టాటా మోటార్స్ లాభం మూడింతలు
కలసివచ్చిన జేఎల్‌ఆర్ జోరు
ముంబై: టాటా మోటార్స్ నికర లాభం(కన్సాలిడేటెడ్)గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో మూడింతలైంది. బ్రిటిష్ అనుబంధ సంస్థ జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్(జేఎల్‌ఆర్) పటిష్టమైన పనితీరు, భారీ, మధ్యతరహా వాణిజ్య వాహన విక్రయాలు జోరుగా ఉండడం, నికర వడ్డీ వ్యయాలు తగ్గడం... దీనికి కారణాలని టాటా మోటార్స్ పేర్కొంది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2014-15) క్యూ4లో రూ.1,717 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో మూడింతలై రూ.5,177 కోట్లకు పెరిగిందని తెలిపింది.
నికర అమ్మకాలు(కన్సాలిడేటెడ్) రూ.67,298 కోట్ల నుంచి 19 శాతం వృద్ధితో రూ.79,926 కోట్లకు పెరిగాయని పేర్కొంది. జాగ్వార్ ల్యాండ్ రోవర్ లాభాలు 30 కోట్ల పౌండ్ల నుంచి 56 శాతం వృద్ధితో 47 కోట్ల పౌండ్లకు, ఆదాయం 583 కోట్ల పౌండ్ల నుంచి 659 పౌండ్లకు పెరిగాయని తెలిపింది. రూ.2 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు 20 పైసలు, ‘ఏ’ ఆర్డినరీ షేరుకు 30 పైసలు చొప్పున డివిడెండ్‌ను ఇవ్వనున్నామని పేర్కొంది.
స్టాండోలోన్ ప్రాతిపదికన చూస్తే, గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.465 కోట్ల నికర లాభం వచ్చిందని, అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.1,164 కోట్ల నికర నష్టాలు వచ్చాయని టాటా మోటార్స్ తెలిపింది. నికర అమ్మకాలు రూ.10,676 కోట్ల నుంచి రూ.12,460 కోట్లకు పెరిగాయని పేర్కొంది.
ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2014-15 లో రూ.4,739 కోట్ల నికర నష్టాలు రాగా, గత ఆర్థిక సంవత్సరంలో రూ.234 కోట్ల నికర లాభం(స్టాండోలోన్) వచ్చిందని తెలిపింది. నికర అమ్మకాలు రూ.35,891 కోట్ల నుంచి 17% వృద్ధితో రూ.41,948 కోట్లకు పెరిగాయని పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో టాటా మోటార్స్ షేర్ బీఎస్‌ఈలో 4% లాభపడి రూ.421 వద్ద ముగిసింది.