15 లక్షల మార్కును దాటిన టాటా ఏస్
టాటా కమర్షియల్ వెహికిల్స్ ఎస్‌వీపీ రామకృష్ణన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ చిన్న వాణిజ్య వాహన (ఎస్‌సీవీ) విభాగంలో తన హవాను కొనసాగిస్తోంది. నెలకు సుమారు 12,000 వాహనాలు అమ్ముడవుతున్న ఎస్‌సీవీ రంగంలో టాటా ఏస్ శ్రేణి 85 శాతం వాటాతో అగ్ర స్థానంలో ఉంది. ఆవిష్కరించిన 10 ఏళ్లలో ఏస్ వాహనాలు 15 లక్షల యూనిట్ల విక్రయాలను నమోదు చే శాయి. ఇందులో ప్యాసింజర్ శ్రేణి అయిన ఏస్ మ్యాజిక్, ఏస్ మ్యాజిక్ ఐరిస్ వాహనాలు 4 లక్షల యూనిట్లు ఉన్నాయి.
ఇంజన్ రకం, శక్తి, నిర్మాణం ఆధారంగా 12 రకాల ఏస్ వాహనాలను ఇప్పటి వరకు మార్కెట్లోకి తీసుకొచ్చారు. మొత్తం అమ్మకాల్లో దక్షిణాది రాష్ట్రాల వాటా అత్యధికంగా 35 శాతముందని టాటా మోటార్స్ వాణిజ్య వాహన విభాగం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆర్.రామకృష్ణన్ సోమవారమిక్కడ మీడియాకు తెలిపారు. భారత్‌లో అమ్ముడవుతున్న వాణిజ్య వాహనాల్లో అయిదింట ఒకటి టాటా ఏస్ ఫ్యామిలీ నుంచి ఉందని చెప్పారు. ఎప్పటికప్పుడు ఆధునికత జోడిస్తూ అధిక మైలేజీ వచ్చేలా ఈ వాహనాలకు రూపకల్పన చేశామన్నారు.