
న్యూఢిల్లీ: టెక్ మహీంద్రా కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ.1,064 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.836 కోట్లు నికర లాభం వచ్చిందని, 27 శాతం వృద్ధి సాధించామని టెక్ మహీంద్రా తెలిపింది. సీక్వెన్షియల్‌గా చూస్తే నికర లాభం 19 శాతం పెరిగింది. రూపాయి పతనం ప్రధాన కారణంగా మార్జిన్లు పెరగడంతో నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని టెక్ మహీంద్రా సీఈఓ, ఎమ్‌డీ సీపీ గుర్నానీ పేర్కొన్నారు.
గత క్యూ2లో రూ.7,606 కోట్లుగా ఉన్న ఆదాయం ఈ క్యూ2లో 13 శాతం వృద్ధితో రూ.8,630 కోట్లకు పెరిగిందని తెలిపారు. అయితే సీక్వెన్షియల్‌గా చూస్తే, ఆదాయ వృద్ధి 4 శాతమే పెరిగిందని, హెల్త్‌కేర్ సెగ్మెంట్ మందకొడి పనితీరే దీనికి కారణమని వివరించారు. డాలర్ల పరంగా చూస్తే, నికర లాభం 16 శాతం వృద్ధితో 15 కోట్ల డాలర్లకు, ఆదాయం 3 శాతం వృద్ధితో 121 కోట్ల డాలర్లకు పెరిగాయని చెప్పారు. ఎబిటా 46 శాతం (సీక్వెన్షియల్‌గా చూస్తే 19 శాతం) పెరిగి రూ.1,619 కోట్లకు పెరిగిందని, ఎబిటా మార్జిన్ 4.3 శాతం పెరిగి 18.8 శాతానికి చేరాయని వివరించారు.
ఫలితాలు సంతృప్తికరం...
ఈ క్వార్టర్ ఆర్థిక ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయని గుర్నానీ తెలిపారు. డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్‌పై దృష్టి సారించడం వల్ల మంచి పనితీరు సాధించామని వివరించారు. కమ్యూనికేషన్ విభాగంలో మంచి డీల్స్ పొందామని, సీక్వెన్షియల్‌గా చూస్తే, డిజిటల్ విభాగం ఆదాయం 10 శాతం వృద్ధి చెందిందని పేర్కొన్నారు. ఎబిటా మార్జిన్, ఆదాయాల్లో మంచి వృద్ధి సాధించామని వివరించారు. ఈ క్యూ2లో 55 కోట్ల డాలర్ల డీల్స్‌ను ఈ కంపెనీ సాధించింది. ఒక్క క్వార్టర్‌లో ఈ స్థాయిలో డీల్స్ సాధించడం ఈ కంపెనీకి ఇదే మొదటిసారి.
రూ.7,900 కోట్ల నగదు నిల్వలు..
నగదు, నగదు సమానమైన నిల్వలు రూ.7,900 కోట్లుగా ఉన్నాయని గుర్నాని పేర్కొన్నారు. యాక్టివ్ క్లయింట్ల సంఖ్య 930కు పెరిగిందని వివరించారు. ఈ సెప్టెంబర్ క్వార్టర్లో 4,839 కొత్త ఉద్యోగాలు ఇచ్చామని, దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 1.18 లక్షలకు పెరిగిందని పేర్కొన్నారు. వీరిలో 72,534 మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులని, 39,407 మంది బీపీఓ ఉద్యోగులని వివరించారు. ఈ క్యూ1లో 19 శాతంగా ఉన్న ఆట్రీషన్ రేటు ఈ క్యూ2లో 20 శాతానికి పెరిగింది.
ఆర్థిక ఫలితాలు అంచనాలను మించడంతో బీఎస్‌ఈలో టెక్ మహీంద్రా షేర్ 2.9 శాతం లాభపడి రూ.684 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment