ప్రభుత్వానికి సుప్రీం ఆదేశం
* చట్ట ఉలంఘనలు జరుగుతున్నాయని
* పిటిషనర్ ఆరోపణ
న్యూఢిల్లీ: హిందుస్తాన్ జింక్‌లో ప్రభుత్వంవద్ద మిగిలి ఉన్న వాటాలను విక్రయించవద్దని (డిజిన్వెస్ట్‌మెంట్) అత్యున్నత న్యాయస్థానం మంగళవారం ఆదేశించింది. ఈ సంస్థలో మెజారిటీ వాటాను (64.92 శాతం) వేదాంతాకు ప్రభుత్వం 14యేళ్ల క్రితం విక్రయించింది. వేదాంతా అనుంబంధ సంస్థ స్టెరిలైట్ వేదాంత యాజమాన్య నియంత్రణలో ప్రస్తుతం హిందుస్తాన్ జింక్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. తాజా సుప్రీం ఆదేశంతో వ్యూహాత్మక ఖనిజాలతో ముడివడిఉన్న కంపెనీలో విలువైన 29.54 శాతం వాటాల విక్రయానికి బ్రేక్ పడినట్లయ్యింది.
ఈ వాటాలకు సంబంధించి యథాతథ పరిస్థితిని కొనసాగించాలని చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్‌నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సంబంధిత పక్షాలను ఆదేశించింది.
పిటిషన్ దాఖలు కారణం..
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల అధికారుల సంఘాల జాతీయ సమాఖ్య ఈ పిటిషన్ దాఖలు చేసింది. తొలి దఫా పెట్టుబడుల ఉపసంహరణల సమయంలోనే చట్ట సంబంధ ఉల్లంఘనలు జరిగాయని సమాఖ్య తరఫున సీనియర్ అడ్వకేట్ ప్రశాంత్ భూషన్ తన వాదనలు వినిపించారు. ప్రభుత్వ రంగ సంస్థలో పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి గతంలో ఒక ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన రూలింగ్‌లో చట్ట ఉల్లంఘనల విషయం స్పష్టమైనట్లు వివరించారు. దీనిని పరిగణలోకి తీసుకున్న త్రిసభ్య ధర్మాససం, ‘సంబంధిత చట్ట సవరణలు చేయనిదే తిరిగి తాజా వాటాలను ఎలా విక్రయిస్తారు’ అని అటార్నీ జనరల్‌ను ప్రశ్నించింది.
వేదాంతాకు విలువైన ఆస్తులు అప్పగించాల్సిన అవసరం ఏమి వచ్చిందని ఈ సందర్భంగా అటార్నీ జనరల్ ముకుల్ రోతాంగీని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం... విచారణ పూర్తయ్యే వరకూ ఎటువంటి తదుపరి వాటాల విక్రయం జరగరాదని స్పష్టం చేసింది.
తొందరలేదు: ప్రభుత్వం
కాగా ప్రస్తుత వాటాల విక్రయంపై తొందరలేదని గనుల వ్యవహారాల కార్యదర్శి బల్విందర్ కుమార్ తెలిపారు. ఇందుకు న్యాయ, మార్కెట్ ఒడిదుడుకుల కారణాలను తెలిపారు.
హిందుస్తాన్ జింక్ వాటా విక్రయం వద్దు
Published Wed, Jan 20 2016 2:33 AM | Last Updated on Sun, Sep 3 2017 3:55 PM
Advertisement