కెయిర్న్‌కు రూ.30 వేల కోట్ల పెనాల్టీ
క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్‌పై ఐటీ నోటీసులు
న్యూఢిల్లీ: సుమారు రూ. 10,247 కోట్ల క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్‌ను గడువులోగా చెల్లించనందుకు గాను.. రూ. 30,700 కోట్లు పెనాల్టీగా కట్టాలంటూ బ్రిటీష్ దిగ్గజం కెయిర్న్ ఎనర్జీకి ఆదాయ పన్ను విభాగం తాజాగా నోటీసులు ఇచ్చింది.
గత లావాదేవీలకు కూడా వర్తించేలా పన్ను విధించడాన్ని సమర్ధిస్తూ ట్యాక్స్ ట్రిబ్యునల్ ఐటీఏటీ ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత.. ఐటీ విభాగం ముందుగా రూ. 10,247 కోట్ల మేర డిమాండ్ నోట్ పంపింది. గడువులోగా పన్ను చెల్లించనందుకు గాను, రిటర్న్స్ ఫైల్ చేయనందుకు గాను జరిమానా ఎందుకు విధించరాదో వివరించాలంటూ మరో షోకాజ్ నోటీసు కూడా పంపింది. జరిమానా విధింపు షోకాజ్ నోటీసుపై వివరణ ఇచ్చేందుకు కెయిర్న్ ఎనర్జీ మరో పది రోజులు గడువు కోరినట్లు ఐటీ విభాగం సీనియర్ అధికారులు తెలిపారు.