రెరా, జీఎస్‌టీ అమల్లోకి వచ్చాక నిర్మాణం పూర్తయిన గృహాలకు గిరాకీ పెరిగింది. కారణం.. వీటికి జీఎస్‌టీ లేకపోవటమే! ఆదాయ పన్ను ప్రయోజనాలు కూడా ఉండటంతో ఇన్వెస్టర్లూ ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ధర కాస్త ఎక్కువైనా సరే నిర్మాణం పూర్తయిన (ఇన్వెంటరీ) గృహాలను కొనేందుకే ఎగబడుతున్నారు.
సాక్షి, హైదరాబాద్: నిర్మాణం పూర్తయి, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసీ) వచ్చిన గృహాలకు వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వర్తించదు. అదే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌లకు 12 శాతం జీఎస్‌టీ ఉంది. ఉదాహరణకు ఫ్లాట్ ఖరీదు రూ.60 లక్షలు అనుకుందాం. ఇది నిర్మాణంలో ఉంటే గనక 12 శాతం జీఎస్‌టీ అంటే రూ.7.2 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అదే నిర్మాణం పూర్తయిందనుకోండి జీఎస్‌టీ కట్టక్కర్లేదు. అంతేకాకుండా గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న గృహాలకు సెక్షన్ 80సీ ప్రకారం రూ.1.5 లక్షల వరకు ఆదాయ పన్ను ప్రయోజనాలు కూడా ఉంటాయి. కానీ, నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్ట్‌లతో పోలిస్తే నిర్మాణం పూర్తయిన వాటిల్లో ధర కాస్త ఎక్కువగా ఉంటుంది మరి.
హైదరాబాద్‌తోపాటూ దేశంలోని ప్రధాన నగరాల్లో గత రెండేళ్లుగా నిర్మాణం పూర్తయిన గృహాలకే డిమాండ్ ఉంది. పనిచేసే ప్రాంతాలకు దగ్గరగా, తమకు అన్ని విధాలా అనుకూలంగా ఉన్న ప్రాంతంలోనే గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇళ్ల కొనుగోళ్లకే కొనుగోలుదారులు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రముఖ రియల్టీ కన్సల్టెన్సీ నివేదిక ప్రకారం.. 2018–19 తొలి త్రైమాసికం నాటికి దేశంలోని 8 ప్రధాన నగరాల్లో 9,45,964 గృహాలు అమ్ముడుపోకుండా (ఇన్వెంటరీ) ఉన్నాయి. ఈ గృహాలు విక్రయమవ్వడానికి ఎంతలేదన్నా 41 నెలల సమయం పడుతుంది. అంటే లెక్కలేనన్ని గృహాలు నిర్మాణం పూర్తయి కొనుగోలుదారులను రారమ్మంటున్నాయన్నమాట.
అద్దె లోంచి సొంతింట్లోకి..
ఈ రోజుల్లో సొంతిల్లు కొందామన్న నిర్ణయం తీసుకున్నాక.. గృహ ప్రవేశం కోసం ఏళ్ల తరబడి ఎదురు చూసే ఓపిక కొనుగోలుదారులకు ఉండట్లేదు. అందుకే నిర్మాణం పూర్తయిన ప్రాజెక్ట్‌లను ఎంచుకుంటున్నారు. నిర్మాణంలో ఆలస్యం, వసతుల ఏర్పాట్లు పూర్తయ్యే వరకూ వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. అప్పటివరకు అద్దె గృహాల్లో ఉన్న వాళ్లు రాత్రికి రాత్రే సొంతింట్లోకి వెళ్లిపోవచ్చు. అద్దె సొమ్మును నెల వారీ ఈఎంఐగా చెల్లించవచ్చు. గృహాన్ని అద్దెకిస్తే ఆదాయాన్ని ఆర్జించవచ్చు.
వాస్తవ పరిస్థితులు తెలుస్తాయ్..
గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ప్రాజెక్ట్‌ల్లో కొనుగోలు చేస్తే.. ప్రాజెక్ట్‌ల్లోని వసతులే కాకుండా గదుల విస్తీర్ణం, నిర్మాణంలోని నాణ్యత, శానిటరీ, ఎలక్ట్రిక్ ఇతరత్రా ఉత్పత్తుల వినియోగం వంటివి బ్రోచర్లు లేదా నమూనా ఫ్లాట్లలో కాకుండా వాస్తవంగా కళ్లతో చూసుకునే వీలుంటుంది. వాస్తవంగా ప్రాజెక్ట్ ఉన్న ప్రాంతం అభివృద్ధి, చుట్టుపక్కల రవాణా సదుపాయాలు, షాపింగ్, మార్కెట్, పార్క్‌లు, సెక్యూరిటీ ఇతరత్రా మౌలిక వసతుల ఏర్పాట్ల గురించి ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు.
పెట్టుబడికైనా సరే..
ఒకవేళ మీరు సొంతంగా ఉండేందుకు కాకుండా పెట్టుబడి కోసం ఇల్లు కొనాలనుకున్నా సరే గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న వాటినే కొనడం ఉత్తమం. ఎందుకంటే కొనుగోలు చేసిన మొదటి నెల నుంచే అద్దె ఆదాయం మొదలవుతుంది గనక. నిర్మాణం పూర్తయిన గృహాలకు బ్యాంక్‌లకు కూడా రుణాన్ని త్వరగా మంజూరు చేస్తాయి. వెంటనే కొనుగోలు నిర్ణయం తీసుకుంటారు గనక డెవలపర్లు కూడా వసతుల్లో, పార్కింగ్ వంటి వాటిల్లో ఆఫర్లు ఇచ్చే అవకాశం ఉంది. రెరా అమల్లోకి వచ్చాక నిర్మాణ గడువును కూడా డెవలపర్లు పెంచేశారు. గతంలో ఒక ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తే మూడేళ్లలో పూర్తి చేస్తామని ప్రకటించే డెవలపర్లు.. రెరా వచ్చాక నాలుగైదు ఏళ్లని ప్రకటిస్తున్నారు. ఎందుకంటే ప్రాజెక్ట్ నిర్మాణంలో ఆలస్యమైతే రెరా చట్టం ప్రకారం కఠిన శిక్షలున్నాయి మరి.
చ.అ.కు 500–800 ఎక్కువ..
ప్రాజెక్ట్ ప్రారంభ దశలోని ధరతో పోలిస్తే నిర్మాణం పూర్తయ్యే నాటికి విక్రయించే గృహాల ధరలు కాస్త ఎక్కువగా ఉంటాయి. చ.అ.కు సుమారు రూ.500–800 ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. అధిక ధర కారణంగా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ (ఆర్‌వోఐ) కూడా తక్కువగా ఉండే ప్రమాదముంది. నిర్మాణం పూర్తయిన ఇళ్లలో సీవరేజ్, డ్రైనేజ్ వంటి నాణ్యత లోపాలను గుర్తించడం కష్టం. ఆయా ప్రాజెక్ట్‌ల నిర్వహణ సక్రమంగా లేకపోతే కొన్నేళ్ల తర్వాత నాణ్యత లోపాలు బహిర్గతమవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment