వీసా ఫీజులపై వివక్ష వద్దు..
• అమెరికాకు భారత్ స్పష్టీకరణ...
• వాణిజ్యం, ప్రజా రవాణాపై ప్రభావం పడకూడదు
• టోటలైజేషన్ ఒప్పందంపైనా సత్వర నిర్ణయం తీసుకోవాలి
న్యూఢిల్లీ: హెచ్1బీ, ఎల్1 వీసాలపై భారీగా ఫీజుల పెంపు వంటి అంశాలు ఇరు దేశాల మధ్య ప్రజా సంబంధాలు, ద్వైపాక్షిక వాణిజ్యంపై ప్రభావం చూపకుండా ఉండాలంటే ఈ విషయంలో వివక్షకు తావు లేని నిర్ణయం తీసుకోవాలని అమెరికాకు కేంద్రం స్పష్టం చేసింది. సామాజిక భద్రతా (టోటలైజేషన్) ఒప్పందంపై కూడా త్వరగా తుది నిర్ణయానికి రావాలని కోరింది. మంగళవారం ఢిల్లీలో అమెరికా-భారత్‌ల మధ్య జరిగిన రెండో వ్యూహాత్మక, వాణిజ్య చర్చల సమావేశంలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, సుష్మాస్వరాజ్‌లు భారత వాణిని బలంగా వినిపించారు.
భారత్‌కు విదేశీ నిధులు అవసరం: జైట్లీ
భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని అమెరికా సీఈవోలను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఆహ్వానించారు. జీఎస్టీతోపాటు ప్రభుత్వం గత రెండేళ్ల కాలంలో చేపట్టిన నిర్మాణాత్మక సంస్కరణలు వృద్ధికి ఊతం ఇస్తాయన్నారు. భారత పర్యటనలో ఉన్న అమెరికా సీఈవోలతో జైట్లీ మంగళవారం ఢిల్లీలో సమావేశం అయ్యారు. మౌలిక రంగంలో భారీగా పెట్టుబడుల అవసరాల దృష్ట్యా భారత్‌కు విదేశీ నిధులు చాలా అవసరమని వారికి జైట్లీ వివరించారు. జైట్లీని కలసిన అమెరికా వ్యాపార ప్రముఖుల్లో అమెరికన్ టవర్ కార్పొరేషన్ సీఈవో జిమ్ టైక్లెట్, క్వాల్‌కామ్ చైర్మన్ పౌల్ ఈ జాకబ్స్‌తోపాటు యూఎస్‌ఐబీసీ ప్రెసిడెంట్ ముకేశ్ అగ్ని తదితరులు ఉన్నారు.
అమెరికా భాగస్వామ్యం తప్పనిసరి: సుష్మాస్వరాజ్
‘సామాజిక భద్రతా ఒప్పందం, హెచ్1బీ, ఎల్1 వీసాలపై ఫీజుల పెంపు అంశాలు రెండు దేశాల ప్రజల రాకపోకలపై ప్రభావం చూపుతాయి. రెండు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి ఈ అంశాలు కీలకం. వీటిపై వివక్ష చూపకుండా ఓ నిర్ణయం తీసుకోవాలి’ అని సుష్మాస్వరాజ్ చెప్పారు.
పెట్టుబడులు పెట్టాలి: నిర్మలా సీతారామన్
భారత్‌ను తయారీ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని.. అమెరికన్లు పెట్టుబడులు పెట్టాలని భారత్-యూఎస్ సీఈవోల ఫోరం వేదికగా నిర్మలా సీతారామన్ కోరారు. ఈ కార్యక్రమంలో అమెరికా వాణిజ్య మంత్రి ప్రిట్జ్‌కెర్‌తోపాటు ప్రముఖ పారిశ్రామిక వేత్తలు సైతం పాల్గొన్నారు.