టీసీఎస్ లాభం రూ.5,244 కోట్లు | TCS profit of Rs .5,244 crore | Sakshi
Sakshi News home page

టీసీఎస్ లాభం రూ.5,244 కోట్లు

Published Fri, Oct 17 2014 12:43 AM | Last Updated on Thu, Sep 27 2018 4:42 PM

టీసీఎస్ లాభం రూ.5,244 కోట్లు - Sakshi

టీసీఎస్ లాభం రూ.5,244 కోట్లు

క్యూ2లో 13.2 వృద్ధి...
ఆదాయం 23,816 కోట్లు.. 13.5% అప్
షేరుకి రూ.5 మధ్యంతర డివిడెండ్
కంపెనీలో సీఎంసీ విలీనానికి ఓకే

 
ముంబై: దేశీ సాఫ్ట్‌వేర్ అగ్రగామి టీసీఎస్ మిశ్రమ ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికం(2014-15, క్యూ2)లో రూ.5,244 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.4,633 కోట్లతో పోలిస్తే వార్షిక ప్రాతిపదికన 13.2% ఎగసింది.  ఆదాయం రూ. 20,977 కోట్ల నుంచి రూ.23,816 కోట్లకు పెరిగింది. 13.5% వృద్ధి నమోదైంది. మార్కెట్ వర్గాలు క్యూ2లో టీసీఎస్ రూ.5,312 కోట్ల నికర లాభాన్ని, రూ.24,046 కోట్ల ఆదాయాన్ని అంచనా వేశాయి.

సీక్వెన్షియల్‌గా తగ్గింది...
ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో కంపెనీ నికర లాభం రూ.5,567 కోట్లతో పోలిస్తే.. క్యూ2లో లాభం సీక్వెన్షియల్‌గా 5.8 శాతం దిగజారింది. ఆదాయం రూ.22,111 కోట్ల నుంచి 7.7 శాతం పెరిగింది. కాగా, మార్జిన్ విషయానికొస్తే.. 3.16 శాతం దిగజారి 22 శాతానికి పరిమితమైంది. ఇక వార్షికంగా చూస్తే.. స్వల్పంగా 0.07 శాతం తగ్గింది.
     
క్యూ2లో 5 కోట్ల డాలర్ల విలువైన కాంట్రాక్టులు 4 కంపెనీలకి లభించాయి. 2 కోట్ల డాలర్ల విలువైన కాంట్రాక్టులు 9 దక్కాయి.
     
రూ. 1 ముఖ విలువగల ఒక్కో షేరుపై రూ.5 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది.
గురువారం బీఎస్‌ఈలో టీసీఎస్ షేరు ధర స్వల్పంగా 0.77% నష్టంతో రూ.2,679 వద్ద ముగి సింది. మార్కెట్ ముగిశాక ఫలితాలు వెలువడ్డాయి.
 
లక్ష దాటిన మహిళా ఉద్యోగులు...
సెప్టెంబర్ క్వార్టర్‌లో టీసీఎస్‌లో మహిళా ఉద్యోగుల సంఖ్య తొలిసారిగా లక్ష మైలురాయిని అధిగమించిందని హెచ్‌ఆర్ హెడ్ అజోయ్ ముఖర్జీ పేర్కొన్నారు.     క్యూ2లో కంపెనీ స్థూలంగా 20,350 మంది సిబ్బందిని నియమించుకుంది. అయితే, 12,024 మంది కంపెనీని వీడటంతో నికరంగా 8,826 మంది జతయ్యారు. సెప్టెంబర్ చివరికి అనుబంధ సంస్థలతో కలిపి టీసీఎస్ మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,13,717కు చేరింది.   కాగా, 2014-15లో 55,000 మందిని నియమించుకోవాలనేది తమ లక్ష్యంకాగా, ఇప్పటికే 36 వేల మందిని నియమించుకున్నట్లు టీసీఎస్ ఎండీ, సీఈఓ ఎన్. చంద్రశేఖరన్ చెప్పారు. పటిష్టమైన ఆదాయం, వనరుల వినియోగం కారణంగా క్యూ2లో  స్థిరమైన పనితీరును కొనసాగించగలిగామన్నారు.
 
టీసీఎస్‌లో సీఎంసీ విలీనం...
అనుబంధ ఐటీ సంస్థ సీఎంసీ లిమిటెడ్‌ను విలీనం చేసుకోనున్నట్లు టీసీఎస్ గురువారం ప్రకటించింది. ఈ ప్రతిపాదనకు ఇరు కంపెనీల డెరైక్టర్ల బోర్డులు ఆమోదం తెలిపినట్లు పేర్కొంది. 1:1.26 నిష్పత్తిలో షేర్ల కేటాయింపు ఉంటుందని.. అంటే ప్రతి 100 సీఎంసీ షేర్లకుగాను వాటాదారులకు 79 టీసీఎస్ షేర్లు ఇవ్వనున్నట్లు వివరించింది. కాగా, ఈ ఏడాది రెండో క్వార్టర్‌లో సీఎంసీ కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.76 కోట్లుగా నమోదైంది.

క్రితం ఏడాది ఇదే క్వార్టర్‌లో లాభం రూ.67.31 కోట్లతో పోలిస్తే 13.5% పెరిగింది. ఇక మొత్తం ఆదాయం 6.19% వృద్ధితో రూ.581 కోట్ల నుంచి రూ.617 కోట్లకు చేరింది. 1975లో ప్రభుత్వ రంగంలో సీఎంసీ ఏర్పాటైంది. డిజిన్వెస్ట్‌మెంట్‌లో భాగంగా 1990వ దశకంలో దీన్ని టీసీఎస్ కొనుగోలు చేసింది. ప్రస్తుతం కంపెనీలో 11,000 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. సీఎంసీ షేరు ధర గురువారం బీఎస్‌ఈలో 1.92% లాభపడి రూ.2,188 వద్ద స్థిరపడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement