ఐపీఓ.. బౌండరీ!
♦ పబ్లిక్ ఇష్యూకి వస్తున్న నాలుగు కంపెనీలు
♦ రూ.5,000 కోట్ల సమీకరణ
♦ ముందుగా తేజాస్ నెట్‌వర్క్స్
ముంబై: ఈ నెల ఐపీవో మార్కెట్ కొత్త కళ సంతరించుకోనుంది. నాలుగు కంపెనీలు ప్రజల నుంచి నిధుల సమీకరించేందుకు సిద్ధమయ్యాయి. మొత్తం మీద రూ.5,000 కోట్ల నిధులను సమీకరించనున్నాయి. వీటిలో ముందుగా తేజాస్ నెట్‌వర్క్స్, ఆ తర్వాత ఎరిస్ లైఫ్ సైన్సెస్ ఐపీవోలు రానున్నాయి. తరవాత వరుసలో చిన్న ఫైనాన్షియల్ బ్యాంకు ‘ఏయూ’, సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్(సీడీఎస్‌ఎల్)ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 8 సంస్థలు ఐపీవో రూట్లో రూ.6,335.83 కోట్లను రాబట్టుకున్నాయి.
14 నుంచి తేజాస్ నెట్‌వర్క్స్ ఐపీవో
టెలికం సంస్థలకు ఉత్పత్తులు, డిజైన్ సేవలు అందించే తేజాస్ నెట్‌వర్క్స్ ఐపీవో ఈ నెల 14న ప్రారంభం కానుంది. జూన్ 16న ముగుస్తుంది. ఒక్కో షేరుకు ధరల శ్రేణిని రూ.250–257గా ఖరారు చేశారు. ఈ ఐపీవో ద్వారా సంస్థ రూ.776 కోట్లు సమీకరించనుంది. ఇందులో రూ.450 కోట్ల మేర తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. దీనికి అదనంగా 1,27,11,605 షేర్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయించనున్నారు. ఈ సంస్థలో గోల్డ్‌మ్యాన్ శాక్స్, ఇంటెల్ క్యాపిటల్, ఫ్రంట్‌లైన్ స్ట్రాటజీ, మేఫీల్డ్ ఇన్వెస్టర్లుగా ఉన్నాయి. కనీసం 55 షేర్లకు (ఒక లాట్) దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు
చిన్న ఫైనాన్స్ బ్యాంకు సేవలకు ఆర్‌బీఐ నుంచి లైసెన్స్ పొందిన 10 సంస్థల్లో ఏయూ ఒకటి. ఈ సంస్థ రూ.2,000 కోట్లను సమీకరించేందుకు ఈ నెలాఖరులో ఐపీవోకు రావాలనే ప్రణాళికతో ఉన్నట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరిలో ఐపీవో కోసం సెబీకి దరఖాస్తు చేసుకోగా, మార్చిలో అనుమతి లభించింది. ప్రస్తుతం ఐపీవోకు ముందస్తు రోడ్‌షో జరుగుతోంది. ఈ ఐపీవో పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ విధానంలో ఉంటుంది. ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్, వార్‌బర్గ్ పింకస్, క్రిస్ క్యాపిటల్, కేదార క్యాపిటల్ సంస్థలు ఐపీవో ద్వారా తమ వాటాలను విక్రయిస్తాయి. అంటే ఈ ఐపీవోతో సమకూరే నిధులన్నీ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన వారికే వెళతాయి. ఈక్విటాస్, ఉజ్జీవన్ సంస్థల తర్వాత స్టాక్ మార్కట్లో నమోదయ్యే మూడో చిన్న బ్యాంకు ఏయూనే అవుతుంది.
జూన్ 16 నుంచిఎరిస్ లైఫ్‌సైన్సెస్ ఐపీవో
ప్రతిపాదిత ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)కి సంబంధించి షేరు ధర శ్రేణిని రూ. 600–603గా నిర్ణయించినట్లు ఎరిస్ లైఫ్‌సైన్సెస్ వెల్లడించింది. ఐపీవో ద్వారా రూ.1 ముఖవిలువ గల 2,88,75,000 షేర్లను కంపెనీ విక్రయిస్తోంది. జూన్ 16న ప్రారంభమయ్యే ఆఫర్ 20న ముగుస్తుంది. ఎరిస్ లైఫ్‌సైన్సెస్ .. బ్రాండెడ్ ఫార్మా ఉత్పత్తుల అభివృద్ధి, తయారీ తదితర కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అస్సాంలోని గువాహటిలో సొంత ప్లాంటు ఉంది.
సీడీఎస్‌ఎల్.. 400 కోట్లు
డిపాజిటరీ సేవల్లోని సీడీఎస్‌ఎల్ ఐపీవో సైతం ఈ నెలలోనే మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ సంస్థ ఐపీవో ద్వారా రూ.400 కోట్లను సమీకరించనుంది. ఇప్పటికే సెబీ ఆమోదం లభించింది. కంపెనీలో బీఎస్‌ఈ, స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, బ్యాంకు ఆఫ్ బరోడా, కల్‌కత్తా స్టాక్ ఎక్సేంజ్‌కు మొత్తం 65.65 శాతం వాటా ఉంది. ఒక్క బీఎస్‌ఈకే 50 శాతం వాటా ఉంది. ఐపీవోలో ప్రస్తుత ఇన్వెస్టర్లే కొద్ది మేర వాటాలను విక్రయించనున్నారు. అయితే, ఈ ఐపీవో తేదీలను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది.