మిత్సుబిషీతో ‘టీసీఎస్ జపాన్’ విలీనం
51:49 వాటా నిష్పత్తిలో జేవీ ఆవిర్భావం
ముంబై: సాఫ్ట్‌వేర్ సేవల దిగ్గజం టీసీఎస్ జపాన్‌లోని రెండు యూనిట్లను మిత్సుబిషీ కార్పొరేషన్‌కు చెందిన అనుబంధ కంపెనీలో విలీనం చేసేందుకు నిర్ణయించింది. తద్వారా 60 కోట్ల డాలర్ల(రూ. 3,600 కోట్లు) అమ్మకాలను సాధించగల ఐటీ కంపెనీ ఆవిర్భావానికి తెరతీసింది. ఇందుకు వీలు కల్పించే ఒక ఒప్పందంపై సంతకాలు చేసినట్లు టీసీఎస్ తెలిపింది. దీనిలో భాగంగా టీసీఎస్ జపాన్, నిప్పన్ టీసీఎస్ సొల్యూషన్ సెంటర్ సంస్థలను మిత్సుబిషీకి చెందిన ఐటీ ఫ్రంటియర్ కార్పొరేషన్‌లో విలీనం చేయనుంది. ఈ కొత్త కంపెనీలో టీసీఎస్‌కు 51%, మిత్సుబిషీకి 49% చొప్పున వాటా ఉంటుంది.
తదుపరికాలంలో తమ వాటాను 66% వరకూ పెంచుకునేందుకు అవకాశమున్నట్లు టీసీఎస్ ఎండీ ఎన్.చంద్రశేఖరన్ డీల్ సందర్భంగా పేర్కొన్నారు. అన్ని అనుమతులూ లభిస్తే ఈ జూలైలో కార్యకలాపాలు ప్రారంభంకాగలవని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. పూర్తి స్థాయిలో కార్యకలాపాలను విస్తరిస్తే వచ్చే ఆర్థిక సంవత్సరం(2015-16) నుంచి 60 కోట్ల డాలర్ల ఆదాయం లభించగలదని అంచనా వేశారు. కాగా, ఈ జేవీ ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2014-15)లో టీసీఎస్‌కు 35 కోట్ల డాలర్ల వరకూ అదనపు ఆదాయం సమకూరే అవకాశమున్నట్లు డీల్‌పై మోతీలాల్ ఓస్వాల్ అంచనా వేసింది. ఈ వార్తల నేపథ్యంలో బీఎస్‌ఈలో టీసీఎస్ షేరు నామమాత్ర లాభంతో రూ. 2,220 వద్ద ముగిసింది.