
రూ. 2 వేల కోట్లు కట్టండి..
జేపీ అసోసియేట్స్‌కు సుప్రీం కోర్టు ఆదేశం
► జేపీ ఇన్‌ఫ్రా గృహ కొనుగోలుదారులకు అండ...
► ఐఆర్‌పీకి సంస్థ యాజమాన్య బాధ్యతలు
► కంపెనీ డైరెక్టర్లు విదేశాలకు వెళ్లకుండా నిషేధం
► దివాలా ప్రక్రియపై సమగ్ర సమీక్ష
న్యూఢిల్లీ: గృహ కొనుగోలుదారు ప్రయోజనాలే లక్ష్యంగా రియల్టీ దిగ్గజం– జేపీ ఇన్‌ఫ్రాటెక్ దివాలా ప్రక్రియను అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సమీక్షించటం మొదలుపెట్టింది. ఇందులో భాగంగా సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. జేపీ ఇన్‌ఫ్రా నిర్వహణ నియంత్రణను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ నియమించిన ఇంటిర్మ్ రిజల్యూషన్ ప్రొఫెషనల్‌కు (ఐఆర్‌పీ) అప్పగిస్తూ... తక్షణం ఇది అమల్లోకి వస్తుందని స్పష్టంచేసింది. ఇతర ముఖ్య ఆదేశాలు చూస్తే...
⇒ దాదాపు 32,000కుపైగా గృహ కొనుగోలుదారులు.. రుణ దాతలు వారివారి డబ్బు ఎలా తిరిగి పొందాలనేందుకు సమగ్ర ప్రణాళికను రూపొందించడానికి వీలుగా జేపీ ఇన్‌ఫ్రాటెక్ తన రికార్డులన్నీ ఐఆర్‌పీకి అప్పగించాలి.
⇒ ఐఆర్‌పీ ప్రొసీడింగ్స్‌పై సూచనలు, సలహాల కోసం సలహాదారుగా (అమికస్ క్యూరీ) సీనియర్ అడ్వకేట్ శంకర్ నాప్తాడేను సుప్రీం నియమించింది.
⇒ కోర్టు అనుమతి లేకుండా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కానీ లేదా డైరెక్టర్‌కానీ విదేశాలకు వెళ్లకూడదు.
⇒ దివాలా ప్రొసీడింగ్స్ ప్రారంభమైనప్పుడు డైరెక్టర్లు సహా జేపీ ఇన్‌ఫ్రా వ్యవహారాలతో సంబంధమున్న ఎవ్వరూ విదేశాలు వెళ్లకూడదు. అయితే కంపెనీకి రుణ దాతలుగా ఉన్న ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, ఐడీబీఐ ప్రతినిధులకు మాత్రం ఈ ఆదేశాల నుంచి మినహాయింపు ఉంటుంది.
⇒ గృహ కొనుగోలుదారుల ప్రయోజనాలే లక్ష్యంగా జేపీ ఇన్‌ఫ్రాటెక్ మాతృ సంస్థ జేపీ అసోసియేట్స్ తక్షణం రిజిస్ట్రీ వద్ద రూ.2,000 కోట్లు డిపాజిట్ చేయాలి.
⇒ రూ.2,000 కోట్లు ఎలా సమకూర్చుకోవాలన్న అంశాన్ని కూడా జేపీ అసోసియేట్స్‌కు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్వేల్కర్, డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సూచించింది. భూములు లేదా ఆస్తులు విక్రయించి అక్టోబర్ 27వ తేదీ నాటికి కోర్టు రిజిస్ట్రీ వద్ద డబ్బు డిపాజిట్ చేయాలని స్పష్టం చేసింది.
⇒ కంపెనీ నిర్వహణను ఐఆర్‌పీకి అప్పగించినందువల్ల ఇకపై వినియోగదారుల కమిషన్ వంటి ఇతర ఎటువంటి న్యాయ వేదికపైనా ఏ ప్రయోజనం కోసమూ జేపీ ఇన్‌ఫ్రా టెక్‌పై ఇతర ప్రొసీడింగ్స్ జరపకుండా స్టే ఉత్తర్వులు మంజూరు చేసింది.
⇒ కేసు తదుపరి విచారణను నవంబర్ 13వ తేదీకి వాయిదా వేసింది.
జేపీ షేర్ల భారీ పతనం...
సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో జైప్రకాశ్ అసోసియేట్స్, జేపీ ఇన్‌ఫ్రాటెక్ షేర్లు మంగళవారం భారీ పతనాన్ని నమోదుచేసుకున్నాయి. జైప్రకాశ్ అసోసియేట్స్ షేర్ నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజ్– నిఫ్టీలో 6.4 శాతం (రూ.1.50) పతనమై, 21.85కు తగ్గింది. ఒక దశలో 21.05 ధరను సైతం చూసింది. ఇక జేసీ ఇన్‌ఫ్రాటెక్ షేర్ 4.78 శాతం తగ్గి, (రూ.0.80) 15.95కు పడింది.
మా ఆందోళనంతా వారి గురించే...
కంపెనీ ప్రయోజనాల గురించి మేము ఆందోళన చెందడంలేదు. మా ఆందోళన అంతా... గృహ కొనుగోలుదారుల గురించే. వారిలో చాలామంది దిగువ, మధ్య తరగతికి చెందిన వారు ఉన్నారు. వారి ప్రయోజనాలను పరిరక్షించడం అవసరం. ఇది మా బాధ్యత. వారికి ఫ్లాట్ అయినా దక్కాలి లేదా వారు కట్టిన డబ్బైనా వెనక్కు రావాలి. – చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం
దివాలా ప్రొసీడింగ్స్ సరికాదు...
గృహ కొనుగోలుదారుల ప్రయోజనాలు పక్కనబెట్టి కంపెనీపై దివాలా చర్యలు సరికాదు. – కేసు విచారణలో సుప్రీంకు సహకరిస్తున్న అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్
హోమ్ బయ్యర్స్‌కు పెద్దపీట...
గృహ కొనుగోలుదారుల ప్రయోజనాల పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం. కాగా జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ను ఇతర కష్ట కంపెనీలతో పోల్చుతూ కఠిన చర్యలు తీసుకోవడం సరికాదు. ఎందుకంటే, కంపెనీకి ఉన్న రుణం రూ. 9,000 కోట్లు. ఆస్తుల విలువ రూ.17,000 కోట్లు. కనీ సం అంటే రూ.15,000 కోట్లయినా పలుకుతాయి. – జేపీ ఇన్‌ఫ్రా అడ్వకేట్ పీఎస్ పట్వాలియా