా 24% వృద్ధితో రూ.1,680 కోట్లకు పెరిగాయి. అనుబంధ కంపెనీ నుంచి వచ్చిన డివిడెండ్ కారణంగా ఇతర ఆదాయం రూ.150 కోట్లు పెరిగి, నికర లాభం 83% ఎగసింది.
హోమ్‌కేర్ సెగ్మెంట్ 20 శాతం, పర్సనల్ కేర్ సెగ్మెంట్ 17% చొప్పున వృద్ధి చెందాయి. పెద్ద కరెన్సీ నోట్ల రద్దు, జీఎస్‌టీ అమలు కారణంగా ఏర్పడిన అస్తవ్యస్త పరిస్థితులు ఇప్పుడిప్పుడే తొలగిపోయి డిమాండ్ పుంజుకుంటుండటంతో పరిస్థితులు మెరుగుపడుతున్నాయని కంపెనీ భావిస్తోంది. ఉత్పత్తి వ్యయాలు తక్కువగా ఉండటంతో స్థూల మార్జిన్‌లు 3 శాతం పెరిగి 53.1 శాతానికి చేరాయి. జీఎస్‌టీ సంబంధిత సమస్యలు సమసిపోతుండటంతో రానున్న క్వార్టర్లలో వృద్ధి జోరుగా పెరగగలదని భావిస్తున్నాం.
కంపెనీ ఆదాయంలో దాదాపు 40% వరకూ గ్రామీణ ప్రాంతాల నుంచే వస్తోంది. గత రెండేళ్లుగా వర్షాలు విస్తారంగా కురియడం, కీలక పంటల మద్దతు ధరలు పెరగడం, విస్తృతమైన డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ కారణంగా గ్రామీణ మార్కెట్ల నుంచి డిమాండ్ బాగా వృద్ధి చెందగలదని భావిస్తున్నాం. ఆయుర్వేద విభాగంలో మరింతగా విస్తరిస్తోంది. ప్రీమియమ్ ఉత్పత్తుల జోరు పెంచుతోంది. ఫలితంగా రెండేళ్లలో ఆదాయం 12%, నికర లాభం 18% చొప్పున చక్రగతిన వృద్ధి చెందనున్నాయని అంచనా వేస్తున్నాం.
Comments
Please login to add a commentAdd a comment