కరోనా కారణంగా వచ్చిన లాక్‌డౌన్‌తో తాగుబోతులకు తిప్పలు పెరిగాయి. గతంలో లాగా విచ్చలవిడిగా కొని, తాగి తూలే అవకాశం లేకపోవడంతో డ్రింకర్ బాబులంతా డీలా పడ్డారు. కొన్ని రోజుల క్రితం కొన్ని రాష్ట్రాలు లిక్కర్ అమ్మకాలు షురూ చేయడంతో కరువుబట్టినట్లు మందుబాబులంతా వైన్స్ ముందు క్యూలు కట్టారు. అయితే ఈ అమ్మకాలకు సవాలక్ష పరిమితులుండడం వీళ్లని పాపం బాగా నిరాశ పరిచింది. ఇలాంటి మందుమాలోకాలకు ఆన్‌లైన్ డెలివరీ దిగ్గజం స్విగ్గీ శుభవార్త వినిపించింది. ఇప్పటివరకు ఫుడ్, గ్రాసరీ, మెడిసన్స్ మాత్రమే ఆన్‌లైన్‌లో డెలివరీ చేసిన స్విగ్గీ ఇకపై ఆల్కహాల్ డ్రింక్స్‌ను సరఫరా చేసేందుకు సిద్ధమైంది. తమ యాప్‌లో తాజాగా ‘‘వైన్‌షాప్’’ కేటగిరీని చేర్చింది.
ఈ వార్త వినగానే హడావుడిగా స్విగ్గీయాప్ ఓపెన్ చేసి మందు బుక్ చేయాలని కంగారు పడకండి...
ప్రస్తుతానికి ఇది ఝార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీ నగరానికే పరిమితం. త్వరలో ఈ రాష్ట్రంలోని ఇతర నగరాల్లో కూడా ఈ సర్వీసును అందిస్తామని స్విగ్గీ తెలిపింది. అంతేకాదండోయ్! ఆన్‌లైన్ లిక్కర్ డెలివరీ కోసం ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలతో కూడా చర్చలు జరుపుతున్నామని, వీలును బట్టి ఇతర రాష్ట్రాల్లో ఈ సేవలారంభిస్తామని ప్రకటించింది.
ఆషామాషీ కాదు...
ఆన్‌లైన్ లిక్కర్ డెలివరీ అనగానే ఠక్కున యాప్ ఓపెన్ చేసి బుక్ చేసుకోవడం కాదని స్విగ్గీ తెలిపింది. ముందుగా కస్టమర్ తన వయసును ధృవీకరించుకోవాలి. ఇందుకోసం ప్రభుత్వం జారీ చేసిన ఐడీని, ఒక సెల్ఫీని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అనంతరం రిజిస్టర్ మొబైల్ నెంబరుకు ఓటీపీ వస్తుంది. దీన్ని డెలివరీ సమయంలో చెప్పాల్సిఉంటుంది. అంతేకాకుండా ఝార్ఖండ్ ప్రభుత్వ నియమాల ప్రకారం ఒక్కో కస్టమర్ చేసుకునే లిక్కర్ బుకింగ్‌కు పరిమితి ఉంటుంది. ఆన్‌లైన్ డెలివరీ ద్వారా వైన్స్ వద్ద గుంపులుకూడకుండా సాయం చేస్తున్నామని స్విగ్గీ ప్రతినిధి చెప్పుకున్నారు. తమ డెలివరీ పార్టనర్స్‌కు శుభ్రత, సురక్షిత విధానాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment