సాక్షి, ముంబై: కోవిడ్-19 సంక్షోభం అన్ని వ్యాపార సంస్థలను ఘోరంగా దెబ్బతీసింది. ఫలితంగా కార్పొరేట్ దిగ్గజాలు కూడా తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. దేశవ్యాప్త సుదీర్ఘ లాక్‌డౌన్ కారణంగా డిమాండ్ పతనమై, కుదేలైన ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీ స్విగ్గీ ఉద్యోగులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. ఖర్చులను తగ్గించడానికి, రాబోయే కొద్ది రోజుల్లో 1100మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు స్విగ్గీ సోమవారం (మే 18) ప్రకటించింది. అనూహ్య రీతిలో ఉద్యోగులను తొలగించాల్సి రావడం తమకు (స్విగ్గీకి) విచారకరమైన రోజుల్లో ఒకటి అని స్విగ్గీ సహ వ్యవస్థాపకుడు,సీఈవో శ్రీహర్ష మాజేటి వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన తమ ఉద్యోగులకు ఈ మెయిల్ సమాచారాన్ని అందించారు. ప్రభావిత ఉద్యోగులందరికీ వారి నోటీసు వ్యవధి లేదా పదవీకాలంతో సంబంధం లేకుండా కనీసం మూడు నెలల జీతం అందుతుందని వర్చువల్ టౌన్ హాల్ సమావేశంలో ఉద్యోగులకు చెప్పారు. ప్రతి సంవత్సరానికి ఒక నెల అదనంగా జీతం ఇస్తామని, పదవీకాలాన్ని బట్టి 3-8 నెలల జీతాన్ని అందిస్తామని చెప్పారు. సంబంధిత ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులతోపాటు, అదనంగా వారి తల్లిదండ్రులకు కూడా వైద్య బీమా సదుపాయం డిసెంబర్ 31, 2020 వరకు అందుబాటులో వుంటుందనీ వెల్లడించారు.
కరోనాకు సంబంధించి అతిపెద్ద ప్రభావం క్లౌడ్ కిచెన్స్ వ్యాపారంపై పడిందని స్విగ్గీ సీఈవో చెప్పారు. ఇది ఇంకా చాలా అస్థిరంగా ఉండనున్న నేపథ్యంలో రాబోయే 18 నెలల పాటు మూసివేయనున్నట్లు తెలిపారు. ఎంతకాలం ఈ అనిశ్చితి కొనసాగుతుందో ఎవ్వరికీ తెలియదని, దీని ప్రభావం స్విగ్గీపై అయితే తక్కువ కాలం ఉంటుందని ఆశిస్తున్నట్లు ఉద్యోగులకు పంపిన ఈ మెయిల్ లో పేర్కొన్నారు. కరోనా కల్లోలం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటికే తమ కిచెన్ ఫెసిలీటీస్‌ను తాత్కాలికంగా లేదా శాశ్వతంగా మూసివేసే ప్రక్రియను ప్రారంభించామని, రాబోయే రోజుల్లో ఉండే వ్యాపారం, లాభదాయకతను బట్టి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
రూ. 250 కోట్ల పెట్టుబడితో 2020 మార్చి నాటికి దేశవ్యాప్తంగా 12 కొత్త నగరాల్లో క్లౌడ్ కిచెన్స్ ఏర్పాటు చేయనున్నామని గత ఏడాది డిసెంబరు లో ప్రకటించింది. చైనా తర్వాత క్లౌడ్ కిచెన్ల సౌకర్యాన్ని అందిస్తున్న రెండో అతిపెద్ద దేశంగా ఇండియా అవతరిస్తుందని, 8 వేల కొత్త ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నట్టు ప్రకటించింది. కానీ ప్రస్తుతం పరిస్థితులు తారుమారుకావడంతో తాజా నిర్ణయం తీసుకుంది. కాగా ఇప్పటికే తమ ఉద్యోగులలో13 శాతం మందిని తొలగించినట్లు ఇటీవల ప్రముఖ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో ప్రకటించిన సంగతి తెలిసిందే. కొన్ని ఆంక్షల సడలింపులతో లాక్ డౌన్ 4.0 ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది. (కుప్పకూలిన మార్కెట్లు : 9 వేల దిగువకు నిఫ్టీ)
Comments
Please login to add a commentAdd a comment