హెచ్1బీపై చర్చ
అమెరికా వాణిజ్య మంత్రి వద్ద ప్రస్తావించిన జైట్లీ
వాషింగ్టన్: భారత ఐటీ రంగానికి షాకిచ్చిన హెచ్1బీ వీసా అంశాన్ని అమెరికా వాణిజ్య మంత్రి విల్బర్ రోస్ వద్ద ఆర్థిక మంత్రి జైట్లీ ప్రస్తావించారు. వీసాల అంశానికి సంబంధించి భారతీయుల ఆందోళనల గురించి అమెరికా దృష్టికి తీసుకెళ్లారు. అమెరికా అర్థిక వ్యవస్థ దూసుకెళ్లడానికి భారత నిఫుణులు చేసిన సేవలు ఎంతగానో ఉపయోగపడ్డాయని జైట్లీ గుర్తుచేశారు. ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత రెండు దేశాల మ«ధ్య కేబినెట్ స్థాయి చర్చల కోసం జైట్లీ అమెరికాలో పర్యటిస్తున్నారు.
ఈ సందర్భంగా అమెరికా వాణిజ్య మంత్రిని జైట్లీ కలిశారు. అమెరికా అభివృద్ధికి భారత నిపుణులు ఎంతగానో తోడ్పాటును అందించారని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని అమెరికా అధికార యంత్రాంగం తదుపరి నిర్ణయాలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దీనిపై రోజ్ స్పందిస్తూ.. హెచ్1బీ వీసాల విధానంపై సమీక్ష ప్రక్రియ మొదలైందని, వీటిపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. చర్చల సందర్భంగా దేశంలో చేపట్టిన ఆర్థిక సంస్కరణలపై రోస్‌కు జైట్లీ వివరించారు.