అధునాతన టెక్నాలజీతో టామో వాహనాలు
ముంబై: టాటా మోటార్స్ కంపెనీ కొత్తగా టామో సబ్ బ్రాండ్ కింద వాహనాలు అందించనున్నది. ప్రయాణికుల వాహన మార్కెట్లో కోల్పోయిన మార్కెట్ వాటా సాధించడం లక్ష్యంగా టామో బ్రాండ్‌ను టాటా మోటార్స్ ప్రవేశపెడుతోంది. కొత్త టెక్నాలజీతో రూపొందిన వాహనాలను వేగంగా వినియోగదారులకు అందించడం లక్ష్యంగా టామో బ్రాండ్‌ను ఆవిష్కరిస్తున్నామని టాటా మోటార్స్ తెలిపింది. వేగంగా మారుతున్న టెక్నాలజీ, రవాణా అవసరాలకు అనుగుణంగా టామో వాహనాలను అందిస్తామని టాటా మోటార్స్ ఎండీ, సీఈఓ గుంటర్ బషే చెప్పారు. 2019 కల్లా భారత ప్రయాణికుల వాహన మార్కెట్లో మూడో అతి పెద్ద కంపెనీల్లో ఒకటిగా నిలవడం లక్ష్యంగా టామో బ్రాండ్ వాహనాలను అందిస్తామన్నారు.
తక్కువ సంఖ్యలోనే..: టామో బ్రాండ్ కింద అధునాతన టెక్నాలజీతో కూడిన వాహనాలను తక్కువ సంఖ్యలోనే ఉత్పత్తి చేసి మార్కెట్లోకి విడుదల చేస్తామని టాటా మోటార్స్ ప్రెసిడెంట్(ప్యాసింజర్ బిజినెస్) మయాంక్ పరీక్ చెప్పారు. మంచి స్పందన లభించిన వాహనాలను ప్రధానమైన బ్రాండ్, టాటా మోటార్స్‌కు బదిలీ చేసి కొనసాగిస్తామని వివరించారు. క్రాష్ టెస్ట్‌లు, కఠిన పర్యావరణ నిబంధనలకనుగుణంగా ప్రీమియమ్ కార్లను టామో బ్రాండ్‌తో అందించాలని టాటా మోటార్స్ యోచిస్తోంది. వీటి ధరలు అధికంగా ఉండే అవకాశాలున్నాయి.