
టెక్ మహీంద్రా ‘స్టార్టప్ గ్యారేజ్’ త్వరలో...
దేశీ ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా తమ అంతర్గత స్టార్టప్‌ల కోసం ప్రత్యేకంగా ఒక ‘స్టార్టప్ గ్యారేజ్’ను ఏర్పాటు చేయనుంది.
ముంబై: దేశీ ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా తమ అంతర్గత స్టార్టప్‌ల కోసం ప్రత్యేకంగా ఒక ‘స్టార్టప్ గ్యారేజ్’ను ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే తమ సంస్థ నేతృత్వంలో ఎంట్రప్రెన్యూర్లు చాలా స్టార్టప్ కంపెనీలను నిర్వహిస్తున్నారని.. వీటన్నింటినీ ఒక గొడుగుకిందికి చేర్చడం కోసం దీన్ని నెలకొల్పుతున్నట్లు టెక్ మహీంద్రా చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్, ‘గ్రోత్ ఫ్యాక్టరీస్’ కార్యకలాపాల హెడ్ జగదీష్ మిత్రా పేర్కొన్నారు. స్టార్టప్‌లకు ఇది తొలి కార్పొరేట్ గ్యారేజ్‌గా నిలవనుందని కూడా ఆయన వెల్లడించారు. ‘ప్రస్తుతం మాకున్న 1.05 లక్షల మంది ఉద్యోగుల నుంచి దాదాపు 15 రకాల స్టార్టప్‌లు ఇప్పుడు నడుస్తున్నాయి.
వీటికి విభిన్న వ్యాపార వాతావరణం అవసరం. అందుకే స్టార్టప్ గ్యారేజీ ఏర్పాటు చేస్తున్నాం. దీనివల్ల స్టార్టప్‌లు స్వతంత్రంగా పనిచేసేందుకు వీలవుతుంది. వీటన్నింటినీ ఒకే చోటికి చేర్చడం వల్ల పర్యవేక్షణ కూడా సులువు అవుతుంది’ అని మిత్రా వివరించారు. స్టార్టప్‌లను ప్రోత్సహించడం కోసం టెక్ మహీంద్రా ఇప్పటికే 15 కోట్ల డాలర్లతో ఒక ఫండ్‌ను కూడా నెలకొల్పింది.