చల్లబడిన నూనె ధరలు
తాడేపల్లిగూడెం : పామాయిల్ ధర దిగివచ్చింది. మార్కెట్‌లో డిమాండ్ తగ్గడం, రాష్ట్ర విభజన కారణంగా టిన్ నంబర్లు బిల్లులు మారడం, ఆయిల్ కంపెనీల వ్యాపార సంబంధ సాఫ్ట్‌వేర్‌లను మార్చుకోవడం తదితర కారణాల వల్ల వ్యాపారం మందగించింది. మార్కెట్‌లో ఉన్న స్టాకునకు డిమాండ్ లేక పామాయిల్ ధర ఒక్కసారిగా పడిపోయింది. పదిహేను కిలోల డబ్బా రూ.990 నుంచి రూ.1000 వరకు పలకగా, ప్రస్తుతం రూ.900కు పడి పోయింది. రైస్ బ్రాన్ ఆయిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. 15 కిలోల డబ్బా రూ.1,040 నుంచి రూ.వెరుు్యకి తగ్గింది. సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర మాత్రం 15 కిలోల డబ్బా రూ.1,175 వద్ద స్థిరంగా ఉండి పోయింది. సన్‌ఫ్లవర్ మార్కెట్‌లో మనుగడలో ఉన్న దిగుమతి దారులకు గతంలో ఉక్రెయిన్ నుంచి తీవ్ర పోటీ ఏర్పడింది. ఒక దశలో సన్‌ఫ్లవర్ మార్కెట్‌ను ఉక్రెయిన్ శాసిస్తుందా అనే పరిస్థితి వచ్చింది.
అయితే తాజాగా ఉక్రెయిన్‌లో తలెత్తిన సంక్షోభం నేపథ్యంలో అక్కడి నుంచి సన్‌ఫ్లవర్ దిగుమతులు తగ్గాయి. ఆవకాయ పచ్చళ్ల సీజన్ కావడంతో వే రుశనగ నూనె ధర మాత్రం స్వల్పంగా పెరిగింది. 15 కిలోల డబ్బా గుత్త మార్కెట్‌లో రూ.1,350 నుంచి రూ.1,400 కు పెరిగింది. పామాయిల్ ధర చల్లబడటంతో అల్పాదాయ వర్గాలు కాస్త ఉపశమనం పొందాయి. ఈ సమయంలో కాకినాడ, కృష్ణపట్నం పోర్టుల నుంచి నూనెల లోడింగ్ జరగలేదు.