జోరుగా షేర్ల సంపద
- గత ఏడాది రూ.28 లక్షల కోట్లకు స్టాక్ మదుపర్ల సంపద
- 30 శాతం లాభపడిన సెన్సెక్స్. నిఫ్టీలు
- పెరిగిన లిస్టెడ్ కంపెనీల సంఖ్య
ముంబై: స్టాక్ మార్కెట్లు గత ఏడాది మంచి రాబడులను ఇచ్చాయి. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల సంపద 2014లో రూ.28 లక్షల కోట్లు పెరిగింది. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల సంపద పెరగడం ఇది వరుసగా నాలుగో ఏడాది. ఈ ఏడాది కూడా ఇన్వెస్టర్ల సంపద రూ. 100 లక్షల కోట్ల మైలురాయిని దాటేసింది.
గత ఏడాది సెన్సెక్స్ 6,329 పాయింట్లు(30 శాతం) లాభపడింది. నిఫ్టీ కూడా 30 శాతం(1,979 పాయింట్లు) లాభపడింది. సెన్సెక్స్ అత్యధిక పాయింట్లు లాభపడిన సంవత్సరాల్లో గత ఏడాది రెండో స్థానంలో ఉంది. 2009లో సెన్సెక్స్ 7,817 పాయిట్లు లాభపడింది. ఇప్పటి వరకూ ఇదే అధిక వార్షిక లాభదాయకత.
రికార్డ్ స్థాయికి సెన్సెక్స్
గత ఏడాది నవంబర్ 28న సెన్సెక్స్ జీవిత కాల గరిష్ట స్థాయి(28,822 పాయింట్లు)కి చేరింది. స్టాక్ మార్కెట్లలో లిస్టైన కంపెనీల సంఖ్య పెరగడం కూడా ఇన్వెస్టర్ల సంపద పెరగడానికి దోహదపడింది. ప్రస్తుతం ఈ లిస్టెడ్ కంపెనీల సంఖ్య 5,542గా ఉంది. ప్రభుత్వం తెస్తున్న ఆర్థిక సంస్కరణలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను పెంపొందిస్తున్నాయని నిపుణులంటున్నారు.
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ), ప్రత్యక్ష నగదు బదిలీ, డీజిల్‌పై నియంత్రణ తొలగింపు, కార్మిక చట్టాల సరళీకరణ, బొగ్గు గనుల కేటాయింపు, భూ సేకరణపై ఆర్ఢినెన్స్, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం... ఇవన్నీ ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని బాగా పెంచాయని జైఫిన్ అడ్వైజర్స్ సీఈఓ దేవేంద్ర నెవ్‌గీ పేర్కొన్నారు. కాగా స్టాక్ మార్కెట్లో అత్యంత విలువైన కంపెనీగా టీసీఎస్ అవతరించింది.
ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 5,00,396 కోట్లుగా ఉంది. అత్యధిక మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీలుగా టీసీఎస్ తర్వాతి స్థానాల్లో ఐటీసీ, ఓఎన్‌జీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, కోల్ ఇండియాలు నిలిచాయి. గత ఏడాది విదేశీ ఇన్వెస్టర్లు 1,600 కోట్ల డాలర్లు భారత స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేశారు.
గత ఏడాది యాక్సిస్ బ్యాంక్ అత్యధిక వృద్ధి సాధించిన షేర్‌గా నిలిచింది. యాక్సిస్ బ్యాంక్ షేర్ 94 శాతం వృద్ధి చెందింది. ఇండస్‌ఇండ్ బ్యాంక్, బీపీసీఎల్, మారుతీ సుజుకీ, ఎస్‌బీఐ, పీఎన్‌బీ, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు 70-90 శాతం రేంజ్‌లో రాణించాయి.